ట్రంప్ ఎంత మాటనేశారు!

February 07, 2017


img

అమెరికా అధ్యక్షుడు అంటే ఒక తిరుగులేని మహా శక్తివంతుడు..అతను మాట శిలాశాసనం అనే అభిప్రాయం సర్వత్రా ఉండేది. అది నిజం కూడా...ఎందుకంటే ఇంతవరకు అధ్యక్షులుగా వ్యవహరించినవారు చాలా ఆలోచించి బాధ్యతాయుతంగా మాట్లాడేవారు. కనుక వారు ఏది చెప్పినా, ఎటువంటి నిర్ణయం తీసుకొన్నా వాటిని అమెరికా ప్రజలు, న్యాయస్థానాలు ఎన్నడూ ప్రశ్నించవలసిన అవసరం ఏర్పడేది కాదు. కానీ ట్రంప్ అమెరికా అధ్యక్షుడుగా బాధ్యతలు చేపట్టగానే తీసుకొన్న రెండు నిర్ణయాలను అమెరికా ప్రజలు, అమెరికాలో ఐటి దిగ్గజాలు, పలు సంస్థలు, న్యాయస్థానాలు, ప్రభుత్వాధికారులు, ప్రపంచదేశాలు కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. 

ఏడు ముస్లిం దేశాల పౌరులపై విధించిన ట్రంప్ ప్రభుత్వం విధించిన నిషేధాన్ని సియాటిల్ ఫెడరల్ కోర్టు జడ్జి జేమ్స్ రాబర్ట్ పక్కన పెడుతూ ఉత్తర్వులు జారీ చేశారు. దానిని ట్రంప్ ప్రభుత్వం శాన్ ఫ్రాన్సిస్కోలోని అప్పీలేట్ కోర్టులో సవాలు చేయగా అక్కడ కూడా ఎదురుదెబ్బ తగిలింది. సియాటిల్ కోర్టు తీర్పుపై స్టే విదించలేమని స్పష్టం చేసింది.   

హెచ్1-బి వీసాల పై విధించిన ఆంక్షలను వ్యతిరేకిస్తున్న దేశంలోని ఆపిల్, అమెజాన్, మైక్రోసాఫ్ట్ వంటి సుమారు 72 ప్రముఖ సంస్థలు న్యాయపోరాటానికి సిద్దం అవుతున్నాయి. 

న్యాయస్థానాల తీర్పుపై ట్రంప్ స్పందిస్తూ “ఒక జడ్జి మన దేశాన్ని ఇంత ప్రమాదకర పరిస్థితిలో పడేయగలిగారంటే నమ్మకలేకపోతున్నాను. ఆయన నిర్ణయం కారణంగా ఇప్పుడు నిషేధిత దేశాల నుండి చాలా బారీగా ప్రజలు అమెరికాలోకి ప్రవేశిస్తున్నారు. ఈ పరిణామాలు మంచివి కావు. ఒకవేళ మున్ముందు దేశంలో జరుగరానిది ఏమైనా జరిగితే అప్పుడు ఆ జడ్జిదే బాధ్యత అవుతుంది కనుక ప్రజలు అప్పుడు ఆయననే ప్రశ్నించవలసి ఉంటుంది,” అని ట్రంప్ ట్వీట్ చేశారు. 

ట్రంప్ ప్రభుత్వ నిర్ణయంపై స్టే విదిస్తూ  సియాటిల్ కోర్టు జడ్జి జేమ్స్ రాబర్ట్ చాలా ఆలోచించదగ్గ మాట చెప్పారు. “ఈ ఉత్తర్వు రాజ్యాంగబద్దమైంది. (ప్రభుత్వం) నిర్ణయాలు తీసుకొనేటప్పుడు వాస్తవిక పరిస్థితుల ఆధారంగానే తీసుకోవాలి తప్ప ఊహాజనితమైన అంశాల ఆధారంగా కాదు,” అని అన్నారు.

నిషేధం విదించబడిన ఆ 7 దేశాల పౌరులు గత అనేక దశాబ్దాలుగా అమెరికాలో స్థిరపడినవారున్నారు. వారు తమ దేశాలకు రాకపోకలు సాగిస్తూనే ఉన్నారు. కానీ ఏనాడూ వారి వలన అమెరికాకు ప్రమాదం ఏర్పడలేదు. ఎందుకంటే వారు సామాన్య పౌరులు కనుక. పైగావారు అమెరికాలోకి ప్రవేశిస్తున్నప్పుడు అమెరికన్ కౌన్సిలేట్ అధికారులు వారి వ్యక్తిగత వివరాలను అన్నిటినీ క్షుణ్ణంగా ఒకటికి పదిసార్లు పరిశీలించి, వారి వలన అమెరికాకు ఎటువంటి ప్రమాదం ఉండబోదని నిర్ధారించుకొన్న తరువాతే వారికి వీసాలు ఇస్తుంటారు. వారు అమెరికాలో అడుగుపెడుతున్న సమయంలో ఇమ్మిగ్రేషన్ అధికారులు మళ్ళీ మరో క్షుణ్ణంగా పరిశీలిస్తారు. అనేక దశాబ్దాలుగా ఈ ప్రక్రియ చాలా పటిష్టంగా అమలుచేస్తున్నారు. 

కానీ ఆ 7 దేశాల ప్రజలందరూ కూడా ఉగ్రవాదులేనని భావిస్తున్న ట్రంప్ తన ఆ ఆలోచనలను అమెరికా ప్రజల మీద బలవంతంగా రుద్దాలని ప్రయత్నించి భంగపడి ఈవిధంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ట్రంప్ ఆలోచనలలో తప్పని న్యాయస్థానాలు, అటార్నీ జనరల్స్, ప్రజలు కూడా హెచ్చస్తున్నప్పుడు ఆయన వాటిని సవరించుకొని ఉండి ఉంటే చాలా హుందాగా ఉండేది. కానీ దేశాన్ని కాపాడుతానని బైబిల్ సాక్షిగా ప్రమాణం చేసిన ట్రంప్, ఇప్పుడు దేశానికి ఏదైనా జరుగరానిది జరిగితే ఆ జడ్జిని, న్యాయవ్యవస్థలనే అడగండి,” అని అంటున్నారు. ఆ విధంగా అనడం కూడా పొరపాటేనని చెప్పకతప్పదు. ప్రపంచ దేశాల బారి నుంచి అమెరికాను కాపాడుతానని చెప్పి ఇప్పుడు అమెరికాలోనే అంతర్గత సంక్షోభానికి కారణం అవడం చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది.  



Related Post