అవును..తెరాస సర్కార్ వెరీ బ్యాడ్!

January 24, 2017


img

“అవసరం ఉంటే అక్క సోపతి, తీరినంక కుక్క సోపతి” అన్నట్లుగా ఉంది రాష్ట్ర భాజపా వ్యవహార శైలి. నోట్ల రద్దు కారణంగా దేశంలో తీవ్ర ఆర్ధికసంక్షోభం ఏర్పడినప్పుడు, రాష్ట్ర భాజపా నేతలకంటే కూడా మోడీ నిర్ణయాన్ని గట్టిగా సమర్ధించినవారెవరంటే తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ అని చెప్పక తప్పదు. నోట్లరద్దు క్రెడిట్ కోసం ఆరాటపడిన ఏపి సిఎం చంద్రబాబు నాయుడు కూడా ఈవిషయంలో వెనకడుగు వేశారు కానీ కేసీఆర్ మాత్రం మోడీ నిర్ణయాన్ని గట్టిగా సమర్ధించారు. అందుకే ఆ సమస్యలపై చర్చించడానికి అయన బాబుని ఆహ్వానించలేదు..రాష్ట్ర భాజపా నేతలను సలహా అడుగలేదు. కేసీఆర్ నే డిల్లీకి ఆహ్వానించి మాట్లాడారు. 

ఆ తరువాత రాష్ట్రంలో నగదు రహిత లావాదేవీలను కూడా ప్రోత్సహించి, ఆవిషయంలో కూడా రాష్ట్రాన్ని దేశంలో నెంబర్: 1 స్థానంలో నిలబెట్టారు కేసీఆర్. తమ ప్రభుత్వం నిర్ణయాన్ని కేసీఆర్ అంతగా మద్దతు ఇచ్చి ప్రోత్సహించినందుకు రాష్ట్ర భాజపా నేతలు కూడా చాలా కుష్ అయ్యారు. కానీ ముస్లింలకు 12శాతం రిజర్వేషన్లు కల్పించడానికి బడ్జెట్ సమావేశాలలో బిల్లుని ప్రవేశపెడతానని కేసీఆర్ ప్రకటించగానే, తెరాస సర్కార్ పట్ల భాజపా నేతల వైఖరిలో ఒక్కసారిగా మార్పు వచ్చేసింది. 

“అవసరం ఉంటే అక్క సోపతి, తీరినంక కుక్క సోపతి” అన్నట్లుగా, నిన్న మొన్నటివరకు గొప్పగా కనిపించిన తెరాస సర్కార్ ఇప్పుడు వారికి కళ్ళకి చాలా అసమర్ధ, దుర్మార్గ, అవినీతి ప్రభుత్వంలాగ కనిపిస్తోంది.   

భద్రాద్రిలో జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశాలలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డా.కె.లక్ష్మణ్ మాట్లాడుతూ తమ పార్టీ మతపరమైన రిజర్వేషన్లు కల్పించడాన్ని గట్టిగా వ్యతిరేకిస్తుందని చెప్పారు. తెరాస సర్కార్ హామీల అమలులో ఘోరంగా విఫలం అయ్యిందన్నారు. ఆ హామీల అమలు చేయనందుకు నిరసనగా ఫిబ్రవరి 8,9 తేదీలలో జిల్లా స్థాయిలో సదస్సులు, ఫిబ్రవరి 15 నుంచి 20 వరకు మండల స్థాయిలో సదస్సులు, ర్యాలీలు, మార్చి నెలాఖరులో వేలాదిమంది ప్రజలతో కలిసి హైదరాబాద్ లో ర్యాలీ, శాసనసభ ముట్టడి కార్యక్రమాలు చేపట్టబోతున్నట్లు ప్రకటించారు. ప్రజలను మభ్యపెడుతూ, ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకొంటున్న తెరాసతో పొత్తులు పెట్టుకొనే ఆలోచన తమ పార్టీకి లేదని, ఇక నుంచి తెరాస సర్కార్ ను ఎండగడతామని డా.కె.లక్ష్మణ్ అన్నారు.

భాజపా రాష్ట్ర నేతలు చింతా సాంబమూర్తి, మనోహర్ రెడ్డి, ప్రేమేందర్‌రెడ్డి తదితరులు కూడా తెరాస సర్కార్ పట్ల అటువంటి అభిప్రాయాలే వ్యక్తం చేశారు. తెరాస సర్కార్ అంబేద్కర్ ఆశయాలకు విరుద్దంగా ఓటు బ్యాంక్ రాజకీయాలు చేస్తోందని దానిని గట్టిగా ఎదురిస్తామని అన్నారు. 

భాజపా ఇదే వైఖరికి గట్టిగా కట్టుబడి ఉన్నా ప్రజలు కూడా దానిని అర్ధం చేసుకొనే ప్రయత్నం చేస్తారు. అప్పుడు దానిని ఆదరించాలో వ్యతిరేకించాలా అనే విషయం వారే నిర్ణయించుకొంటారు కనుక అప్పుడు భాజపాకు మంచో చెడో ఫలితం స్పష్టంగా తప్పక కనబడుతుంది. కానీ ఒకసారి తెరాసకు దగ్గరవుతున్నట్లుగా మరొకసారి దానితో ఈవిధంగా యుద్ధం చేస్తున్నట్లు వ్యవహరిస్తుంటే చివరికి నష్టపోయేది భాజపాయే తప్ప తెరాస కాదని గ్రహించడం మంచిది. మరో విషయం ఏమిటంటే, వారు రాష్ట్రంలో తమ పార్టీని బలోపేతం చేసుకోకుండా మోడీ మంత్రం జపిస్తూ అధికారంలోకి వచ్చేయలనుకొంటే అది కల్ల అని గ్రహించడం కూడా అవసరమే. 


Related Post