హైకోర్టు విభజన ఇప్పుడు కాదుట!

January 27, 2017


img

రెండు తెలుగు రాష్ట్రాలు వేర్పడి రెండున్నరేళ్ళుపైనే అయ్యింది కానీ ఇంతవరకు హైకోర్టు విభజన కాలేదు. ఏపిలో హైకోర్టు ఏర్పాటుచేసుకొనే వరకు హైకోర్టు ఉమ్మడి హైకోర్టుగా సాగుతుందని, అంతవరకు దానిని విభజించి హైదరాబాద్ లేదా తెలంగాణా గడ్డ మీద మరెక్కడా ఏర్పాటు చేయకూడదనే విభజన చట్టంలో ఉన్న లోపభూయిష్టమైన నిబంధన ప్రధాన కారణమైతే, ఆ లోపాన్ని ఏపి సిఎం చంద్రబాబు నాయుడు తనకు అనుకూలంగా ఉపయోగించుకొంటుండటం మరో కారణమని అందరికీ తెలుసు. ఆయన ఆవిధంగా ఎందుకు వ్యవహరిస్తున్నారంటే షెడ్యూల్:10 సంస్థల విభజన వంటి కొన్ని సమస్యలను పరిష్కరించుకొనేందుకు తెరాస సర్కార్ ముందుకు రాకపోవడం చేతనే అని చెప్పవచ్చు. 

రాజ్ భవన్ లో నిన్న జరిగిన ‘ఎట్ హోం’ కార్యక్రామానికి కేసీఆర్, బాబు హాజరయినప్పుడు మళ్ళీ ఆ ప్రస్తావన వచ్చినట్లు తెలుస్తోంది. హైకోర్టు విభజనకు సహకరించమని కేసీఆర్ నేరుగా చంద్రబాబును కోరగా, షెడ్యూల్:10 సంస్థల విభజనకు సహకరించమని బాబు కోరినట్లు తెలుస్తోంది. ఒక్కో సమస్య కాకుండా అన్నిటినీ ఒకేసారి పరిష్కరించుకొందామని బాబు చెప్పినట్లు తెలుస్తోంది. సమస్యల పరిష్కారం కోసం తమ ప్రభుత్వం సిద్దంగా ఉందని, తెరాస సర్కార్ కూడా ముందుకు రావాలని కోరుతూ బంతిని మళ్ళీ కేసీఆర్ కోర్టులో పడేశారు బాబు. 

షెడ్యూల్: 10 సంస్థల విభజనకు కేసీఆర్ అంగీకరించరు కనుక హైకోర్టు విభజనకు బాబు కూడా అంగీకరించరని స్పష్టం అవుతోంది. కనుక విభజన చట్టంలో ఉన్న ఆ లోపం ఉన్నప్పటికీ ఈ సమస్య పరిష్కారం ఇరువురు ముఖ్యమంత్రుల చేతిలోనే ఉన్నట్లు అర్ధం అవుతోంది. షెడ్యూల్: 10 సంస్థల విభజనకు కేసీఆర్ అంగీకరించినా, డిల్లీలో ఏపి భవన్ విభజన, నదీ జలాల పంపకాలు, తెలంగాణా ప్రాజెక్టులు ఇలాగ అనేక ఇతర అంశాలను కూడా పరిష్కరించాలని బాబు పట్టకుండా ఉంటారనుకోలేము. రెండు రాష్ట్ర ప్రభుత్వాలకి తమ తమ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుకోవాలనుకోవడం సహజం కనుక ఆ సమస్యల పరిష్కారం కావడం కూడా కష్టమేనని చెప్పవచ్చు. 

కనుక అమరావతిలో హైకోర్టు నిర్మాణం పూర్తయి అది వినియోగానికి సిద్దం అయినప్పుడే, హైకోర్టు విభజన జరుగుతుందని భావించవలసి ఉంటుంది. ఈ సమస్యల దృష్ట్యా ఎపి సర్కార్ ఇప్పట్లో హైకోర్టు నిర్మించే ఆలోచన చేయకపోవచ్చు. మరయితే హైకోర్టు విభజన ఎప్పుడు? అంటే కాలమే సమాధానం చెప్పాలి. 


Related Post