ట్రంప్ బాటలో భారత్ కూడా?

January 30, 2017


img

ఇరాన్, ఇరాక్, సిరియా మొదలైన ఏడు దేశాల నుంచి అమెరికాకు వస్తున్న ప్రజలు, శరణార్ధులపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ 3నెలల పాటు నిషేధం విధించడంతో అమెరికా, ఆ 7 దేశాలతో సహా ప్రపంచంలోని అనేక దేశాలలో ఆయనపై ఆగ్రహవేశాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ సమయంలో భారత ప్రభుత్వం కూడా అటువంటిదే కాకపోయినా భారత్ వస్తున్న విదేశీ యాత్రికుల విషయంలో ఒక కొత్త నిబంధన అమలుచేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తాజా సమాచారం. 

చిన్నపిల్లలపై లైంగిక వేధింపులకు పాల్పడిన వారిని భారత్ లోకి అనుమతించకూడదని కేంద్ర మహిళాశిశు సంక్షేమ శాఖ మంత్రి మేనకా గాంధీ చేసిన ప్రతిపాదన చేశారు. దానిని విదేశాంగ శాఖ పరిశీలిస్తోంది. దాని ప్రకారం భారత్ రావాలనుకొన్న విదేశీయులు తప్పనిసరిగా తాము అటువంటి నేరాలకు పాల్పడలేదని దృవీకరించవలసి ఉంటుంది. ఒకవేళ వారిపై ఏమైనా క్రిమినల్ రికార్డులు నమోదు అయ్యుంటే ఆ వివరాలను భారత్ వీసాకు దరఖాస్తు చేసుకొన్నప్పుడు తప్పనిసరిగా పేర్కొనవలసి ఉంటుంది. విదేశాంగ శాఖ, ప్రధాని నరేంద్ర మోడీ ఈ ప్రతిపాదనకు అంగీకరించినట్లయితే దానికి చట్ట రూపం కల్పించి అమలులోకి వచ్చే అవకాశం ఉంటుంది. 

ఇది కేవలం చిన్న పిల్లలపై లైంగిక నేరాలకు పాల్పడినవారు దేశంలో ప్రవేశించకుండా అడ్డుకోనేందుకే అనుకొన్నప్పటికీ మున్ముందు దానికి మరికొన్ని నేరాల జాబితా జోడించే అవకాశం ఉండవచ్చు. భారత్ వీసా దరఖాస్తు చేసుకొంటున్న వారు తాము చిన్నపిల్లలపై లైంగిక వేధింపులకు పాల్పడలేదని స్వీయ దృవీకరణ పత్రం ఇచ్చినంత మాత్రాన్న దానిని నమ్మలేము కనుక పోలీస్ సర్టిఫికేట్ కూడా సంపర్పించాలని కూడా కోరినట్లయితే, విమర్శలు మొదలయ్యే అవకాశం ఉంది.

 నిజానికి ఎటువంటి నేరాలకు పాల్పడినవారినైనా తమ దేశంలోకి రాకుండా నిషేధించే అధికారం అన్ని దేశాలకు ఉంటుంది. కానీ దానిని కటినంగా అమలుచేసినట్లయితే హఫీజ్ సయీద్ వంటి కరడుగట్టిన తీవ్రవాదులు, విజయ్ మాల్యా వంటి ఆర్ధిక నేరస్తులు అసలు దేశం దాటి వెళ్ళనే లేరు. విదేశాలలో ప్రవేశించనే లేరు. కానీ అసమదీయుల కోసం ప్రపంచ దేశాలన్నీ నిబంధనలను కాగితాలకే పరిమితం చేస్తుండటం వలన ఎటువంటి నేరాలకు పాల్పడినవారైనా దర్జాగా ప్రపంచదేశాలలో ఎక్కడికైనా వెళ్ళగలుగుతున్నారు. కనుక ఈ విషయంలో భారత్ చాలా ఆచితూచి నిర్ణయం తీసుకోవలసి ఉంటుంది.


Related Post