శశికళ జైలుకి..జగన్ పరిస్థితి ఏమిటి?

February 14, 2017


img

  అక్రమాస్తుల కేసులలో దోషిగా నిర్ధారించబడిన శశికళ జైలుకి వెళ్ళబోతున్నందున ఇప్పుడు జగన్ పరిస్థితి గురించి ఆలోచించవలసి వస్తోంది. ఎందుకంటే ఆయనపై అక్రమాస్తుల కేసులలో ఒకటీ రెండూ కాదు..ఏకంగా 11 ఛార్జ్ షీట్లు దాఖలై ఉన్నాయి. వాటినే ఈడి కూడా లెక్కలోకి తీసుకొన్నందున అధనంగా మరో అన్ని కేసులు ఆయనపై ఉన్నట్లు భావించవలసి ఉంటుంది.

ఈ సందర్భంగా ప్రముఖ నటుడు కమల్ హాసన్ నిన్న చేసిన ఒక ట్వీట్ గురించి చెప్పుకోవచ్చు. “కొందరు కేసుల నుంచి తప్పించుకోనేందుకే అధికారం కోరుకొంటే, మరికొందరి ప్రజల మీద అభిమానంతోనే చేపడుతుంటారు. గాంధీజీ రెండవ కోవకు చెందినవారు,” అని ట్వీట్ చేశారు.

జగన్ కూడా శశికళలాగే ముఖ్యమంత్రి అయిపోదామని చాలా తహతహలాడుతున్నారు. శశికళలాగ కేంద్రంతో నేరుగా గొడవపడకపోయినప్పటికీ, ప్రత్యేక హోదా పేరుతో కేంద్రాన్ని ఇబ్బంది పెడుతూనే ఉన్నారు. రాష్ట్రంలో భాజపాను, దాని మిత్రపక్షమైన తెదేపాలను ప్రజల ముందు దోషులుగా నిలబెట్టే ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ముఖ్యంగా కేంద్రంతో మంచి బలమైన స్నేహసంబందాలున్న చంద్రబాబు నాయుడుపై జగన్, ఆయన పార్టీ నేతలు నిత్యం తీవ్ర విమర్శలు చేస్తూనే ఉన్నారు. ముఖ్యమంత్రిని చెప్పులు, రాళ్ళు, చీపుర్లతో తరిమి కొట్టాలంటూ జగన్ ప్రజలను రెచ్చగొడుతున్నారు. 

ఇక భాజపాతో తెదేపా పొత్తులు తెంచుకొంటే దానితో జత కట్టాలని జగన్ చాలా ఆశగా, ఓపికగా ఎదురు చూస్తూనే ఉన్నారు. ఆ రెండింటి మద్య స్నేహాన్ని ‘ప్రత్యేక హోదా’ అనే కత్తెరతో కత్తిరించేందుకు చాలా ప్రయత్నాలు చేశారు కానీ అవి ఫలించలేదు. జగన్ ఎత్తులను గమనిస్తూ చంద్రబాబు నాయుడు ఎప్పటికప్పుడు కేంద్రంతో తన సంబంధాలు తెగిపోకుండా చాలా జాగ్రత్త పడుతుండటం అందరూ చూస్తూనే ఉన్నారు కనుక రాష్ట్ర స్థాయిలో తెదేపా-భాజపాల సంబంధాలు కొంచెం బలహీనంగా కనిపిస్తున్నప్పటికీ డిల్లీలో మాత్రం చాలా బలంగా ఉన్నాయి. 

జగన్ విమర్శలు, వ్యూహాలకి ఆ కేసులకి నేరుగా ఎటువంటి సంబందమూ లేకపోవచ్చు. రెంటినీ ముడిపెట్టి చూడటం సరికాకపోవచ్చు. కానీ శశికళకు ఎదురైన చేదు అనుభవం చూసిన తరువాత, ఎక్కడో అక్కడ ఆ కేసులకి, రాజకీయ వ్యూహాలకి మద్య లింక్ ఉన్నట్లుగానే కనబడుతోంది. కనుక జగన్ నెత్తి మీద కూడా కత్తి వ్రేలాడుతూనే ఉందని చెప్పక తప్పదు. కనుక జగన్ కూడా కాస్త ఆలోచించుకొని ముందడుగు వేస్తుండటం చాలా మంచిదేమో? 


Related Post