మెగా కబుర్లు

February 06, 2017


img

మెగాస్టార్ చిరంజీవి ఒకప్పుడు తన కెరీర్ పీక్ స్థాయిలో ఉన్నప్పుడు సినిమాలకు గుడ్ బై చెప్పేసి రాజకీయాలలోకి వెళ్ళి ఎదురుదెబ్బలు తిని మళ్ళీ సినిమాలలోకి వచ్చేశారు. ఆయన తమ్ముడు పవన్ కళ్యాణ్ కూడా అన్న అడుగు జాడలలోనే నడుస్తూ తన సినీ కెరీర్ మంచి పీక్ స్థాయికి చేరుకొన్న ఈ సమయంలో రాజకీయాలవైపు మళ్ళుతున్నారు. వచ్చే ఎన్నికలలో జనసేన పార్టీ తప్పకుండా పోటీ చేస్తుందని ప్రకటించారు కనుక 2018లో సినిమాలకు గుడ్ బై చెప్పేసి రాజకీయాలలోకి వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. ఇవన్నీ అందరికీ తెలిసిన విషయాలే. మెగా బ్రదర్స్ లో ఒకరైన నాగబాబు ఒక ప్రముఖ తెలుగు టీవీ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఒక కొత్త ముచ్చట చెప్పారు. 

అదేమిటంటే, “ఇంతవరకు నాకు కళ్యాణ్ బాబు సహాయపడటమే కానీ నేను ఏనాడు అతనికి సహాయపడలేకపోయాను. కనుక వచ్చే ఎన్నికలలో జనసేన పార్టీ తరపున ప్రచారంలో పాల్గోనాలనుకొంటున్నాను. ఒకవేళ తమ్ముడు వద్దన్నా ఒక పౌరుడుగా నాకు నచ్చిన పార్టీలో చేరి దాని తరపున ప్రచారం చేసే హక్కు నాకుంది. కనుక జనసేన తరపున ప్రచారం చేస్తాను. నాకు పదవులు ఏమీ అక్కర లేదు. ఒక సామాన్య కార్యకర్తగానే పనిచేస్తాను. వీలైతే అన్నయ్య చిరంజీవిని కూడా ఒప్పించి తమ్ముడికి మద్దతు ఇచ్చేందుకు ఒప్పించాలనుకొంటున్నాను. నా ప్రయత్నాలు ఫలిస్తాయో లేదో చూడాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నామరూపాలు లేకుండా పోయింది. దాని కోసం ఇప్పుడు చేయగలిగిందేమీ లేదు. అందుకే అన్నయ్య సినిమాలపై దృష్టి కేంద్రీకరించారు. కనుక ఒక మంచి ఉద్దేశ్యంతో ప్రత్యక్ష రాజకీయాలలోకి వస్తున్న కళ్యాణ్ బాబుకి మేమిద్దరం అండగా నిలబడటమే సమంజసంగా నాకు అనిపిస్తోంది. అన్నయ్య మళ్ళీ సినిమాలలోకి వచ్చేయడంతో ఆయన అభిమానులు కళ్యాణ్ బాబుకి అండగా నిలబడాలనుకొంటున్నట్లు చెప్పారు. మేము కూడా అదే కోరుకొంటున్నాము. మెగాభిమానులందరూ ఒక్కటే. అందరం కలిసి వచ్చే ఎన్నికలలో జనసేన పార్టీకి అండగా నిలబడి ప్రచారం చేయాలనుకొంటున్నాము,” అని నాగబాబు అన్నారు.

నాగబాబు చెప్పినదాని ప్రకారం చిరంజీవి కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పేసి తమ్ముడితో చేతులు కలిపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అసలు గత ఎన్నికలలోనే ప్రజలు వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టి, తమ్ముడి జనసేనకు అండగా నిలబడి ఉండి ఉంటే నేడు ఏపిలో, మెగా కుటుంబంలో పరిస్థితులు వేరేగా ఉండేవేమో? వచ్చే ఎన్నికలలో మెగా బ్రదర్స్ ముగ్గురు చేతులు కలిపితే, తెదేపా, వైకాపా, జనసేనల మధ్య ఓట్లు చీలిపోవడం ఖాయం. కనుక ముఖ్యమంత్రి అయిపోదామని కలలుగంటున్న జగన్, ఏనాటికైనా తన కొడుకుని ఏపికి ముఖ్యమంత్రి చేయాలనుకొంటున్న చంద్రబాబు వారి వలన నష్టపోయే అవకాశాలుంటాయి. కనుక చంద్రబాబు మెగా బ్రదర్స్ ని తనవైపు తిప్పుకొనే ప్రయత్నం చేయవచ్చు. అందుకు వారు అంగీకరిస్తారా లేక అన్ని పార్టీలకు మెగా సవాల్ విసురుతారా? చూడాలి. 


Related Post