గవర్నర్ గిరీ జిందాబాద్

February 02, 2017


img

రాష్ట్ర విభజన తరువాత రెండు తెలుగు రాష్ట్రాల మద్య కొన్ని సమస్యలు అపరిష్కృతంగా మిగిలిపోయాయి. రెండు రాష్ట్రాలలో ప్రభుత్వాలను నడిపిస్తున్న పార్టీల మద్య రాజకీయ విభేదాలు, వాటి నేతల ఇగో (అహం), సాంకేతిక కారణాలు, నియమనిబంధనలు, చట్టపరమైన సమస్యలు వంటివెన్నో ఉన్నాయి. వాటిలో రాజకీయ కారణాలు, నేతల ఇగోల వలననే సులువుగా పరిష్కరించుకోగలిగిన సమస్యలు కూడా సంక్లిష్టంగా మారిపోయి అపరిష్కృతంగా మిగిలిపోతున్నాయని చెప్పక తప్పదు. 

ఏపి సిఎం చంద్రబాబు తన ఇగోని పక్కనబెట్టి తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంటికి వెళ్ళి ఆయనని అమరావతి శంఖుస్థాపనకు ఆహ్వానిస్తే ఆయన దానికి హాజరయ్యి హుందాతనం ప్రదర్శించారు. అలాగే చండీయాగానికి చంద్రబాబుని ఆహ్వానిస్తే ఆయన దానికి హాజరయ్యి మర్యాద పాటించారు. రాష్ట్ర విభజన తరువాత మొట్టమొదటిసారిగా అప్పుడు ఇరురాష్ట్రాల మద్య మంచి స్నేహపూరిత వాతావరణం కనపడింది. రెండు ప్రభుత్వాలు కొన్ని విషయాలలో ఇచ్చిపుచ్చుకొంటూ పరస్పరం చాలా సహకరించుకొన్నాయి. కానీ మళ్ళీ కొన్ని రోజులకు పరిస్థితులు మొదటికొచ్చాయి. నేటికీ వాటిలో ఎటువంటి మార్పు రాలేదు. 

సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించుకోకుండా వాయిదా వేయడం అంటే సమస్యలను భరించడమేనని చెప్పవచ్చు. ఆ విషయం ఇరు ప్రభుత్వాలకి వాటిని నడిపిస్తున్న అనుభవజ్ఞులైన ముఖ్యమంత్రులకి కూడా తెలుసు. ఈ సమస్యలు, వాటికి గల కారణాల గురించి కూడా మంచి అవగాహన కలిగి ఉన్న గవర్నర్ నరసింహన్ నిరాశ చెందకుండా, పట్టువదలకుండా వాటి పరిష్కారానికి తన వంతు ప్రయత్నాలు చేస్తూనే ఉండటం చాలా అభినందనీయం.

ఆయన సమక్షంలో రాజ్ భవన్ లో నిన్న జరిగిన ఇరు రాష్ట్రాల మంత్రుల కమిటీ సమావేశంలో ఈ సమస్యలపై చర్చించారు. ఎవరి సమస్యలు వాళ్ళు, వాటిపై రెండో పక్షం అభ్యంతరాలను నిర్మొహమాటంగా చెప్పుకొన్నారు. వారి వాదనలు సహేతుకంగానే ఉన్నప్పటికీ ఆ వైఖరికే కట్టుబడి ఉండటం వలననే సమస్యలకు పరిష్కారాలు దొరకడం లేదని చెప్పవచ్చు. అవన్నీ పీఠముడి పడున్నవే...మొదటి సమావేశంలోనే పరిష్కరించగలిగేవికావు కనుక వాటిలో  పరిష్కరించగలిగే అవకాశాలున్న 2-3 సమస్యలను మొదట తీసుకొని వాటి పరిష్కారాల కోసం ప్రయత్నిద్దామనే గవర్నర్ సూచనకు ఇరు పక్షాలు అంగీకరించాయి.  

వాటిలో మొదటగా తెలంగాణా విద్యుత్ శాఖ నుంచి తొలగించబడిన సుమారు 1100 మంది ఆంధ్రా ఉద్యోగులలో ఆంధ్రాలో పనిచేయడానికి ఇష్టపడేవారందరినీ తీసుకొంటామని, ఏపి సర్కార్ తరపున హాజరైన కమిటీ ప్రతినిధులు హామీ ఇవ్వగా, మిగిలిన వారిని మళ్ళీ తెలంగాణా విద్యుత్ శాఖలో తీసుకొనేందుకు ముఖ్యమంత్రితో మాట్లాడి నిర్ణయం తీసుకొంటామని రాష్ట్ర ప్రభుత్వం తరపున హాజరైన మంత్రి జగదీశ్ రెడ్డి హామీ ఇచ్చారు. సమస్యల పరిష్కార దిశలో పడిన తొలి అడుగుగా దీనిని చెప్పవచ్చు. కానీ ఆ ఉద్యోగులు కూడా వాస్తవిక దృష్టితో ఆలోచించి, తమ సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్న ఇరు ప్రభుత్వాలకు సహకరించడం చాలా అవసరం. లేకుంటే వారు నష్టపోవడమే కాకుండా ఈ చర్చలలో మళ్ళీ ప్రతిష్టంభన ఏర్పడవచ్చు. 

అనేక రాష్ట్రాలలో గవర్నర్లే రాష్ట్ర ప్రభుత్వాలకు శత్రువులుగా వ్యవహరిస్తుండటం, ఆ కారణంగా రాష్ట్ర ప్రభుత్వాలు, గవర్నర్ల మద్య ఘర్షణ వాతావరణం నెలకొని ఉండటం అందరూ చూస్తూనే ఉన్నారు. కానీ  వారికి పూర్తి భిన్నంగా గవర్నర్ నరసింహన్ ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో చాల సఖ్యతగా వ్యవహరిస్తుంటారు. అలాగే వారిద్దరూ కూడా ఆయన పట్ల అంతే గౌరవంగా వ్యవహరిస్తుంటారు. కనుక ఇటువంటి సహృద్భావ వాతావరణం నెలకొని ఉన్నప్పుడు, ఆయన ఈ సమస్యల పరిష్కారానికి చొరవ తీసుకొంటున్నప్పుడు, రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఆయన పెద్దరికాన్ని, అనుభవాన్ని, చేస్తున్న సూచనలను గౌరవించి పరస్పరం సహకరించుకొని ఈ సమస్యలను పరిష్కరించుకోవడం విజ్ఞత. 

మళ్ళీ ఈనెల 9వ తేదీన గవర్నర్ సమక్షంలో ఇరు రాష్ట్రాల మంత్రుల కమిటీలు సమావేశం అవ్వాలని నిర్ణయించారు. గవర్నర్ నరసింహన్ చేస్తున్న ఈ ప్రయత్నాలు ఫలిస్తే, రెండు రాష్ట్రాలకు చాలా మేలు కలుగుతుంది. కనుక ఆయన గవర్నర్ గిరీ ఫలించాలని కోరుకొందాం. 


Related Post