శశికళ కధ: అందరికీ ఒక గుణపాఠం

February 15, 2017


img

తమిళనాడులో ఇంతవరకు జరిగిన, ఇంకా జరుగుతున్న రాజకీయ పరిణామాలన్నీ మన దేశంలో అన్ని రాజకీయ పార్టీలకు, వాటి నేతలకు ఒక హెచ్చరికగా భావించవచ్చు. వాటిలో వ్యక్తిపూజ, అవినీతి, అధికార లాలస అనే మూడు దుర్లక్షణాలు ప్రస్పుటంగా కనిపించాయి. 

ఒక రాజకీయ పార్టీ ఒకే వ్యక్తి కేంద్రంగా వ్యక్తిపూజలో మునిగిపోతే ఆ పార్టీ భవిష్యత్, ఒకవేళ అది అధికారంలో ఉన్నట్లయితే ఆ రాష్ట్ర భవిష్యత్ ఏవిధంగా అయోమయంలో పడతాయో అర్ధం చేసుకోవడానికి గొప్ప ఉదాహరణలుగా స్వర్గీయ జయలలిత, శశికళ వారి పార్టీ కనబడుతున్నాయి. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే నేటికీ ఆ పార్టీలో ఎవరూ వ్యక్తిపూజను మానుకోలేదు. 

అవినీతికి పాల్పడినవారు ఎంత పెద్ద పదవిలో ఉన్నా అదృష్టం కలిసిరాకపోతే ఏమవుతుందో ఇంతకుముందు జయలలిత ద్వారా తెలిసింది. ఇప్పుడు శశికళ ద్వారా మరోసారి ప్రత్యక్షంగా చూస్తున్నాము. కనుక అవినీతికి పాల్పడిన నేతలు కలకాలం శిక్ష నుంచి తప్పించుకోలేరని నిరూపితం అయ్యింది. 

నిజానికి అక్రమాస్తుల కేసులో స్వర్గీయ జయలలిత ఏ-1 ముద్దాయిగా ఉన్నారు. ఆమెకు కూడా నాలుగేళ్ల జైలు శిక్ష, రూ.100 కోట్లు జరిమానా విదించబడింది. ఆమె కొన్ని రోజులు జైల్లో ఉండి వచ్చారు కూడా. కానీ చివరికి ఏదో విధంగా ఆమె ఆ శిక్ష నుంచి తప్పించుకోగలిగారు. అంతే కాదు..ప్రజలందరి అభిమానం సంపాదించుకొని అందరిచేత ‘అమ్మ’ అనిపించుకొని సగౌరవంగా ఈ లోకం నుంచి వెళ్ళిపోయారు. 

కానీ అదే కేసులో ఏ-2 దోషిగా నిర్ధారించబడిన శశికళ మాత్రం ప్రజల చేత అసహ్యించుకోబడటం, అదే కేసులో జైలు శిక్ష కూడా అనుభవించవలసిరావడం గమనార్హం. అందుకు రెండు ప్రధాన కారణాలు కనిపిస్తున్నాయి. 1.అవినీతి. 2.పదవీ కాంక్ష. 

అధికారంలో ఉన్నవారు అవినీతికి పాల్పడితే ప్రజలు క్షమించవచ్చునేమో కానీ న్యాయస్థానాలు క్షమించవని ఈ కేసులో నిరూపితమైంది. కానీ మళ్ళీ దానికి ఒక మినహాయింపు కనబడుతోంది. బలమైన మానవసంబంధాలు కలిగి ఉన్నట్లయితే ఆ శిక్షలను నిరవధికంగా వాయిదా వేసుకోవచ్చని స్వర్గీయ జయలలితతో సహా అనేకమంది నేతలు నిరూపిస్తూనే ఉన్నారు. కానీ శశికళ అహంకారంతో వ్యవహరించడం వలననే ఆమె జైలుకు వెళ్ళవలసి వస్తోందనేది నిర్వివాదాంశం.మానవసంబంధాలను నిర్లక్ష్యం చేస్తే, సమాజం కూడా ఎంత నిర్దయగా వ్యవహరిస్తుందో శశికళ ట్రాజెడీ కధలో చూశాము. 

రాజకీయ నాయకులు అందరికీ పదవీ కాంక్ష ఉండటం సహజమే. కానీ అది మరీ ఎక్కువతే ఏమవుతుందనేది శశికళ ఉదంతం కళ్ళకు కట్టినట్లు చూపిస్తోంది. కనుక రాజకీయ పార్టీలన్నీ ఈ వ్యక్తిపూజ, అవినీతి, పదవీ లాలసకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ప్రజాస్వామ్య విధానాల ప్రకారం ముందుకు సాగుతున్నంత కాలం వారికి న్యాయస్థానాలు, రాజ్యాంగం చివరికి  ప్రజలు కూడా అండగా నిలిచి కాపాడుతుంటారు. 


Related Post