వెల్ కమ్ టు అమెరికా!

February 06, 2017


img

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అధికారం చేపట్టిన 10 రోజులకే 7 ముస్లిం దేశాలపై నిషేధం విధించి తనకు ఎదురులేదనుకొని విర్ర వీగితే, సియాటిల్ ఫెడరల్ కోర్టు న్యాయమూర్తి జేమ్స్ రాబర్ట్ ఆ ఆదేశాలపై స్టే విదించి, అమెరికా అధ్యక్షుడైనా చట్టం కంటే ఎక్కువేమీ కాదని నిరూపించారు. 

ట్రంప్ నిర్ణయాన్ని న్యాయస్థానం నిలిపివేయడంతో ఆ 7 నిషేదిత దేశాలకు చెందిన పౌరులను అమెరికాలోకి అనుమతించడం మొదలుపెట్టారు. న్యాయస్థానం ఆదేశానుసారం ఎటువంటి నిషేధాజ్ఞలను అమలుచేయడం లేదని అమెరికా ఇమ్మిగ్రేషన్ అధికారులు తెలిపారు. కనుక అమెరికా వీసాలున్న వారు ఏ దేశానికి చెందినా నిరభ్యంతరంగా అమెరికాకు రావచ్చని అధికారులు స్పష్టం చేశారు. ఇప్పటికే ట్రంప్ నిషేధానికి గురైన ఆ 7 దేశాల పౌరులు అమెరికాలో అడుగుపెడుతున్నారు. 

అమెరికాలో స్థిరపడిన ఆ 7 దేశాల పౌరులు ట్రంప్ నిషేదం విదించక మునుపు స్వంత పనులమీద ఆ దేశాలకి వెళ్ళి నిషేధం కారణంగా అక్కడ నుంచి మళ్ళీ వెనక్కి తిరిగి రాలేని పరిస్థితి ఏర్పడటంతో, అమెరికాలో ఉన్న వారి కుటుంబ సభ్యులు చాలా ఆందోళనకు గురయ్యారు. ఇక జీవితంలో మళ్ళీ ఎన్నటికీ తాము కలుసుకోలేమేమోనని చాలా బాధపడ్డారు. కానీ సియాటిల్ జడ్జ్ జేమ్స్ రాబర్ట్ పుణ్యామని మళ్ళీ అందరూ కలుసుకోగలుతున్నారు. ఇప్పుడు అమెరికా విమానాశ్రయాలలో ఎక్కడ చూసినా కుటుంబ సభ్యుల కలయికలతో ఉద్వేగపూరితమైన దృశ్యాలు కనిపిస్తున్నాయి. సియాటిల్ ఫెడరల్ కోర్టు నిర్ణయాన్ని ఉన్నత న్యాయస్థానంలో సవాలు చేయడానికి ట్రంప్ ప్రభుత్వం సిద్దం అవుతోంది. ఒకవేళ అక్కడ కూడా ట్రంప్ కు ఎదురుదెబ్బ తగిలినట్లయితే ఆయన ప్రపంచ దేశాలలో నవ్వులపాలవడం ఖాయం.  


Related Post