మధ్యతరగతి జీవులు త్యాగాలకే ఉన్నారా?

February 01, 2017


img

నోట్ల రద్దుతో సుమారు 3 నెలలు నానా కష్టాలు పడ్డ మధ్యతరగతి ప్రజలకు మోడీ ప్రభుత్వం బడ్జెట్ లో ఏవైనా వరాలు ప్రకటిస్తుందని ఆశగా ఎదురుచూస్తే వారికి మొండి చెయ్యి చూపి నిరాశపరిచింది. వార్షికాదాయం రూ.2.5 లక్షల వరకు ఇస్తున్న పన్ను మినహాయింపును ఈసారి మరో లక్ష రూపాయలకు పెంచుతుందని, లేదా కనీసం మరో రూ.50 వేలు పెంచి రూ.3లక్షలైనా చేస్తుందని మధ్యతరగతి ప్రజలు ఆశగా ఎదురు చూశారు. కానీ ఆ స్లాబుని పెంచలేదు. రూ.2.5 నుంచి 5.00 లక్షల వార్షికాదాయంపై ప్రస్తుతం వసూలు చేస్తున్న 10 శాతం ఆదాయపన్నును 5 శాతానికి తగ్గించింది. కనుక ఆ స్థాయి ఆదాయం అందుకొంటున్నవారికి చాలా ఊరటనిచ్చినట్లే చెప్పవచ్చు.

గృహ రుణాలపై వడ్డీ తగ్గిస్తున్నట్లు చెప్పారు కానీ అది ఎంతో, ఎప్పటి నుంచి వర్తింపజేస్తారో చెప్పలేదు. పేద, మధ్యతరగతి ప్రజలకు అందుబాటు ధరలలో నిర్మిస్తున్న ఇళ్ళను మౌలికవసతుల కల్పనా రంగంగా గుర్తింపునిచ్చింది. కనుక దానికి కొన్ని రాయితీలు లభించే అవకాశం ఉంది.

మొత్తంగా చూసినట్లయితే ఈ బడ్జెట్ లో మధ్యతరగతి ప్రజలకు మోడీ ప్రభుత్వం హ్యాండిచ్చినట్లే చెప్పవచ్చు. ఏ ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చినా మధ్యతరగతి ప్రజలకే మొదట మొట్టికాయలు వేసి వారినే త్యాగాలు చేయమని కోరుతుంటాయి. మోడీ ప్రభుత్వం వారికి మొట్టికాయలు వేయలేదు కానీ వారి త్యాగాలను గుర్తించలేదని చెప్పక తప్పదు. రూ.2.5 లక్షల స్లాబును కొద్దిగానైనా పెంచడానికి మోడీ ప్రభుత్వానికి మనసొప్పలేదు. 


Related Post