మాది కాపీ సర్వే: స్వామి

February 02, 2017


img

భాజపా ఎంపి సుబ్రహ్మణ్య స్వామి, దర్శకుడు రామ్ గోపాల్ రామ్ గోపాల్ వర్మ ఇద్దరూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ నెగెటివ్ పబ్లిసిటీ ద్వారా ప్రజల దృష్టిని ఆకట్టుకొంటుంటారని తెలిసిందే. ఇద్దరి నోటి దురదకు బలైపోయిన వాళ్ళు చాలా మందే ఉన్నారు. తాజాగా సుబ్రహ్మణ్య స్వామి మళ్ళీ నిన్న మరో బాంబు పేల్చారు. “ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ మొన్న పార్లమెంటులో ప్రవేశపెట్టిన ఆర్ధికసర్వేను చూసి నేను చాలా ఆశ్చర్యపోయాను. ఎందుకంటే మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ చెప్పిన విషయాలే అందులో ఉన్నాయి. గత ప్రభుత్వం చెప్పిన గణాంకాలను కొద్దిగా అటూఇటూ మార్చి దానిని తయారుచేసినట్లుంది. అందుకు ఆర్ధిక శాఖా ప్రధాన సలహాదారు అరవింద్ సుబ్రహ్మణ్యన్ న్నే తప్పు పట్టవలసి ఉంటుంది. అయన మా ప్రభుత్వం తరపున పనిచేస్తూ గత ప్రభుత్వం చెప్పిన విధంగా లెక్కలు చూపించడం చాలా విస్మయం కలిగిస్తోంది. అటువంటి వ్యక్తి ఆ పదవిలో ఉండటానికి అనర్హుడు. తక్షణమే అతనిని తొలగించాలి,” అని సుబ్రహ్మణ్య స్వామి అన్నారు.

అధికార పార్టీ సభ్యుడైన సుబ్రహ్మణ్య స్వామి ఈవిధంగా తమ ప్రభుత్వంలో మంత్రులు, ఉన్నతాధికారులు, వారి విధానాలనే తప్పుపడుతుండటం విచిత్రమనుకొంటే, అటువంటి వ్యక్తి వలన ప్రభుత్వానికి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురవుతున్నప్పటికీ ప్రధాని నరేంద్ర మోడీ ఆయనను ఉపేక్షిస్తుండటం ఇంకా ఆశ్చర్యం కలిగిస్తుంది. సుబ్రహ్మణ్య స్వామి తీరు చూస్తే మోడీ  సూచిస్తున్న వ్యక్తులనే ఆయన లక్ష్యాలుగా చేసుకొని వారిపై యుద్ధం ప్రకటిస్తున్నారా? అనే అనుమానం కలుగుతోంది. 


Related Post