చిన్నమ్మకు గవర్నర్ జలక్

February 07, 2017


img

అన్నాడిఎంకె పార్టీ అధినేత్రి శశికళకు తమిళనాడు ఇన్-చార్జ్ గవర్నర్ సిహెచ్ విద్యాసాగర్ రావు ఊహించని జలక్ ఇచ్చారు. ఈరోజు ఉదయం 9గంటలకు ఆమె మద్రాస్ యూనివర్సిటీ సెంటినరీ ఆడిటోరియంలో ప్రమాణస్వీకారానికి అన్ని ఏర్పాట్లు చేసుకొని కూర్చొంటే ఇంతవరకు అయన చెన్నై రాలేదు. మహరాష్ట్రకి కూడా గవర్నర్ అయిన విద్యాసాగర్ రావు నిన్న డిల్లీ వెళ్ళి హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ తో సమావేశం అయ్యారు. ఆ తరువాత అక్కడి నుంచి చెన్నైకి రాకుండా ముంబైకి వెళ్ళిపోయారు. ఈరోజు చెన్నైకి వచ్చే అవకాశాలు లేవని తెలుస్తోంది. కనుక శశికళ ప్రమాణస్వీకారం వాయిదా పడింది. 

శశికళ అక్రమాస్తుల కేసుపై మరో వారం రోజులలో తీర్పు చెపుతానని సుప్రీంకోర్టు ప్రకటించినందున, ఈ సమయంలో ఆమె చేత ప్రమాణస్వీకారం చేయించడం మంచిదా కాదా? అని న్యాయనిపుణుల సలహా తీసుకొంటున్నారని వార్తలు వస్తున్నాయి. 

తమిళ మీడియాలో వస్తున్న వార్తలను బట్టి ఆ రాష్ట్ర ప్రజలలో చాలా మంది శశికళ ముఖ్యమంత్రి పదవి చేపట్టడం పట్ల వ్యతిరేకత కనబరుస్తునట్లు కనబడుతోంది. కానీ ఆమె ప్రమాణస్వీకారం చేయకుండా కేంద్రప్రభుత్వం చక్రం త్రిప్పినట్లయితే, పవన్ కళ్యాణ్ చెప్పినట్లు ఉత్తరాదివారు తమను అణచివేస్తున్నారని శశికళ గట్టిగా ప్రచారం చేసుకొని ప్రజల సానుభూతి, మద్దతు కూడగట్టుకొనే అవకాశం ఉంటుంది. అదే జరిగితే భాజపా పట్ల రాష్ట్ర ప్రజలలో ఇంకా వ్యతిరేకత పెరిగే అవకాశం ఉంటుంది. అది శశికళకు అనుకూలంగా మారవచ్చు. 


Related Post