ఏమిటి కేసీఆర్ గురించి విన్నది నిజమేనా?

January 28, 2017


img

మరో 20 ఏళ్ళ పాటు కేసీఆరే ముఖ్యమంత్రిగా ఉంటారని ఆయన కుమారుడు మంత్రి కేటిఆర్ తో సహా తెరాస నేతలు, మంత్రులు అందరూ బల్లగుద్ది వాదిస్తుంటారు. వారి కోరికలో సాధ్యాసాధ్యాలను పక్కన పెడితే వారు ఆవిధంగా కోరుకోవడం సహజమేనని చెప్పవచ్చు. కానీ తెరాస భువనగిరి ఎంపి బూర నర్సయ్య గౌడ్ ఒక బాంబులాంటి వార్తను పేల్చారు. 2019 ఎన్నికలలో కేసీఆర్ పోటీ చేయరని ఆయన జాతీయ రాజకీయాలలో కీలకపాత్ర పోషిస్తారని చెప్పారు. కనుక ఆయన ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ఎవరు సూచిస్తే వారే రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతారని అన్నారు. కానీ దాని గురించి ఆలోచించడానికి ఇంకా చాలా సమయం ఉందని అన్నారు. 

అధికార పార్టీ ఎంపిగా ఉన్న నర్సయ్య గౌడ్ ముఖ్యమంత్రి కేసీఆర్ గురించి చెప్పిన ఈ విషయాన్ని తేలికగా కొట్టి పడేయలేము. ఇప్పటికే మంత్రి కేటిఆర్ పార్టీపై, పాలనపై, రాష్ట్ర రాజకీయాలపై కూడా మంచి పట్టు సాధించారు కనుక వచ్చే ఎన్నికలలో ఆయననే ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ప్రకటించినా ఆశ్చర్యం లేదు. కేసీఆర్ ఇదివరకు కేంద్రమంత్రిగా పనిచేసినప్పటికీ ఆయన ఏనాడూ జాతీయ రాజకీయాలపై పెద్దగా ఆసక్తి చూపిన దాఖలాలు లేవు. ఆయన ఎప్పుడూ తన రాష్ట్రాన్ని విడిచిపెట్టి బయటకు వెళ్ళడానికి కూడా ఇష్టపడుతున్నట్లు కనిపించరు. కనుక తన కుమారుడు కేటిఆర్ ని ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ప్రకటించినట్లయితే, ఆయన తనకు ఎంతో ఇష్టమైన వ్యవసాయం, పుస్తక పటనంతో హాయిగా కాలక్షేపం చేసేందుకే మొగ్గు చూపవచ్చు. అయినా కేసీఆర్ రాజకీయాల నుంచి రిటైర్ మెంటు గురించి ఆలోచించడానికి ఇంకా చాలా సమయమే ఉంది. వచ్చే ఎన్నికల నాటికి తెలంగాణా రాష్ట్ర రాజకీయ పరిస్థతి ఏవిధంగా ఉంటుందో ఇప్పటి నుంచి ఊహించడం కష్టం, అనవసరం కూడా. 


Related Post