భాజపాకే అలా ఎందుకు జరుగుతోంది?

January 27, 2017


img

కాంగ్రెస్, భాజపాలు కేంద్రంలో అధికారం దక్కించుకోగలుగుతున్నప్పటికీ రాష్ట్ర స్థాయిలో ఏదో ఒక ప్రాంతీయ పార్టీ పంచన చేరక తప్పనిసరి పరిస్థితి నెలకొని ఉంది. అందుకు వాటిని తప్పు పట్టలేము. ఎందుకంటే ఇప్పుడు ప్రతీ రాష్ట్రంలోను ప్రాంతీయ పార్టీలదే హవా నడుస్తోంది. కేంద్రంలో అధికారంలో ఉన్న భాజపాకి ఆంధ్రా, తెలంగాణాలలో తెదేపాతో, మహారాష్ట్రలో శివసేనతో, జమ్మూ కాశ్మీర్ లో పిడిపితో, పంజాబ్ లో అకాలీదళ్ తో కలిసి సాగుతోంది. కానీ ఏ రాష్ట్రంలో కూడా వాటి పొత్తులు సజావుగా సాగకపోవడమే విశేషం. తాజాగా మహారాష్ట్ర ప్రభుత్వంలో భాగస్వామిగా కొనసాగుతున్న శివసేన పార్టీ, త్వరలో జరుగబోతున్న గ్రేటర్ ముంబై కార్పోరేషన్ ఎన్నికలలో ఒంటరిగా పోటీ చేయబోతున్నట్లు ప్రకటించి భాజపాకు షాక్ ఇచ్చింది. సీట్లు సర్దుబాటు కాకపోవడం వలననే ఒంటరిగా పోటీ చేయాలనుకొంటున్నట్లు ఆ పార్టీ అధినేత ఉద్దావ్ టాక్రే తెలిపారు. 

ఇక ఆంధ్రలో ప్రత్యేక హోదాపై ఆందోళనలుమొదలైన ప్రతీసారి తెదేపా-భాజపాల మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడుతూనే ఉంటుంది. ఇక 2014ఎన్నికలలో భాజపాకు మద్దతు ప్రకటించిన పవన్ కళ్యాణ్, గత కొన్ని నెలలుగా భాజపాపై కత్తులు నూరుతుండటం అందరూ చూస్తూనే ఉన్నారు. తెలంగాణాలో ఆ రెండు పార్టీలు అధికారికంగా ఇంకా కటీఫ్ చెప్పుకోకపోయినా దూరమయ్యి చాలా కాలమే అయ్యింది. 

జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో వేర్పాటువాదులకు మద్దతు ఇచ్చే పిడిపితో సంకీర్ణ ప్రభుత్వంలో భాజపా భాగస్వామిగా కొనసాగుతున్నప్పటికీ, వారి బందం తుమ్మితే ఊడిపోయే ముక్కులాగ సాగుతోంది. ఫిబ్రవరి 4న పంజాబ్ శాసనసభ ఎన్నికలు జరుగబోతున్నాయి. అక్కడ అకాలీదళ్ సంకీర్ణ ప్రభుత్వంలో భాజపా భాగస్వామిగా ఉంది. కానీ అకాలీదళ్ పార్టీ ఇప్పుడు ఆమాద్మీ పార్టీవైపు చూస్తున్నట్లు పుకార్లు వినిపిస్తున్నాయి. ఈవిధంగా అన్ని రాష్ట్రాలలోను భాజపాకు మిత్రపక్షంగా ఉన్న పార్టీలు దానికి దూరం జరిగే ప్రయత్నాలు చేస్తుండటం చూస్తే, వచ్చే ఎన్నికల నాటికి దానితో కలిసి కొనసాగేవారు ఎందరు మిగులుతారనే అనుమానం కలుగుతోంది.  


Related Post