సమంతపై షబ్బీర్ అక్కసు దేనికి?

February 15, 2017


img

రాజకీయాలలో ఉన్నవాళ్ళు తమ ప్రత్యర్ధులపై విమర్శలు చేస్తుండటం సహజమే కానీ కొన్నిసార్లు అవి చాలా అర్ధరహితంగా అసందర్భంగా కనిపిస్తుంటాయి. మంత్రి కేటిఆర్, సినీ నటి సమంతలపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ చేసిన విమర్శలు కూడా అలాగే ఉన్నాయి. 

చేనేత కార్మికుల పట్ల మంత్రి కేటిఆర్ ఎందుకు అంత ప్రేమ చూపిస్తున్నారో అర్ధం కావడం లేదని అన్నారు. అసలు కేటిఆర్ సిరిసిల్లాలో చేనేత కార్మికుల కోసం ఏమి చేశారని ఆయన చేనేతని తన భుజ్జాన్న వేసుకొని తిరుగుతున్నారని షబ్బీర్ అలీ ప్రశ్నించారు. చేనేతకు బ్రాండ్ అంబాసిడర్ గా కేరళకు చెందిన సినీనటి సమంత తప్ప కేటిఆర్ కి తెలంగాణాలో మరెవరూ కనపడలేదా? అని ప్రశ్నించారు. అది తెలంగాణా ఆడపడచులను అవమానించడమేనని షబ్బీర్ అలీ అన్నారు. 

ముఖ్యమంత్రి కేసీఆర్ తో నటుడు నాగర్జునకున్న సన్నిహిత సంబంధాల కారణంగానే ఎన్-కన్వెన్షన్ సెంటర్  కూల్చివేత నిలిచిపోయిందని, సమంత ఇప్పుడు నాగార్జున ఇంటికి కోడలుగా వెళ్ళబోతున్నందునే ఆమెను చేనేతకు బ్రాండ్ అంబాసిడర్ గా నియమించి ఉండవచ్చని షబ్బీర్ అలీ అనుమానం వ్యక్తం చేశారు. 

సమంతను తెలంగాణా ప్రభుత్వం కానీ మంత్రి కేటిఆర్ గానీ బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించమని ఆహ్వానించలేదు. చేనేతపై ఉన్న మక్కువ, చేనేత కార్మికుల కష్టాల పట్ల సానుభూతితోనే ఆమె చేనేతకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించడానికి స్వచ్చందంగా ముందుకు వచ్చారని, దాని కోసం ఆమె ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోబోవడం లేదనే సంగతి షబ్బీర్ అలీకి తెలియదనుకోలేము. 

అందరినీ చేనేత వస్త్రాలు ధరించమని మంత్రి కేటిఆర్ ప్రోత్సహిస్తే అందులో షబ్బీర్ అలీకి ఏమి తప్పు కనబడిందో అర్ధం కాదు. కాంగ్రెస్ పార్టీ పదేళ్ళ పాటు సమైక్యరాష్ట్రాన్ని పాలించినా ఏనాడూ చేనేత కార్మికుల కష్టాలను పట్టించుకోలేదు. అందుకే నేటికీ వారి పరిస్థితి అంత దయనీయంగా ఉంది. కానీ మంత్రి కేటిఆర్ చొరవ తీసుకొని చేనేత కార్మికుల సంక్షేమం కోసం గట్టి ప్రయత్నాలు చేస్తుంటే అది కూడా షబ్బీర్ అలీకి తప్పుగానే కనబడుతోంది. 

తెలుగు సినీ నటులలో నాగార్జున ఒక్కడే కాదు..తెదేపాకు చెందిన బాలకృష్ణతో సహా సినీపరిశ్రమలో చాలా మంది ప్రముఖులు ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులతో సన్నిహితంగా మెలుగుతుంటారు. వారు కూడా సినీ ప్రముఖులతో స్నేహపూర్వకంగా వ్యవహరిస్తుండటం అందరూ చూస్తూనే ఉన్నారు. నిజానికి అటువంటి సహృద్భావవాతావరణం నెలకొని ఉన్నందుకు అందరూ సంతోషించాలి. అభినందించాలి. కానీ షబ్బీర్ అలీ విమర్శిస్తున్నారు. 

అయినా తెలంగాణా ప్రభుత్వం సానియా మీర్జాకు కోటి రూపాయలు చెల్లించి తెలంగాణా బ్రాండ్ అంబాసిడర్ గా నియమించుకొన్నప్పుడు ఏమీ అభ్యంతరం చెప్పని షబ్బీర్ అలీ, సమంత ఉచితంగా చేనేత ఉత్పత్తులకు ప్రచారం చేస్తానని ముందుకు వస్తే ఆమెను అభినందించకపోగా చాలా చులకనగా మాట్లాడటం చవకబారు రాజకీయమే.


Related Post