ఆ మాటకు కట్టుబడే ఉన్నాను

January 25, 2017


img

తెలంగాణా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చే వరకు గెడ్డం తీయబోనని టి-పిసిసి అధ్యక్షుడు ఉత్తం కుమార్ రెడ్డి శపధం చేసిన సంగతి తెలిసిందే. వికారాబాద్ జిల్లాలో తాండూర్ లో నిన్న జరిగిన పార్టీ సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడుతూ తెరాస సర్కార్ కి కౌంట్ డౌన్ మొదలై చాలా రోజులే అయ్యిందని అన్నారు. వచ్చే ఎన్నికలలో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి తనే సారద్యం వహించి తన ప్రతిజ్ఞను నెరవేర్చుకొని తీరుతానని అంతవరకు గెడ్డం తీయననే తన మాటకు కట్టుబడి ఉంటానని ఉత్తం కుమార్ రెడ్డి అన్నారు. 

ఈసారి పార్టీ అభ్యర్ధుల పేర్లను ఏడాది ముందుగానే ప్రకటిస్తామని చెప్పారు. డిసిసి అధ్యక్షులుగా వ్యవహరిస్తున్నవారికి ఎమ్మెల్యే, ఎంపి టికెట్లు కేటాయించకూడదనుకొంటున్నట్లు చెప్పారు. కాంగ్రెస్ హయంలో ఇందిరమ్మ ఇళ్ళు పొందిన లబ్దిదారులు అందరికీ మళ్ళీ మరొక ఇల్లు కూడా ఇస్తామనే హామీని తమ పార్టీ మ్యానిఫెస్టోలో చేర్చుతామని చెప్పారు. తెలంగాణా ఏర్పడితే రాష్ట్రంలో రైతుల పరిస్థితి బాగుపడుతుందనుకొంటే ఇంకా దయనీయంగా మారిందని అన్నారు. ప్రాజెక్టుల రీడిజైనింగ్ పేరుతో తెరాస నేతలు జేబులు నింపుకొంటున్నారు తప్ప రైతులకు నీళ్ళు ఇవ్వడం లేదని ఉత్తం కుమార్ రెడ్డి అన్నారు. 

తెరాస సర్కార్ అధికారంలోకి వచ్చిన తరువాత నిజాం సాగర్ లో భాగంగా ఉన్న ఆలీసాగర్, అరుగుల రాజారం-గుప్త, జూరాల, కె. నారాయణ రెడ్డి ప్రాజెక్టు, రాజోలిబండ, శ్రీరాం సాగర్ మొదటి దశ నిర్మాణాలను పూర్తి చేసింది. ఇక మద్యతరహా ప్రాజెక్టులలో ఆసిఫ్ నగర్, బయ్యారం ట్యాంక్, బొగ్గులవాగు, చెలిమెలవాగు, గద్దెన-శుద్దవాగు, ఘన్ పూర్ ఆయకట్టు, గుండ్లవాగు, స్వర్ణ, శనిగరం, తలిపేరు, వట్టివాగు వైరా వంటి అనేక ప్రాజెక్టులను పూర్తి చేసింది. చిన్న, మద్య, భారీ ప్రాజెక్టులన్నీ కలిపి మరో రెండు మూడు డజన్ల వివిధ దశలలో ఉన్నాయి. ఇవన్నీ ఈ రెండున్నరేళ్ళలో చేసిన పనులే. ఇకముందు చేయబోయే పనులే. కనుక తెరాస సర్కార్ రైతుల పట్ల నిర్లక్ష్యం వహిస్తోందని చెప్పడానికి లేదు.

ఇక వచ్చే ఎన్నికలలో తానే కాంగ్రెస్ పార్టీకి సారధ్యం వహిస్తానని ఉత్తం కుమార్ రెడ్డి చెప్పుకొన్నప్పటికీ, ఆ పార్టీలో సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి వంటివారు “ఆయన ఒక అసమర్ధుడు, ఆయన కారణంగానే కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికలో ఓడిపోయిందని, కనుక ఆయన పార్టీని గెలిపించలేరని” బహిరంగంగానే విమర్శిస్తున్నారు. అయన నాయకత్వాన్ని తను ఆమోదించబోనని కూడా చెపుతున్నారు. 

పార్టీలో ఉన్న ఇటువంటి అంతర్గత సమస్యల వల్లనైతేనేమి లేదా తెరాస సర్కార్ కు నానాటికీ ప్రజాదారణ పెరుగుతున్నందున వల్లనైతేనేమి వచ్చే ఎన్నికలలో కూడా మళ్ళీ తెరాసయే గెలిస్తే ఇక ఉత్తం కుమార్ రెడ్డి ఎప్పటికీ గెడ్డం గీసుకోలేకపోవచ్చు. అయినా కాంగ్రెస్, తెరాస సర్కార్ పాలన తీరును రాష్ట్ర ప్రజలు చక్కగానే బేరీజు వేసుకొని చూస్తారు. కనుక కాంగ్రెస్ పార్టీకి వారు మళ్ళీ అవకాశం ఇస్తారో లేదో చెప్పడం కష్టమే. కనుక వాస్తవిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకొని కాంగ్రెస్ పార్టీ సిద్దం అయితే మంచిదేమో?


Related Post