బడ్జెట్ సమావేశాలు-ఎన్నికలు ఒకేసారి..

January 30, 2017


img

రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ రేపు పార్లమెంటు ఉభయసభలను ఉద్దేశ్యించి ప్రసంగించడంతో బడ్జెట్ సమావేశాలు మొదలుకాబోతున్నాయి. ఫిబ్రవరి 4నుంచి మార్చి 8 వరకు పంజాబ్, గోవా, గుజరాత్, ఉత్తరప్రదేశ్, మణిపూర్ రాష్ట్రాల శాసనసభ ఎన్నికలు జరుగబోతున్నాయి. కేంద్ర బడ్జెట్ ఎంత ప్రాధాన్యమైనదో వేరే చెప్పనవసరం లేదు. ఈసారి రైల్వే బడ్జెట్ ను కూడా దానిలోనే కలిపేసి ప్రవేశపెడుతునందున దానికి ఇంకా ప్రాధాన్యత పెరిగింది. 

నోట్ల రద్దు తరువాత ఎన్నికలకు, జి.ఎస్.టి.బిల్లు అమలుకు ముందుగా ఈ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నందున, మోడీ సర్కార్ ఈసారి దేశప్రజలను ప్రసన్నం చేసుకొనేందుకు ఏవైనా వరాలు ప్రకటించవచ్చునని అందరూ ఆశగా ఎదురుచూస్తున్నారు. 

కాంగ్రెస్ దాని మిత్రపక్షాలు నోట్ల రద్దు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ శీతాకాల సమావేశాలలో ఒక్కరోజు కూడా పార్లమెంటు సమావేశాలు జరుగనీయకుండా అడ్డుకొన్నాయి. ఈసారి 5 రాష్ట్రాలలో ఎన్నికలు జరుగబోతున్నందున మళ్ళీ అదే అంశంపై మోడీ ప్రభుత్వాన్ని పార్లమెంటులో గట్టిగా నిలదీసే ప్రయత్నాలు చేయవచ్చు. తద్వారా మోడీ సర్కార్ ను ఎన్నికలు జరుగుతున్న 5 రాష్ట్రాల ప్రజల ముందు దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేయవచ్చు.

ఈసారి సమావేశాలలో ఏపికి ప్రత్యేక హోదా కోరుతూ సభలో ఆందోళన చేయాలని వైకాపా భావిస్తోంది. పశ్చిమ బెంగాల్ లోని అధికార తృణమూల్ కాంగ్రెస్ ఎంపిల అరెస్టుల పర్వం ఇంకా కొనసాగుతూనే ఉన్నందున ఆ పార్టీ సభ్యులు కూడా ఈ సమావేశాలకు అడ్డుపడవచ్చు. 

కనుక గతానికి భిన్నంగా ఈసారి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలలో కూడా చాలా రభస జరిగే సూచనలు కన్పిస్తున్నాయి. ఒకపక్క దేశభవిష్యత్ ను నిర్దేశించే కీలకమైన బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నప్పుడే, కాంగ్రెస్, భాజపాలకు అత్యంత కీలకమైన 5 రాష్ట్రాల ఎన్నికలు జరుగుతుండటంతో వాటికి ఈసారి కత్తి మీద సాము చేయవలసి ఉంటుంది.


Related Post