భాజపాకి బదులు తెదేపా వెళ్తోందేమిటి?

January 28, 2017


img

ఏపిలో తెదేపా, భాజపాలు ఇంకా కలిసే సాగుతున్నప్పటికీ, తెలంగాణాలో అనధికారికంగా కటీఫ్ చెప్పేసుకొన్నాయి. ఒక రాష్ట్రంలో వాటి మద్య దోస్తీ, మరొక రాష్ట్రంలో దుష్మనీ మెయిన్టెయిన్ చేయడం విచిత్రంగానే ఉంది. 

ఇంతకీ విషయం ఏమిటంటే, తెలంగాణా తెదేపా నేతలు త్వరలోనే డిల్లీ వెళ్ళి కేంద్రప్రభుత్వానికి తెరాస సర్కార్ పై పిర్యాదు చేయబోతున్నారు. కేంద్రప్రభుత్వం రైతులకి ఇన్-పుట్ సబ్సీడీగా అందించిన నిధులను, తెరాస సర్కార్ వేరే పధకాలకు మళ్ళించిందనేది వారి పిర్యాదులలో ఒకటి. ఫిబ్రవరి 7 నుంచి 9 వరకు మూడు రోజులు పాటు డిల్లీలో మకాం వేసి వివిధశాఖల మంత్రులను కలిసి, వారు రాష్ట్రానికి మంజూరు చేసిన నిధులను తెరాస సర్కార్ ఏవిధంగా పక్కదారి పట్టిస్తోందో తెలియజేస్తారు. 

తెలంగాణా తెదేపా అధ్యక్షుడు ఎల్.రమణ, వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి నేతృత్వంలో తెదేపా నేతల బృందం ఫిబ్రవరి 7న డిల్లీకి వెళ్ళి కేంద్ర వ్యవసాయశాఖా మంత్రి రాదా మోహన్ సింగ్ ను కలిసి పిర్యాదు చేయబోతున్నారు. 

ప్రధానమంత్రి ఆవాస్ యోజన పధకం కోసం మంజూరు చేసిన లక్ష ఇళ్ళ గురించి కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్య నాయుడుకి, బలహీన వర్గాలు, ఎస్సీ ఎస్టీ సబ్-ప్లాన్ కోసం మంజూరు చేసిన నిధుల దుర్వినోయోగం గురించి మంత్రి గెహ్లాట్ కు, ప్రాజెక్టుల పేరిట రైతుల దగ్గర నుంచి బలవంతపు భూసేకరణ గురించి కేంద్రం హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ కు పిర్యాదులు చేస్తామని పార్టీ వ్యవహారాల కన్వీనర్ గుళ్ళపల్లి బుచ్చి లింగం చెప్పారు. 

తెలంగాణాలో తెదేపా, భాజపా సంబంధాలు బాగోలేకపోయినప్పటికీ, జాతీయ స్థాయిలో ఆ రెండు పార్టీల మద్య సత్సంబంధాలే ఉన్నాయి కనుక రేవంత రెడ్డి బృందం డిల్లీ వెళ్ళినప్పుడు వారిని కేంద్రమంత్రులు బాగానే రిసీవ్ చేసుకోవచ్చు. 

కానీ ఈ అంశాల గురించి రాష్ట్ర భాజపా నేతలు కూడా తెరాస సర్కార్ పై విమర్శిస్తున్నప్పుడు ముందుగా వారే డిల్లీ వెళ్ళి తమ అధిష్టానానికి పిర్యాదు చేస్తే అది సహజంగా ఉండేది. దాని వలన వారికి తమ అధిష్టానం వద్ద మంచి గుర్తింపు కూడా వచ్చి ఉండేది. కానీ వచ్చే ఎన్నికలలో తెరాసతో పొత్తులు పెట్టుకొనే ఆలోచన ఉన్నందునేనేమో వారు వెనుకంజవేసినట్లున్నారు. రాష్ట్ర భాజపా నేతలు చొరవ చూపకపోవడంతో తెలంగాణా తెదేపా నేతలు ఈ అవకాశాన్ని వినియోగించుకోబోతున్నారు. 

వారి చర్య తెరాస సర్కార్ కు ఆగ్రహం కలిగించడం సహజమే కనుక త్వరలో విమర్శల వర్షం కురిసే అవకాశం కూడా ఉంది. రాష్ట్రాభివృద్ధి కోసం తాము ఎంతగానో కష్టపడుతుంటే, తెదేపా నేతలు అడుగడుగునా తమకు అడ్డుపడటమే కాకుండా పనిగట్టుకొని డిల్లీ కూడా వెళ్ళి రాష్ట్రానికి నిధులు రాకుండా అడ్డుపడుతున్నారని తెరాస నేతలు, మంత్రులు విమర్శలు గుప్పించవచ్చు. 

ఒకవేళ భవిష్యత్ లో తెరాసతో పొత్తులు పెట్టుకొనే ఆలోచనలో భాజపా ఉన్నట్లయితే, కేంద్రప్రభుత్వం తెదేపా నేతల పిర్యాదులను పట్టించుకోకపోవచ్చు. అదే డా.కె.లక్ష్మణ్ చెపుతున్నట్లు వచ్చే ఎన్నికలలో ఒంటరి పోరుకే మొగ్గు చూపే మాటయితే, వారి పిర్యాదులను సీరియస్ గానే తీసుకోవచ్చు. 


Related Post