చిన్నమ్మ లెక్క ఎక్కడ తప్పింది?

February 14, 2017


img

జయలలిత డిశంబర్ 5న మృతి చెందారు. అంటే ఇంకా పూర్తిగా రెండున్నర నెలలు కూడా కాలేదన్నమాట. ఈ కొద్దిపాటి వ్యవధిలోనే శశికళ శరవేగంగా పావులు కదిపి పార్టీ పగ్గాలు చేజిక్కించుకోగలిగారు. అదృష్టం కలిసివస్తే ముఖ్యమంత్రి కూడా అయిపోయేవారే. కానీ అక్కడే ఆమె లెక్క తప్పింది. 

జల్లికట్టుతో కేంద్రాన్ని తమిళనాడుకు దూరంగా పెట్టగలిగామని అనుకొన్నారు కానీ అది తప్పని తేలింది. గవర్నర్ విద్యాసాగర్ రావు ద్వారా కేంద్రప్రభుత్వం ఆమె స్పీడుకు బ్రేకులు వేసింది. కనీసం అప్పుడైనా ఆమె తెలివిగా వ్యవహరించి కేంద్రంతో రాజీ పడి ఉండి ఉంటే, బహుశః నేడు ఆమెకు ఈ దుర్గతి పట్టి ఉండేది కాదేమో? కానీ ఆమె తన వెనకున్న ఎమ్మెల్యేల బలం చూసుకొంటూ, కేంద్రం తనకు వ్యతిరేకంగా పావులు కదుపుతోందని గ్రహించినా పట్టించుకోకుండా పన్నీర్ సెల్వంతో యుద్ధం చేస్తుండిపోయారు. ఆ అశ్రద్ధ లేదా నిర్లక్ష్యమే ఆమె ఆశలను అడియాశలు చేసి చివరికి జైలుకి కూడా పంపించింది. 

ఇక శశికళ చేసిన మరో అతిపెద్ద తప్పు దురాశకు పోవడం. జయలలిత మృతి తరువాత ఆమె కొన్ని నెలలు వెనక్కి తగ్గి ఉన్నా లేదా పార్టీ పగ్గాలు చేజిక్కించుకొన్నాక, తనకు విధేయత కనబరుస్తున్న పన్నీర్ సెల్వంనే ముఖ్యమంత్రిగా కొనసాగిస్తూనే మెల్లగా పార్టీని, ప్రజలను తనవైపు తిప్పుకొనే ప్రయత్నం చేసి ఉన్నా అప్పుడు ప్రజలు, పార్టీ కార్యకర్తలే ఆమెను ముఖ్యమంత్రి పదవి చేపట్టామని కోరి ఉండేవారు. జయలలిత ఈ స్థాయికి చేరుకోవడానికి అనేక ఏళ్ళపాటు నిరంతర పోరాటాలు చేశారు. కానీ ఆమె వెంట 33 ఏళ్ళు తిరిగానని గొప్పగా చెప్పుకొంటున్న శశికళ ఆమె నుంచి ఏమీ నేర్చుకోలేదని రుజువు చేశారు. అందుకే కేవలం నెలరోజుల్లోనే అధికారాన్ని దక్కించుకోవాలని ప్రయత్నించి భంగపడ్డారు. కనుక ఆమె తొందరపాటు, దురాశ, పదవీకాంక్షలే ఆమె అదృష్టాన్ని తారుమారుచేసాయని చెప్పవచ్చు.

ఆమె పతనానికి మరో కారణం ప్రజలలో ఆమె పట్ల ఏర్పడిన వ్యతిరేకత. జయలలిత మృతికి ఆమె కారణం కాకపోవచ్చు కానీ జయలలిత మరణించిన వెంటనే ఆమె ఏ మాత్రం ఆలస్యం చేయకుండా పార్టీ, ప్రభుత్వం పగ్గాలు చేపట్టడానికి తెర వెనుక శరవేగంగా పావులు కదిపారు. ఆమె రాజకీయ చతురతను తప్పక మెచ్చుకోవలసిందే. కానీ అధికారం కోసం ఆమె అమలుచేసిన ఆ వ్యూహాలే ప్రజలలో ఆమె పట్ల అనుమానాలు కలిగించాయని చెప్పవచ్చు. తీవ్ర పదవీ కాంక్షతో తహతహలాడిపోతున్న కారణంగా ఆమే జయలలిత హత్యకు కుట్రపన్ని ఉండవచ్చనే అనుమానాలు ప్రజలకు కలిగేలా చేశాయని చెప్పకతప్పదు. ఆమె తన వ్యవహార శైలితో ప్రజలలో కలిగించిన ఈ భావనలే ఆమె పట్ల వారికి తీవ్ర వ్యతిరేకత ఏర్పడేలా చేశాయి. 

ఆమె ‘అమ్మ వేషం’ ధరించి, ‘అమ్మ జపం’ చేస్తూ ప్రజలను మభ్యపెట్టడానికి చేసిన ప్రయత్నాల వలన ప్రజలలో ఆమె పట్ల ఆ వ్యతిరేకత ఇంకా పెరిగిపోయింది. కానీ తన వెనుక ఎమ్మెల్యేలు ఉన్నారనే ధైర్యంతో ఆమె ప్రజలలో తన పట్ల ఉన్న వ్యతిరేకతను కూడా గుర్తించడానికి ఇష్టపడలేదు. ఇన్ని తప్పులు చేసినా కనీసం కేంద్రంతో రాజీ పడి ఉండి ఉంటే నేడు ఆమెకు ఈ దుస్థితి కలిగి ఉండేదే కాదని ఖచ్చితంగా చెప్పవచ్చు. కనుక జరిగిన దానికి ఆమె తనను తానే నిందించుకోవలసి ఉంటుంది. అందుకు జైల్లో నాలుగేళ్ళ సమయం ఆమెకు కల్పించింది సుప్రీంకోర్టు. 


Related Post