తమిళనాడులో మళ్ళీ అలజడి

February 01, 2017


img

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత నాలుగు నెలల క్రితం చెన్నై ఆపోలో ఆసుపత్రిలో చేరినప్పటి నుంచి ఆమె గుండెపోటుతో మృతి చెందేవరకు ఆ రాష్ట్రంలో ఒక రకమైన రాజకీయాలు సాగాయి. ఆమె మృతి చెందిన మరు క్షణం నుంచి మరొక రకం రాజకీయాలు మొదలయ్యాయి. అధికార అన్నాడిఎంకె పార్టీ అధ్యక్షురాలుగా ఎన్నికైన శశికళకు ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంకు మద్య కొన్ని రోజులు ఆధిపత్యపోరు కొనసాగినా, తమలో తామే పోరాడుకొంటే మద్యలో భాజపా ప్రవేశించవచ్చనే భయంతో రెండు వర్గాలు కొంచెం వెనక్కి తగ్గి రాజీ పడటంతో ఆ పార్టీలో పరిస్థితులు కొంచెం చల్లబదినట్లు కనిపిస్తున్నాయి.

అంతా సర్దుకొందనుకొంటున్న సమయంలో జయలలిత మేనకోడలు దీపా జయకుమార్ ముందే చెప్పినట్లుగా తన రాజకీయ ప్రవేశం గురించి నిన్న ప్రకటన చేశారు. ఇదివరకు జయలలిత ప్రాతినిధ్యం వహించిన చెన్నైలోని రాధాకృష్ణ నగర్ నియోజకవర్గంలో నిన్న పర్యటించి, తాను అక్కడి నుంచే ఉపఎన్నికలలో శాసనసభకు పోటీ చేస్తానని ప్రకటించారు. జయలలితకు అసలైన వారసురాలిని నేనేనని ప్రజలు భావిస్తూ నన్ను ఇక్కడి నుంచే పోటీ చేయమని కోరుతుంనందునే పోటీ చేయాలని నిశ్చయించుకొన్నాను. ఇక్కడి నుంచి వేరెవరు పోటీ చేస్తారో నాకు అనవసరం. నన్ను ప్రజలే గెలిపిస్తారని దృడంగా నమ్ముతున్నాను,” అని దీపా జయకుమార్ మీడియాతో అన్నారు. 

జయలలిత మరణాంతరం చాలా వేగంగా, తెలివిగా పావులు కదిపి పార్టీ పగ్గాలు దక్కించుకొన్న శశికళ, త్వరలో ముఖ్యమంత్రి పదవిని కూడా చేపట్టాలనుకొంటున్నట్లు తమిళ మీడియాలో వార్తలు వస్తున్నాయి. జయలలితకు అసలైన వారసురాలిని తానేనని దృడంగా నమ్ముతున్న ఆమె ప్రజలను కూడా నమ్మించేందుకు రాధాకృష్ణ నగర్ నియోజకవర్గం నుంచే పోటీ చేసి గెలిచి, ముఖ్యమంత్రి పదవి చేపట్టాలని భావిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. శశికళను తమ నియోజకవర్గం నుంచి పోటీ చేయవద్దని, చేసినట్లయితే తప్పకుండా ఓడిస్తామని అక్కడి ప్రజలు ముందే హెచ్చరిస్తున్నారు. అంతేకాదు..జయకు అసలైన వారసురాలు దీపేనని కనుక ఆమెను తమ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని కోరారు. ఆమె పోటీ చేస్తే అఖండ మెజార్టీతో గెలిపించుకొంటామని చెప్పారు. కనుక దీపా జయకుమార్ ఇప్పుడు అక్కడి నుంచే పోటీ చేయాలని నిశ్చయించుకోవడంతో శశికళ పునరాలోచించుకోవలసి ఉంటుంది. 


Related Post