నేతన్నకు పద్మశ్రీ

January 26, 2017


img

చేనేత కార్మికుల కష్టాల గురించి కొత్తగా చెప్పుకోవలసింది ఏమీ లేదు. అంతులేని వారి కష్టాలు, కన్నీళ్ళ గురించి చెప్పుకోవడం మొదలుపెడితే వారితో బాటు మనమూ కన్నీళ్ళు కార్చడం ఖాయం. తెలంగాణా ప్రభుత్వం వారి సమస్యలను తీర్చి వారి జీవితాలలో వెలుగులు నింపడానికి గట్టి ప్రయత్నాలు మొదలుపెట్టింది కనుక త్వరలోనే వారి బతుకులు గాడిన పడతాయని ఆశిద్దాం. 

కేంద్రప్రభుత్వం ప్రకటించిన పద్మశ్రీ అవార్డులు అందుకోబోతున్నవారిలో మహామహులే కాదు..గుంటూరుకు చెందిన మల్లేశం (33) అనే చేనేత కార్మికుడు కూడా ఉండటం విశేషం. అతను పెద్దగా చదువుకోలేదు. కానీ నేతన్న పనిని చాలా సులువు చేసే ‘లక్ష్మి ఆసు యంత్రాన్ని’ తయారుచేశాడు. దానితో రోజుకి రెండు చీరలు నేసే సమయంలో 6 చీరలు నేయగలుగుతున్నారు. అతని ప్రతిభని గుర్తించిన కేంద్రప్రభుత్వం అతనికి ప్రతిష్టాత్మకమైన పద్మశ్రీ అవార్డును ప్రకటించింది. 

ఆసు యంత్రం తయారుచేయాలనే ఆలోచన ఎలా మొదలైందంటే...మల్లేశం తన తల్లి లక్ష్మి ఆసు యంత్రంతో చీరలు నేయడానికి పడుతున్న కష్టాన్ని..ఆ కారణంగా చేతులు, భుజాల నొప్పులతో ఆమె పడే బాధలను చూసి, ఇంకా సులువుగా చీరలు నేయడానికి వీలుగా దానిలో కొన్ని మార్పులు చేయాలనుకొన్నాడు. తన మనసులో ఉన్న ఆలోచనలకు అనుగుణంగా ముందు కర్రతో దానిని తయారుచేశాడు. దానిని మళ్ళీ మళ్ళీ పరీక్షించి అవసరమైన మార్పులు చేర్పులు చేశాడు. కానీ ఎంత ప్రయత్నించినా ఆ యంత్రంలో దారం పెగ్ ను చుట్టుకొన్నాక, తరువాత వరుస నేయడానికి మళ్ళీ ఆ దారాన్ని క్రిందకు తీసుకురావడానికి ఎటువంటి పరికరం ఆ యంత్రానికి జోడించాలో తెలియక మల్లేశం చాలా కుస్తీలు పట్టాడు. ఆ ప్రయోగాలతో మల్లేశం చేతిలో ఉన్న డబ్బు అంతా ఖర్చయిపోయింది. దానితో మల్లేశం చాలా నిరాశ,నిస్పృహలకు లోనయ్యాడు. దానిని అలాగే వదిలిపెట్టి హైదరాబాద్ వెళ్ళిపోయి బాలానగర్ లో ఓ వర్క్ షాపులో పనివాడుగా చేరాడు. 

అక్కడే ఒక యంత్రంలో ఒక భాగం పనిచేస్తున్న తీరుని చూసి అది సరిగ్గా తను కోరుకొంటున్నవిధంగానే ఉందని గుర్తించాడు. అప్పుడే మల్లేశంకి తన ఆసు యంత్రం ఏవిధంగా పూర్తి చేయాలో అర్ధం అయిపోయింది. అక్కడే ఆ యంత్రం భాగాన్ని తయారు చేయించుకొని తిరిగి ఇంటికి వచ్చేసి, తను తయారుచేసిన కర్ర యంత్రానికి దానిని బిగించి ట్రైయల్ వేశాడు. అది అద్భుతంగా పనిచేస్తుండటంతో మల్లేశం సంతోషానికి అవధులు లేవు. అతని తల్లి కూడా దానిపై చీర నేసి చూశారు. ఆమె కూడా దాని పనితనం చూసి మురిసిపోయారు. 

మరికొన్ని చిన్న చిన్న మార్పులతో ఇనుప ఫ్రేం, పరికరాలతో యంత్రాన్ని తయారుచేసి దానికి తన తల్లి పేరే పెట్టాడు. అదే..లక్ష్మి ఆసు యంత్రం. క్రమంగా దానికి కొన్ని ఎలక్ట్రికల్ మరియు ఎలక్ట్రానిక్ పార్టులు కూడా జోడించి ఇంకా ఆధునీకరించాడు. దానితో రోజుకి 6 చీరలు సులువుగానే నేయగలుగుతున్నారు. దాని పనితనం చూసి చాలామంది అటువంటిది తమకు కూడా చేసి ఇమ్మని అడుగుతుండటంతో మల్లేశం ఒకటి రెండూ కాదు.. ఇంతవరకు 40 యంత్రాలు తయారుచేసి ఇచ్చాడు. వాటిలో కొన్ని పొరుగునే ఉన్న ఓడిశా రాష్ట్రానికి కూడా వెళ్ళాయి. మన సిరిసిల్ల నేతన్నలకు కూడా ఈ యంత్రాలు అందించడం సాధ్యం అవుతుందేమో ప్రభుత్వం పరిశీలిస్తే బాగుంటుంది కదా! 


Related Post