తలాక్ సమస్యపట్ల చిత్తశుద్ధి ఏది?

February 07, 2017


img

కేంద్రప్రభుత్వం అనేక రంగాలలో సంస్కరణలు చేపడుతోంది. వాటిలో కొన్నిటిని ప్రజలు ఆహ్వానిస్తున్నారు. కొన్నిటిని తిరస్కరిస్తున్నారు. నోట్లరద్దు వంటి అంశాలపై మిశ్రమ స్పందన, ఫలితాలు కనబడ్డాయి. అటువంటిదే మరొకటి ముస్లింలకు చెందిన “ట్రిపుల్ తలాక్” అంశం కూడా. 

ముస్లిం మతస్తులల్లో ‘తలాక్..తలాక్..తలాక్..’అని మూడుసార్లు వరుసగా చెప్పేస్తే ఏ భర్తయినా తన భార్య నుంచి విడిపోవచ్చు. ఆ ముస్లిం మతాచారం వెనుక చాలా కటినమైన నిబంధనలు ఉన్నప్పటికీ, వాటిని పాటించకుండా కొందరు పురుషులు తలాక్ చెప్పేసి బార్యలను విడిచిపెడుతుండటంతో ఆ ముస్లిం మహిళల పరిస్థితి చాలా దయనీయంగా మారుతోంది. సహజంగానే ఇది ఒక సామాజిక సమస్యగా మారుతోంది. 

ఇది ముస్లిం మహిళల సంక్షేమం కోసమే ఇటువంటి నిర్ణయం తీసుకొంటున్నందున, ఈ అంశాన్ని మతానికి, ఎన్నికలకు ముడిపెట్టి  దానిపై ఎవరూ రాజకీయాలు చేయవద్దని వెంకయ్య నాయుడు సూచించారు. ఏ మతానికి చెందిన మహిళలకైనా పురుషులతో సమాన హక్కులు కలిగి ఉండాలన్నదే తమ పార్టీ, ప్రభుత్వం అభిమతమని, దానికి వేరే రాజకీయ ఉద్దేశ్యాలు లేవని చెప్పారు. సుప్రీంకోర్టు దీనిపై విచారణ జరిపినప్పుడు, ఈ విధానాన్ని తాము వ్యతిరేకిస్తున్నట్లు చెపుతామని అన్నారు. 

ఈ సమస్య చాలా సామాజిక సమస్యలు సృష్టిస్తున్నదే కావచ్చు కానీ కోట్లాది మంది ముస్లింల మనోభావాలతో ముడిపడున్న చాలా సున్నితమైనది. కనుక కేంద్రప్రభుత్వం దీనిపై ఎటువంటి నిర్ణయం తీసుకొన్నా దాని ప్రభావం వారిపైనే కాకుండా భాజపాపై కూడా తప్పక పడుతుంది. ఎన్నికల సమయంలో ఈ ప్రస్తావన చేస్తోంది కనుక దీని నుంచి భాజపా ఎంతో కొంత మైలేజీ పొందాలని భావిస్తున్నట్లే అనుమానించవలసి ఉంటుంది. దీనిని అమలుచేస్తామని చెపితే ముస్లింలు భాజపాకు దూరం కావచ్చు కానీ హిందూ ఓటర్లు దగ్గరయ్యే అవకాశం ఉండవచ్చు. 

సున్నితమైన ఈ అంశాన్ని భాజపా తనకు అనుకూలంగా మలుచుకొనే ప్రయత్నం చేసినట్లయితే, ప్రతిపక్షాలు కూడా దానిని భాజపాకు వ్యతిరేకంగా, తమకు అనుకూలంగా మలుచుకొనే ప్రయత్నాలు చేయడం తధ్యం. కనుక అధికార ప్రతిపక్షాలన్నీ కలిసి ఈ సమస్యలో గంభీరతను పట్టించుకోకుండా, ఎన్నికలలో దానిని ఒక రాజకీయ అస్త్రంగానే భావిస్తున్నట్లు కనిపిస్తోంది.

ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు చేసినా వాటికి ప్రజాధారణ లేకపోతే అవి ఆచరణకు నోచుకోవని చెప్పక తప్పదు. ఉదా: తమిళనాడులో జల్లికట్టుపై నిషేధం, అమెరికాలో ట్రంప్ నిర్ణయాలను  ప్రజలు వ్యతిరేకించడంతో అవి ఆచరణకు నోచుకోలేకపోవడం అందరూ చూశారు. ట్రిపుల్ తలాక్ విషయంలో కూడా బహుశః భాజపాకు, కేంద్రప్రభుత్వానికి అటువంటి అనుభవమే ఎదురైనా ఆశ్చర్యం లేదు.


Related Post