పంజాబ్, గోవాలో రేపే ఎన్నికలు

February 03, 2017


img

పంజాబ్, గోవా రాష్ట్ర శాసనసభ ఎన్నికలు రేపు (శనివారం) జరుగబోతున్నాయి. పంజాబ్ లో భాజపా-అకాలీదళ్ పార్టీల సంకీర్ణ ప్రభుత్వం అధికారంలో ఉండగా, గోవాలో భాజపా ఒక్కటే అధికారంలో ఉంది. కనుక రెండు రాష్ట్రాలలో భాజపా పద్దులో ఉన్నట్లుగా భావించవలసి వస్తుంది.గోవాలో కాంగ్రెస్ పార్టీ భాజపాకు గట్టిగా పోటీ ఇస్తుండగా, పంజాబ్ లో కాంగ్రెస్, ఆమాద్మీ పార్టీలు గట్టి పోటీ ఇస్తున్నాయి.

మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత రక్షణమంత్రి మనోహర్ పారిక్కర్ భాజపాను గెలిపించే బాధ్యత స్వీకరించి గట్టిగా ప్రచారం చేశారు. ఎందుకంటే అయన మంచి సమర్ధుడు, నిష్కళంక చరిత్ర కలవాడు, నిరాడంబరుడు, స్నేహశీలి అనే చాలా మంచిపేరు సంపాదించుకొన్నారు. భాజపాను గెలిపిస్తే మళ్ళీ ఆయననే ముఖ్యమంత్రి చేస్తామని భాజపా సంకేతాలు ఇస్తోంది కానీ ఆయనే తమ ముఖ్యమంత్రి అభ్యర్ధి అని ప్రకటించలేదు. ఆయన కూడా పార్టీ ఏ బాధ్యత అప్పగించినా స్వీకరించడానికి సిద్దంగా ఉన్నానని చెపుతున్నారు. ముఖ్యమంత్రి అభ్యర్ధి పేరు ప్రకటించకుండా భాజపా సృష్టించిన ఈ సస్పెన్స్ వలన ప్రజలలో అయోమయం ఏర్పడితే వారు కాంగ్రెస్, ఆమాద్మీ పార్టీలవైపు చూడవచ్చు. కానీ గోవా ప్రజలు మనోహర్ పారిక్కర్ మొహం చూసి భాజపాకు ఓటు వేసే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి.

ఇక పంజాబ్ లో భాజపా-అకాలీదళ్ కూటమి పాలన పట్ల ప్రజలు విసిగిపోయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ పరిస్థితిని కాంగ్రెస్, ఆమాద్మీ పార్టీలు తమకు అనుకూలంగా మలుచుకొని విజయం సాధించేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి. ఈసారి ఆ రెండింటికి సమానావకాశాలు ఉన్నట్లు సర్వేలు సూచిస్తున్నాయి. వాటిలో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ కొంచెం ముందంజలో ఉన్నట్లు తెలుస్తోంది. భాజపా-అకాలీదళ్ కూటమికి పరాజయం ఖాయమనే సర్వేలు కూడా సూచిస్తున్నాయి. కనుక అక్కడ పోటీ ప్రధానంగా కాంగ్రెస్-ఆమాద్మీ పార్టీల మద్యనే ఉన్నట్లు భావించవచ్చు. ఈ ఎన్నికల ఫలితాలు మార్చ్ 11న ప్రకటించబడుతాయి. 


Related Post