విజయ్ మాల్యాకు వాళ్లిద్దరే సహాయపడ్డారుట!

January 30, 2017


img

ఐదు రాష్ట్రాలలో ఎన్నికలు త్వరలో మొదలవబోతున్నాయి కనుక అధికార, ప్రతిపక్ష పార్టీల మద్య విమర్శలు, ప్రతివిమర్శలు, ఆరోపణలు ప్రత్యారోపణలు కూడా మొదలైపోయాయి. బ్యాంకులకి రూ.9,000 కోట్లు ఎగవేసి లండన్ పారిపోయిన విజయ్ మాల్యాకు మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్, మాజీ ఆర్ధిక మంత్రి చిదంబరం చాలా సహకరించారని భాజపా ఆరోపించింది.

విజయ్ మాల్యాకు చెందిన కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ సంస్థ తీవ్ర నష్టాలలో ఉందని తెలిసి ఉన్నప్పటికీ వారిరువురూ బ్యాంకులపై తీవ్ర ఒత్తిడి తెచ్చి ఆ సంస్థకు రుణాలు ఇప్పించారని భాజపా అధికార ప్రతినిధి సంబిత్ పాత్రా ఆరోపించారు. పాత బాకీలు తీర్చకుండా మళ్ళీ కొత్త రుణాలు ఏవిధంగా ఇప్పించారని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ మునిగిపోతున్న ఓడ వంటిదని, అది మునిగిపోతున్న మరో ఓడ (కింగ్ ఫిషర్)కు సహాయపడిందని, కానీ దాని కెప్టెన్ విజయ్ మాల్యా హస్తం గుర్తుగల కాంగ్రెస్ పార్టీకే హ్యాండిచ్చి లండన్ పారిపోయాడని ఆరోపించారు. తన ఆరోపణలకు నిదర్శనంగా ఆయన కొన్ని పత్రాలను మీడియాకు అందజేశారు.

కాంగ్రెస్ పెద్దల ఒత్తిడి కారణంగానే విజయ్ మాల్యాకు బ్యాంకులు అప్పు ఇచ్చి ఉండవచ్చని అందరికీ తెలిసిన విషయమే. బుట్టలో చేపలున్న సంగతి చెప్పకపోయినా అందరికీ తెలుస్తుందన్నట్లుగా, భాజపా ప్రతినిధి ఆధారాలు లెక్కలు, కాగితం ముక్కలు చూపించకపోయినా ఆ సంగతి అందరికీ తెలుసు. అధికార పార్టీలు బ్యాంకులపై ఒత్తిళ్ళు తెచ్చి తమ వారికి రుణాలు ఇప్పించుకొంటాయనేది ఇప్పుడు అందరికీ తెలిసిన బహిరంగ రహస్యమే. ఆవిధంగా బ్యాంక్ రుణాలు తీసుకొని వాటిని తిరిగి చెల్లించకుండా తప్పించుకొని తిరుగుతున్న వాళ్ళు చాలా మంది మన కళ్ళ ముందే తిరుగుతున్నారిప్పుడు. అధికారంలో ఉన్న పార్టీలలో చేరిపోవడం ద్వారా బ్యాంకులు తమ జోలికి రాకుండా జాగ్రత్తపడుతున్నారు.

అయితే కాంగ్రెస్ పార్టీని వేలెత్తి చూపిస్తున్న భాజపా కూడా తక్కువ తినలేదనే చెప్పాలి. దాని ఖాతాలో గాలి జనార్ధన్ రెడ్డి వంటి అవినీతి శిఖామణులున్నారు. ఆ అవినీతి, దాని ద్వారా కూడబెట్టిన సంపదల గురించి అందరికీ తెలుసు. ఇక  విజయ్ మాల్యా విషయానికే వస్తే అతను భాజపా అధికారంలోకి వచ్చిన తరువాతే లండన్ పారిపోయాడు. అతని ఆర్ధిక పరిస్థితి గురించి కాంగ్రెస్ పార్టీకి తెలియకుండానే రుణాలు ఇప్పించిందా? అని గట్టిగా ప్రశ్నిస్తున్న భాజపాకి కూడా ఆ సంగతి తెలియదనుకోలేము. కానీ చూసీ చూడనట్లు ఊరుకొన్నందునే అతను లండన్ పారిపోగలిగాడు. అందరూ కలిసే విజయ్ మాల్యాను భారత్ గడప దాటించేశారని చెప్పకతప్పదు.

నోట్ల రద్దు కారణంగా సామాన్య ప్రజలు అష్టకష్టాలు పడుతున్న సమయంలోనే విజయ్ మాల్యా బ్యాంకులకి బాకీ ఉన్న సుమారు రూ.1,000 కోట్లు పైగా రుణాలను మొండి పద్దులలో వ్రాసేసిన సంగతి ప్రజలకు గుర్తుండే ఉంటుంది. దానర్ధం ఏమిటి? కనుక ఈ ఆరోపణలు, ప్రత్యారోపణలు అన్నీ సామాన్య ప్రజలను మభ్యపెట్టి, ఎన్నికలలో ప్రత్యర్ధులను దెబ్బ తీసేందుకే తప్ప విజయ్ మాల్యా నుంచి డబ్బు వసూలు చేయడానికి పనికి రావు. 


Related Post