రాష్ట్ర రాజకీయాలలో బొమ్మా బొరుసు

January 25, 2017


img

తెలంగాణా రాష్ట్రంలో ప్రస్తుతం చాలా విచిత్రమైన రాజకీయ వాతావరణం నెలకొని ఉంది. ఒకపక్క రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మిషన్ భగీరధ, మిషన్ కాకతీయ వంటి పధకాలను ప్రజలు చాలా మెచ్చుకొంటుంటే, అదే సమయంలో వివిధ ప్రాజెక్టుల కోసం అది చేపట్టిన భూసేకరణ కార్యక్రమాల వలన నష్టపోతున్న నిర్వాసితులు, ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం విద్యార్ధులు, తాత్కాలిక ఉద్యోగాలను రెగ్యులరైజేషన్ చేయమని కోరుతూ ఉద్యోగులు..వారందరికీ మద్దతు ప్రకటిస్తూ ప్రతిపక్షాలు, ప్రజాసంఘాలు, తెలంగాణా జెఎసి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ తదితరులు ప్రభుత్వ తీరు పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఆందోళనలు చేస్తున్నారు. 

తెలంగాణా ఏర్పడితే కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తామని,  మిషన్ భగీరధ, కాకతీయ పధకాలు చేపడతామని, సాగునీటి ప్రాజెక్టులు చేపడతామని, విద్యుత్ సంక్షోభం అరికడతామని తెరాస వాగ్దానాలు చేసింది. వాటిని అమలుచేసి ఫలితాలను కూడా కళ్ళకు కట్టినట్లు చూపిస్తోంది. ఇప్పటికే అనేక ఎత్తిపోతల పధకాలను తెరాస సర్కార్ యుద్ద ప్రాతిపదికన పూర్తి చేసి పోలాలకు నీళ్ళు అందిస్తోంది. రెండు రోజుల క్రితమే ఖమ్మం జిల్లాలో భక్తరామదాసు ఎత్తిపోతల నీటి పధకానికి విజయవంతంగా ట్రయల్ రన్ నిర్వహించారు. దీని ద్వారా జిల్లాలో తిరుమలాయపాలెం, కూసుమంచి, నేలకొండపల్లి తదితర గ్రామాలలో సుమారు 60,000 ఎకరాలకు పైగా నీళ్ళు అందుతుంది. ఆ ప్రాంతలలోని రైతులు ఈ ప్రాజెక్టు కోసం అనేక దశాబ్దాలుగా పాలకులను వేడుకొంటున్నారు కానీ ఏ ప్రభుత్వం వారి మోర ఆలకించలేదు. కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ ప్రాజెక్టుకి శంఖుస్థాపన చేసిన 10 నెలలలోపే దానిని పూర్తి చేయించి నీళ్ళు కూడా అందిస్తున్నారు. ఇంకా ఇటువంటి అనేక ప్రాజెక్టులన్నిటినీ తెరాస సర్కార్ యుద్దప్రాతిపదికన పూర్తి చేసి ఫలితాలను చూపిస్తోంది. 

ఇవన్నీ నాణేనికి ఒకవైపు బొమ్మ అనుకొంటే, రెండో వైపు ఇందుకు పూర్తి భిన్నంగా కనిపిస్తుంది. తెరాస సర్కార్ చేపడుతున్న పలు అభివృద్ధి పధకాలు, ప్రాజెక్టుల కోసం భూసేకరణ చేస్తోంది. దాని కోసం భూసేకరణ చట్టం-2013ను అమలుచేయకుండా రైతుల దగ్గర నుంచి బలవంతంగా భూములు గుంజుకొంటోందని ప్రొఫెసర్  కోదండరామ్ తో సహా ప్రతిపక్షాలు కూడా ఆరోపిస్తున్నాయి. అలాగే విద్యార్ధులకు సకాలంలో ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లించడం లేదని, హామీ ఇచ్చినట్లుగా ఉద్యోగాల భర్తీ చేయడం లేదని, రెగ్యులరైజేషన్ చేయడం లేదని విమర్శిస్తున్నారు. తెరాస అధికారంలో రావడం కోసమే పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు,  దళితులకు 3 ఎకరాల భూమి, రైతులకు పంట రుణాల మాఫీ వంటి హామీలను ఇచ్చి ఇప్పుడు మాట తప్పుతోందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. వాటికోసం అందరూ సభలు, సమావేశాలు, ఆందోళనా కార్యక్రమాలు పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు కూడా. 

అధికార, ప్రతిపక్ష పార్టీలు పూర్తి భిన్నమైన వాదన వినిపించడం, పరస్పరం విమర్శలు చేసుకోవడం సహజమే. కానీ రాజకీయాలకు అతీతంగా వ్యవహరిస్తున్న ప్రొఫెసర్  కోదండరామ్ వంటివారు కూడా తెరాస సర్కార్ తీరును తప్పు పడుతుండటం, ప్రభుత్వ నిర్ణయాలను వ్యతిరేకిస్తూ భాదిత ప్రజలతో కలిసి ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తుండటంతో, ప్రజలు ఎవరిని నమ్మాలనే అయోమయానికి గురవుతున్నారు. తెలంగాణా రాష్ట్రం ఏర్పడిన తరువాత ఇంత తక్కువ కాలంలోనే దేశంలో ఇతర రాష్ట్రాలలో కనబడే రాజకీయ వాతావరణమే తెలంగాణాలో కూడా కనబడటం చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది. తెలంగాణా రాష్ట్రాభివృద్ధికి ఇటువంటి వాతావరణం ఏమాత్రం మంచిది కాదని చెప్పవచ్చు. అయితే దీనికి పరిష్కారం ఏమిటంటే ఏకాభిప్రాయం సాధించడమే. కానీ అది సాధ్యమయ్యేలాగ కనిపించడం లేదు. 


Related Post