భారత్ కు హెచ్1-బి, ముస్లిం దేశాలకు అది

February 02, 2017


img

అమెరికా-మెక్సికో ల మద్య గోడ కడతానని చెపుతున్న డోనాల్డ్ ట్రంప్, అమెరికాలోకి ఇతర దేశస్తులు ఎవరూ కూడా ప్రవేశించకుండా అడ్డుకొనేందుకు భౌతికంగా కంటికి కనిపించని చట్టపరమైన మరొక గోడని కూడా నిర్మించడం మొదలుపెట్టారు. ఆ కనపడని గోడ అమెరికాను ప్రపంచ దేశాలలో ఏకాకిగా మిగల్చవచ్చు. గమ్మతైన విషయం ఏమిటంటే, ట్రంప్ దానినే ఇష్టపడుతుండటం. ముస్లిం దేశాల శరణార్ధులు అమెరికాలో ప్రవేశించకుండా నిషేధం విదించినట్లు పైకి చెపుతున్నప్పటికీ, ఆ దేశాలకు చెందిన ఎవరినీ కూడా అమెరికాలో అడుగుపెట్టేందుకు అనుమతించడంలేదని వార్తలు వినిపిస్తున్నాయి. 

ఇక హెచ్1-బి వీసాలపై విదించిన కొత్త ఆంక్షలు వాటిని ఎక్కువగా వినియోగించుకొనే భారతీయులు, భారత్ సంస్థలను అడ్డుకోవడం కొరకేనని వేరే చెప్పనవసరం లేదు. నిజానికి ఆ వీసాలు పొందడం ఇదివరకే చాలా కష్ట సాధ్యంగా ఉండేది. ఇప్పుడు అవి పొందడం దాదాపు అసంభావంగా మార్చేశారు. అంతటితోనే అయిపోలేదు. అమెరికాలో చదువుల కోసం వచ్చిన లేదా వస్తున్న వారికి, అమెరికాలో స్థిరపడి ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి ప్రయాణిస్తున్నవారికి ఈ సరికొత్త అంక్షల వలన ఇంటి గడప దాటి స్వేచ్చగా బయటకు తిరగలేని పరిస్థితులు కనబడుతున్నాయని వార్తలు వినిపిస్తున్నాయి. 

ఉదాహరణకి, ఈనెల 25న న్యూయార్క్ లో జరుగనున్న స్నో-షూ ఛాంపియన్ షిప్ పోటీలలో పాల్గొనేందుకు రావలసిందిగా కాశ్మీర్ కు చెందిన తన్వీర్ హసన్, అబీద్ ఖాన్ లకు వరల్డ్ స్నో-షూ ఫెడరేషన్ నుంచి రెండు మూడు నెలల క్రితమే ఆహ్వానం అందింది. వారిరువురూ దానిలో పాల్గొనేందుకు అన్ని సన్నాహాలు చేసుకొని వీసా కోసం శనివారం డిల్లీలోని అమెరికన్ కౌన్సిలేట్ కు వెళ్ళారు. కానీ అధికారులు వారికి వీసా ఇవ్వడానికి  నిరాకరించారు. వారు శరణార్ధులు కారు. ఉగ్రవాదులు కారు. అమెరికాలో చదువు లేదా ఉద్యోగాల కోసం వెళ్ళాలనుకోవడం లేదు. ఒక క్రీడా పోటీలలో పాల్గొనేందుకు వెళుతున్నారు. కానీ వారినీ అనుమతించలేదు. 

ఇక దీనికి భిన్నమైన మరో ఉదాహరణ అమెరికాలో శాన్ జోస్ యూనివర్సిటీలో ఎం.ఎస్.3వ సెమిస్టార్ చేస్తున్న హైదరాబాద్ కు చెందిన ఒక తెలుగు విద్యార్ధినికి ఎదురైన చేదు అనుభవం. ఆమెకు కొన్ని రోజులు శలవులు ఉండటంతో శానిఫ్రాన్సిస్కోలో తమ బందువుల ఇంటికి వెళుతున్నప్పుడు, విమానాశ్రయంలో ఇమ్మిగ్రేషన్ అధికారులు ఆమెను అడ్డుకొని సుమారు రెండు మూడు గంటల సేపు ప్రశ్నించిన తరువాత ఆమె అమెరికాలో ఉండేందుకు వీలు లేదని తక్షణమే హైదరాబాద్ తిరిగివెళ్ళిపోవాలని ఆదేశించారు. ఆమె యూనివర్సిటీలో చేస్తున్న కోర్సును కాకుండా వేరే దానిని చదువుతున్నందున, ఆమె తన చదువులకు అవసరమైన డబ్బుని ఏవిధంగా సమకూర్చుకొంటున్నారో సంతృప్తికరమైన జవాబులు చెప్పలేకపోయినందుకు వెనక్కి తిప్పి పంపిస్తున్నట్లు అధికారులు తెలిపారు. 

భారత్ లో విద్యా, వైద్య రంగాలను కూడా పర్యాటక రంగానికి అనుబంధంగా మార్చి విదేశీ పర్యాటకులను ఆకట్టుకొనే ప్రయత్నాలు చేస్తుంటే, అమెరికా అందుకు పూర్తి భిన్నంగా వ్యవహరిస్తూ దేశంలో ఉన్నవారినే బయటకు పంపించి వేసేందుకు సాకులు వెదుకుతుండటం చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది. ట్రంప్ నిర్ణయాల వలన అమెరికాకు లాభపడితే మంచిదే కానీ ఇటువంటి విధానాలతో అమెరికా ఏకాకీగా మారిపోయి తన అగ్రరాజ్య హోదాను మరొక దేశానికి చేజేతులా అప్పగించుకోకుండా జాగ్రత్త పడితే మంచిది. 


Related Post