ట్రంప్ నిర్ణయాలతో వ్యవస్థల మద్య చిచ్చు?

February 04, 2017


img

అమెరికాలోకి ఏడు ముస్లిం దేశాల ప్రజల ప్రవేశంపై డోనాల్డ్ ట్రంప్ నిషేధంపై విధించగా, దానిపై సియాటెల్ ఫెడరల్ కోర్టు స్టే విదించింది. అందుకు ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. 

“ఒక దేశంలోకి ఎవరిని అనుమతించాలో ఎవరిని అనుమతించకూడదనే నిర్ణయం తీసుకొనే అధికారం ప్రభుత్వానికి లేకపోతే , ముఖ్యంగా భద్రతాకారణాల చేత అనుమతించకూడదనుకొన్నప్పుడు, దానిని వ్యతిరేకిస్తే చాలా కష్టమే. కొన్ని గల్ఫ్ దేశాలు కూడా నా నిర్ణయంతో ఏకీభవిస్తున్నాయి. కొందరు వ్యక్తులను దేశంలోకి ప్రవేశించనీయడం ఆత్మహత్యాసదృశమైనదేనని అవి కూడా నమ్ముతున్నాయి. ఈ అంశంపై ఆ జడ్జి వెల్లడించిన అభిప్రాయం చాలా దారుణంగా ఉంది. ఆ నిర్ణయాన్ని మార్చక తప్పదు,” అని ట్రంప్ ట్వీట్ చేశారు. 

అంతకు ముందు అదనపు అటార్నీ జనరల్ శాలీ యేట్స్ తన నిర్ణయాన్ని వ్యతిరేకించినందుకు డోనాల్డ్ ట్రంప్ ఆమెను పదవిలో నుంచి తొలగించారు. కొన్ని గంటల వ్యవధిలోనే డైరెక్టర్ ఆఫ్ ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎంఫోర్స్ మెంట్ డానియల్ రాగ్స్ డేల్ ను కూడా ఎటువంటి కారణాలు చెప్పకుండా పదవిలో నుంచి తొలగించి అయన స్థానంలో ధామస్ హోమన్ న్ను నియమించారు.  

ఈ మూడు సంఘటనలను కలిపి చూసినట్లయితే, ట్రంప్ నిర్ణయాల వలన అమెరికాలో ప్రభుత్వానికి, న్యాయవ్యవస్థకీ మద్య, అలాగే ప్రభుత్వంలో వివిధ శాఖలు, వాటి అధికారుల మద్య ఘర్షణ వాతావరణం ఏర్పడిందని అర్ధమవుతోంది. ఇది నలుగురు ఐదుగురు అధికారుల తొలగింపుతో సమసిపోయే సమస్యలాగ కనిపించడం లేదు. ఎందుకంటే ట్రంప్ నిర్ణయాలను వ్యతిరేకిస్తున్నవారందరూ అత్యున్నత పదవులలో ఉన్నవారే. వ్యవస్థలను నడిపిస్తున్నవారే ట్రంప్ నిర్ణయాలను తీవ్రంగా వ్యతిరేకిస్తుంటే, క్రింద స్థాయి ఉద్యోగులు ఆయనకు మద్దతు పలుకుతారనుకోలేము. కనుక ట్రంప్ చేజేతులా సమస్యలను ఆహ్వానించుకొంటున్నట్లు కనిపిస్తున్నారు. చివరికి ఇది ఎక్కడికి దారి తీస్తుందో చూడాలి.


Related Post