అతనొక ట్విట్టర్ టైగర్: భాజపా

January 27, 2017


img

జనసేనాని పవన్ కళ్యాణ్ విమర్శలకు భాజపా వెంటనే చాల ఘాటుగా జవాబివ్వడం విశేషం. భాజపా అధికార ప్రతినిధి కృష్ణసాగర్ రావు మీడియాతో మాట్లాడుతూ, “పవన్ కళ్యాణ్ ఒక ట్విట్టర్ పులి. రాజకీయ అవకాశవాది. మా పార్టీ నేతలపై, మా ప్రభుత్వంపై, ఏపి సిఎం చంద్రబాబు నాయుడుపై పవన్ కళ్యాణ్ చేసిన విమర్శలు అతని రాజకీయ అపరిపక్వతకు అద్దం పడుతున్నాయి. ఆ సమస్యల పట్ల ఆయనకి కనీస అవగాహన లేదు కనీసం నిబద్దత లేదు. ఏదో ఒక అంశంపై వేరెవరైనా పోరాడితే దాని నుంచి తను లబ్ది పొందాలని ఆశపడుతున్నారు. తను ఏ ప్రజల కోసమైతే పోరాడుతున్నానని చెప్పుకొంటున్నారో, వారి మద్యకు వెళ్ళకుండా ఎక్కడో కూర్చొని ట్వీట్లు, ప్రెస్ మీట్లు పెట్టుకొంటున్న పార్ట్-టైం రాజకీయ నాయకుడు అతను. చంద్రబాబు నాయుడుపై ఆయన చేసిన విమర్శలు రాజకీయ అపరిపక్వతకు, అవగాహనాలోపానికి మంచి నిదర్శనం. వైజాగ్ లో ర్యాలీకి పోలీసులు అనుమతి ఈయకపోతే, దానికి ప్రధాని నరేంద్ర మోడీని విమర్శించడం కూడా పవన్ కళ్యాణ్ అపరిపక్వతను సూచిస్తోంది,” అని విమర్శించారు.

ఈ ప్రత్యేక పోరాటాలు, నేతల విమర్శలు చూస్తే కొన్ని ఆసక్తికరమైన విషయాలు కనబడతాయి. ఈ విషయంలో పవన్ కళ్యాణ్  కేంద్రప్రభుత్వాన్ని ఎక్కువగా విమర్శిస్తారు. జగన్ కేవలం చంద్రబాబు నాయుడునే విమర్శిస్తారు. పవన్, జగన్ ఇరువురూ ప్రత్యేక హోదా కోసమే పోరాడుతున్నా కలిసి పోరాడాలనుకోరు. ఎందుకంటే వారికి ఒకరిపై మరొకరికి సదాభిప్రాయం లేదు. ఇక తెదేపా నేతలు జగన్ విమర్శలకి మాత్రమే స్పందిస్తుంటారు. పవన్ కళ్యాణ్ తమని కూడా విమర్శిస్తున్నప్పటికీ, వారికి చంద్రబాబు బ్రేకులు వేస్తుండటంతో మౌనం వహించవలసి వస్తోంది. కానీ పవన్ కళ్యాణ్ విమర్శలు రోజురోజుకి తీవ్రం అవుతున్నందున, వచ్చే ఎన్నికలలో ఆయన తెదేపాకు మద్దతు పలుకుతారనే నమ్మకం సన్నగిల్లుతోంది. కనుక త్వరలోనే బాబు తమ పార్టీ నేతలకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేయవచ్చు. అప్పుడు వారు పవన్ కళ్యాణ్ తో కబాడీ ఆడేసుకోవడం తధ్యం. మరో విశేషం ఏమిటంటే అందరూ ఒకరినొకరు తీవ్రంగా విమర్శించుకొంటూనే, మళ్ళీ ఎవరైనా తమను విమర్శిస్తే జీర్ణించుకోలేక తమను విమర్శించిన వారిపై ఈవిధంగా విరుచుకుపడుతుంటారు. అందరూ కలిసి ప్రత్యేక హోదా కోసం పోరాడకుండా వారిలో వారే పోరాడుకొంటూ కాలక్షేపం చేసేస్తున్నారు. మరి ఎవరు ఏవిధంగా ఎప్పుడు ప్రత్యేక హోదా సాధిస్తారో చూడాలి.  


Related Post