మన రామయ్యకు పద్మశ్రీ

January 25, 2017


img

దరిపల్లి రామయ్య అంటే ఎవరికీ తెలియకపోవచ్చునేమో కానీ మొక్కల రామయ్య అంటే ‘ఓ..ఆయనా..’ అంటూ చాలా మందే గుర్తు పడతారు. ఖమ్మం జిల్లా రెడ్డిపల్లెకు చెందిన వనజీవి దరిపల్లి రామయ్య గురించి గతంలో చాలాసార్లు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో వార్తలు వచ్చాయి. ఆయన ఒక సామాన్య పేద కుటుంబీకుడు. అయితేనేమి..కోటీశ్వరులు, ప్రభుత్వాలు కూడా చేయలేని ఒక మహత్కార్యం చేశాడు. ఇంకా చేస్తూనే ఉన్నాడు. ఇక ముందు కూడా చేస్తూనే ఉంటాడు.

ఆయన గత మూడు దశాబ్దాలుగా జిల్లా అంతటా మొక్కలు నాటుతూనే ఉన్నాడు. ఆయన ఒక్కడే ఏకంగా కోటి మొక్కలు నాటాడు. మొక్కలు నాటి చేతులు దులుపుకోలేదు. కన్నబిడ్డల్లా వాటి సంరక్షణ కూడా చేశాడు. ఆయన చేసిన ఈ కృషి వలన ఖమ్మం జిల్లాలో చాలా ప్రాంతాలు పచ్చదనం సంతరించుకొన్నాయి. ఆయన వద్ద ఉన్నవి రెండే రెండు. ఒకటి పాత డొక్కు సైకిలు. రెండు మొక్కలు నాటి పచ్చదనం విస్తరింపజేయాలనే తపన. అంతే!

వాటి వలన ఆయనకు ఖర్చే తప్ప దమ్మిడీ ఆదాయం ఎరుగడు. ఏనాడూ ఎవరినీ సహాయం చేయమని వేడుకోలేదు. కనీసం ప్రభుత్వం సహాయం కూడా ఆశించలేదు. ఆయన చేస్తున్న మంచిపని చూసి ముచ్చటపడి ఎవరైనా డబ్బు ఇస్తే దానితో మొక్కలు కొనేసి ఎక్కడో అక్కడ పాతేస్తుంటాడు. పెళ్ళిళ్ళు, శుభకార్యాలకు పిలిస్తే వారికి మొక్కలనే బహుమతిగా ఇస్తుంటాడు. ఎవరైనా పచ్చటి మొక్కలు బహుమతిగా ఇస్తే చాలా సంతోషంగా అందుకొంటాడు. వాటిని మళ్ళీ ఎవరికో ఇస్తాడు లేదా ఏ రోడ్డు పక్కనో వేసి వెళ్తాడు. ఆయన సైకిలుకు ముందు చిన్న బోర్డు కనబడుతుంది. దానిపై వృక్షో రక్షతి రక్షితః అనే నినాదం ఉంటుంది. ఎక్కడికి వెళ్ళాలన్న ఆ డొక్కు సైకిలు మీదే ప్రయాణం. ఇదీ...మన మొక్కల రామయ్య పచ్చ పచ్చటి కధ క్లుప్తంగా.  

ఆ పర్యావరణ ప్రేమికుడి కష్టాన్ని, తపనని గుర్తించిన కేంద్రప్రభుత్వం ఈ ఏడాది ఆయనకు ప్రతిష్టాత్మకమైన పద్మశ్రీ అవార్డును ప్రకటించింది. ఈ విషయం తెలుసుకొని అయన చాలా సంతోషం వ్యక్తం చేశారు. ప్రజలందరూ కూడా ఈ మహాయజ్ఞంలో పాలుపంచుకొంటే రాష్ట్రం, దేశం అంతా పచ్చగా అవుతుందని, భావితరాలు చాలా మేలు చేసినవరం అవుతామని అన్నారు. ఆయన స్పూర్తితో ప్రతీ ఒక్కరు కనీసం ఒక్క మొక్కనైనా వేస్తే బాగుటుంది కదా. 


Related Post