శశికళను చూడండి..ఏమయిందో

February 15, 2017


img

ఏపి సిఎం చంద్రబాబు నాయుడు శశికళని ఉద్దేశ్యించి ఈరోజు చాలా ఘాటు వాఖ్యలు చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ, “రాజకీయాల ద్వారా అక్రమంగా కోట్లు పోగేసుకొంటున్న శశికళ వంటి నేతలని చూసి సుప్రీంకోర్టు కూడా తీవ్ర ఆవేదన, ఆగ్రహం వ్యక్తం చేసింది. రాజకీయ నాయకులు ప్రజల డబ్బు దోచేస్తున్నారని సుప్రీంకోర్టు వంటి అత్యున్నత న్యాయస్థానం కూడా చాలా బాధపడింది. తమిళనాడులో మాదిరిగానే ఇక్కడ కూడా ఒక పార్టీ అధికారంలోకి రాలేదు కానీ శశికళ కంటే అనేక రెట్లు ఆస్తులు పోగేసుకోవడం మీరు అందరూ చూశారు. అటువంటివారికి మద్దతు పలకడం మంచిదా కాదా..అని ఆలోచించుకోవలసిందిగా నేను ప్రజలను కోరుతున్నాను,” అని అన్నారు. 

విశేషం ఏమిటంటే, చంద్రబాబు ఈ మాటలు చెపుతున్నప్పుడు ఆయన వెనుకే అవినీతి ఆరోపణలు మూటగట్టుకొన్న మంత్రి గంటా శ్రీనివాస రావు నిలబడున్నారు. ఆయనకు చెందిన సంస్థలు విశాఖలో ఇండియన్ బ్యాంక్ కు రూ.141.68 కోట్లు బాకీలు చెల్లించనందుకు వాటి ఆస్తులను స్వాధీనం చేసుకోవడానికి బ్యాంక్ సిద్దం అయ్యింది. ఆయనపై ఇంకా కొన్ని అవినీతి ఆరోపణలు అప్పుడప్పుడు వినిపిస్తూనే ఉన్నాయి. ఇక తెదేపా ఎంపి, కేంద్రమంత్రి సుజన చౌదరి కూడా మారిషస్ బ్యాంక్ కు రూ.104 కోట్లు ఎగవేసినట్లు ఆరోపణలు రావడం, ఆయనకు కోర్టు నాన్-బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేయడం అందరికీ తెలిసిందే. ఏపి మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ రాజధాని అమరావతి ప్రాంతంలో వేల ఎకరాలు బినామీ పేర్లతో కొనుగోలు చేశారని జగన్మోహన్ రెడ్డి ఆరోపిస్తున్నారు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అవినీతి, అక్రమాలకు పాల్పడుతోందని, అవినీతి మార్గాల ద్వారా సంపాదించుకొన్న డబ్బును దాచుకోవడానికే చంద్రబాబు నాయుడు తరచూ విదేశాలకు వెళ్ళివస్తుంటారని జగన్మోహన్ రెడ్డి నిత్యం ఆరోపిస్తూనే ఉంటారు. ఓటుకు నోటు కేసు గురించి అందరికీ తెలిసిందే. కనుక శశికళవైపు చంద్రబాబు ఒక వేలు చూపితే, నాలుగు వేళ్ళు ఆయననే చూపిస్తున్నాయని మరిచిపోకూడదు. 

శశికళకు ఎదురైన ఈ చేదు అనుభవం నుంచి రాజకీయ నేతలందరూ గుణపాఠం నేర్చుకోవడం చాలా మంచిది. ఆమెకు ఎదురైన అనుభవం తమకు ఎదురు కాదనే భ్రమలో బ్రతికితే, రాజకీయ పరిస్థితులు తారుమారైనప్పుడు ఆమెకు ఎదురైన అనుభవమే తమకు ఎదురవడం ఖాయమని గుర్తుంచుకొంటే చాలా మంచిది. 


Related Post