తెరాసకు మరో కొత్త సవాల్?

February 06, 2017


img

‘బంగారి తెలంగాణా కోసం రాజకీయ శక్తుల పునరేకీకరణ’ పేరిట తెలంగాణాలో ప్రతిపక్ష పార్టీల నేతలను పార్టీ ఫిరాయింపజేసి, అన్ని పార్టీలను బలహీనపరిచి రాష్ట్రంలో తెరాసకు ఎదురులేకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ జాగ్రత్తపడినప్పటికీ కాంగ్రెస్ పార్టీ అవకాశం దొరికినప్పుడల్లా మళ్ళీ చిగురిస్తూనే ఉంది. అది నేటికీ అంతే బలంగా నిలద్రొక్కుకొని తెరాస సర్కార్ సవాళ్ళు విసురుతూనే ఉంది. ఫిరాయింపుల దెబ్బకి తెదేపా ఎన్నటికీ కోలుకోలేనంతగా దెబ్బ తింది. భాజపా జోలికి తెరాస వెళ్ళనప్పటికీ వరుస ఓటముల కారణంగా అది కూడా చాలా బలహీనంగా తయారైంది. రాష్ట్రంలో ప్రతిపక్షాలు బలహీనపడటంతో తెలంగాణా జెఎసి చైర్మన్ ప్రొఫెసర్  కోదండరామ్ ప్రస్తుతం ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నారు. 

ఇటువంటి సమయంలో రాష్ట్ర రాజకీయాలలో మరొక ఆసక్తికరమైన పరిణామం జరుగబోతోంది. ప్రముఖ ప్రజాకవి గద్దర్ మార్చ్ 6న ‘త్యాగాల తెలంగాణా’ అనే కొత్త రాజకీయ పార్టీని స్థాపించడానికి సన్నాహాలు చేసుకొంటున్నట్లు తాజా సమాచారం. తెరాస సర్కార్ పాలన పట్ల అసంతృప్తితోనే గద్దర్ ఈ నిర్ణయం తీసుకొన్నట్లు తెలుస్తోంది. ప్రొఫెసర్  కోదండరామ్ కూడా తెరాస సర్కార్ పాలన పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్న విషయం తెలిసిందే. కనుక ఒకవేళ గద్దర్ పార్టీ స్థాపించినట్లయితే, ప్రొఫెసర్  కోదండరామ్ ఆయనకి మద్దతు తెలుపవచ్చు. వామపక్షాలు కూడా గద్దర్ తో చేతులు కలుపుతాయని వేరే చెప్పనవసరం లేదు. అలాగే రాష్ట్రంలో చాలా బలహీనపడి ఉన్న తెదేపా కూడా ఆయనతో చేతులు కలిపినా ఆశ్చర్యం లేదు. కనుక ఒకవేళ గద్దర్ పార్టీ స్థాపించి ప్రత్యక్ష రాజకీయాలలోకి వచ్చినట్లయితే, వచ్చే ఎన్నికలలో అయన నేతృత్వంలో రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలు, జెఎసిలు, ప్రజా సంఘాలు అన్నీ కలిసి తెరాసకు గట్టి సవాలు విసిరే అవకాశం ఉంటుంది. 


Related Post