చిన్నమ్మకు ఈ షాకులేమిటి?

February 07, 2017


img

తమిళనాడులో అధికార అన్నాడిఎంకె పార్టీలో అధికార మార్పిడి చాలా సజావుగా సాగిపోయిందనుకొంటే, చిన్నమ్మ శశికళకు వరుసగా షాకులు తగులుతున్నాయి. అయితే అవి పార్టీలో నుంచి కాక బయట నుంచి కావడమే చాలా విచిత్రంగా ఉంది. 

ఆమె ఈరోజు ఉదయం ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయాలనుకొంటే, ఇన్-చార్జ్ గవర్నర్ విద్యాసాగర్ రావు మొహం చాటేశారు. ఆ కారణంగా ప్రమాణ స్వీకారోత్సవం వాయిదా పడింది. ఏమి జరుగబోతోందో తెలియని అయోమయం నెలకొని ఉంది. ప్రమాణ స్వీకారోత్సవం వాయిదా పడటం ఆశుభంగా కనిపిస్తోంది. 

అన్నాడిఎంకె సీనియర్ నేత పాండ్యన్ ఈరోజు మీడియా ముందుకు వచ్చి సంచలన ఆరోపణలు చేశారు. గత ఏడాది సెప్టెంబర్ 22వ తేదీన తాను జయలలిత నివాసానికి (పొయెస్ గార్డెన్)కు వెళ్ళినప్పుడు లోపల ఏదో పెద్ద గొడవ జరుగుతున్నట్లు వినబడిందని అన్నారు. ఆ సమయంలో జయలలితను ఎవరో తోసివేయడంతో ఆమె నేలపై పడిపోయి దెబ్బ తగిలి ఉండవచ్చని, ఆ విషయం ఎవరికీ తెలియకూడదనే ఉద్దేశ్యంతో ఆమెను హడావుడిగా ఆసుపత్రికి తరలించారని, అందుకే ఆమె ఆసుపత్రిలో ఉన్నన్నాళ్ళు ఎవరూ ఆమెను కలవనీయకుండా శశికళ వర్గం అడ్డుకొందని పాండ్యన్ ఆరోపించారు. జయలలితకు అందించిన వైద్యం తనకు అనుమానాలు ఉన్నాయని అన్నారు. ఆయన ఆరోపణలను అన్నాడిఎంకె నిరాధారమైనవని కొట్టిపడేసింది.

తమిళనాడులో ప్రధాన ప్రతిపక్ష నేత స్టాలిన్ ఈరోజు డిల్లీ వెళ్ళి రాష్ట్రపతిని కలిసి శశికళపై పిర్యాదు చేసి ఆమెను ముఖ్యమంత్రి కాకుండా అడ్డుకోవాలని కోరబోతున్నారు. తమిళనాడులో రాష్ట్రపతి పాలన విదించాలని ఆయన కోరబోతున్నట్లు తెలుస్తోంది. ప్రధాని మోడీ, హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ ల  అపాయింట్మెంట్స్ దొరికినట్లయితే అయన వారిని కూడా కలిసి శశికళపై పిర్యాదు చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. 

అన్నాడిఎంకె పార్టీ బహిష్కృత ఎంపి శశికళ పుష్ప కూడా శశికళపై తీవ్ర ఆరోపణలు చేస్తూ ఇదివరకే ప్రధాని నరేంద్ర మోడీకి ఒక లేఖ వ్రాశారు. కనుక శశికళ పార్టీని, ప్రభుత్వాన్ని చాలా సులువుగా తన అధీనంలోకి తెచ్చుకోగలిగినప్పటికీ, ఊహించని విధంగా పరిస్థితులు మారాయి. అన్నాడిఎంకెలో నిన్నటివరకు కనబడిన పండుగ వాతావరణం మారిపోయి ప్రస్తుతం చాలా గంభీరమైన వాతావరణం నెలకొని ఉంది.


Related Post