సెల్వంపై పన్నీరు చికలరించిన సుప్రీంకోర్టు

February 14, 2017


img

అక్రమాస్తుల కేసులో శశికళకు సుప్రీంకోర్టు నాలుగేళ్ళు జైలు శిక్ష ఖరారు చేయడం చాలా సంచలనమైన వార్తే. సుప్రీంకోర్టు తీర్పుతో పరిస్థితులు అకస్మాత్తుగా పన్నీర్ సెల్వంకు అనుకూలంగా మారిపోయే అవకాశాలు కనబడుతున్నాయి. నిన్న మధ్యాహ్నం నుంచి ఇప్పటి వరకు శశికళ తన ఎమ్మెల్యేలతో కలిసే ఉన్నారు కనుక ఒకవేళ సుప్రీంకోర్టు తీర్పు తనకు వ్యతిరేకంగా వచ్చినట్లయితే, అప్పుడు ఎమ్మెల్యేలు అందరూ ఏమి చేయాలనే విషయంపై ఆమె వారికి దిశానిర్దేశం చేసే ఉండవచ్చు. కనుక శశికళ పోలీసులకు లొంగిపోయేలోగానే మరికొన్ని నాటకీయ పరిణామాలు జరిగే అవకాశాలు కనబడుతున్నాయి.

వారిలోనే ఒకరిని శాసనసభాపక్ష నేతగా శశికళ ప్రతిపాదించినప్పటికీ అందరూ అతనికి మద్దతు తెలుపుతారా అంటే అనుమానమే. ఇంతవరకు శశికళపై అభిమానంతోనో లేదా భయం చేతనో ఎమ్మెల్యేలు అందరూ ఆమె చెప్పనట్లు నడుచుకొన్నారు. ఇప్పుడు ఆమె జైలుకి వెళ్ళడం ఖాయం అయ్యింది కనుక ఇక ఆమె ఆదేశాలను ఖాతరు చేయవలసిన అవసరం వారికి ఉండదు. కనుక ఆమెకు మద్దతు ఇస్తున్న ఎమ్మెల్యేలలో చీలిక అనివార్యమనే చెప్పవచ్చు. వారిలో చాలా మంది ఇప్పుడు విధిలేని పరిస్థితిలో పన్నీర్ సెల్వంకే మద్దతు ప్రకటించే అవకాశం ఉంది. కనుక పన్నీర్ సెల్వం ముఖ్యమంత్రి అయ్యేందుకు మార్గం సుగమం అయినట్లే భావించవచ్చు. కానీ శశికళను తక్కువ అంచనా వేస్తే ఏమవుతుందో అనుభవపూర్వకంగా తెలుసుకొన్నారు కనుక ఆయన ఇప్పుడు చాలా వేగంగా పావులు కదిపి శశికళకు మద్దతు ఇస్తున్న ఎమ్మెల్యేలందరినీ తనవైపు తిప్పుకోవలసి ఉంటుంది. లేకుంటే మరొకరితో మరో సుదీర్గ పోరాటం చేయవలసిరావచ్చు. 


Related Post