తెలంగాణా పరిస్థితుల్లో మార్పులు భేష్!

January 24, 2017


img

 ‘త్రీ ఈడియట్స్’ హిందీ సినిమాలో అమీర్ ఖాన్ ఒక మాట చెపుతాడు. చంద్రమండలంలో భూమ్యాకర్షణ శక్తి ఉండదు కనుక అక్కడ మామూలు పెన్నులు ఏవీ వ్రాయలేవు. కనుక శాస్త్రజ్ఞలు అనేక పరిశోధనలు చేసి ఆ వాతావరణంలో కూడా చక్కగా వ్రాయగలిగే పెన్నును తయారుచేశారు. అది తన వద్ద ఉందని యూనివర్సిటీ డీన్ (వైరస్) చెప్పినప్పుడు, అమీర్ ఖాన్ ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ “అరే దాని కోసం అన్ని కోట్లు ఖర్చు చేయడం ఎందుకు? రెండు రూపాయిల పెన్సిల్ తో వ్రాసుకోవచ్చు కదా?” అని అడుగుతాడు.

అది విని అందరూ నవ్వుకొని...నిజమే కదా? అని అనుకోకుండా ఉండలేరు. అలాగే కొత్తగా ఏర్పడిన మన తెలంగాణా రాష్ట్రంలోను అనేకానేక తీవ్రమైన సమస్యలకు ముఖ్యమంత్రి కేసీఆర్ చాలా చిన్న చిన్న చిట్కాలతో పరిష్కారం చూపుతుండటం గమనార్హమైన విషయమే. 

ఉదాహరణకు మిషన్ కాకతీయ ద్వారా పునరుద్దరించబడిన వేలాది చెరువులలో చేపల పెంపకం గురించి చెప్పుకోవచ్చు. చెరువులలో నిండిన నీళ్ళు రైతులు పంటలకు ఉపయోగించుకొంటుంటే, వాటిలో వదిలిన చేపలు  మత్స్యకారులకు జీవనోపాధి చూపిస్తున్నాయి. అలాగే బలహీన వర్గాలకు గొర్రెలు, మేకలు, బర్రెలు, కోళ్ళు కొనుక్కోవడానికి రుణాలు ఇప్పించి ప్రోత్సహించారు. ఇటువంటివన్నీ పెద్ద సమస్యలకు అద్భుతమైన ఫలితాలు ఇస్తున్న చిన్న చిన్న పరిష్కారాలని అర్ధమవుతూనే ఉంది. బడుగుబలహీన వర్గాల ప్రజల జీవన ప్రమాణాలు పెంచడానికి చంద్రమండలంలో వ్రాయగలిగే పెన్ను వంటి పరిష్కారాలు అవసరంలేదు పెన్సిల్ వంటి చిన్న పరిష్కారాలు కూడా ఉన్నాయని కేసీఆర్ నిరూపించి చూపుతున్నారు. 

రాష్ట్రం ఏర్పడక ముందు తీవ్ర విద్యుత్ సంక్షోభం, నీటి కొరత, ఆ కారణంగా రైతుల  ఆత్మహత్యలు, రైతులు, రైతు కూలీలు, గ్రామీణ ప్రజలు పొట్ట చేత్తో పట్టుకొని ఇతర జిల్లాలు, రాష్ట్రాలకు వలసలు వెళ్ళిపోతుండటం వంటివన్నీ ప్రజలందరూ తమ కళ్ళారా చూశారు. అందుకు గత ప్రభుత్వాల అసమర్ధత, నిర్లక్ష్యమే కారణం అయినప్పటికీ అధికారంలోకి వచ్చిన తెరాసయే అందుకు నిందలు భరించవలసి వచ్చింది. 

జీవితంలో మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి పదవి చేపట్టిన కేసీఆర్ రాష్ట్రంలో నెలకొన్న ఈ తీవ్ర వ్యతిరేక పరిస్థితులను చూసి బెదిరిపోలేదు. ఆత్మస్థయిర్యం కోల్పోలేదు. ఎంతో అనుభవం ఉన్న ముఖ్యమంత్రిలాగ అనేక పధకాలను రూపొందించి వాటిని చకచకా అమలుచేయడం మొదలుపెట్టారు. వాటిలో మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ అత్యుత్తమ పధకాలుగా దేశవిదేశాలలో కూడా అందరి ప్రశంశలు అందుకొంటున్న సంగతి తెలిసిందే. 

వాటిలో మిషన్ కాకతీయ పేరిట రాష్ట్రంలో చెరువులు పునరుద్దరిస్తామని కేసీఆర్ చెప్పినప్పుడు చాలా మంది నవ్వారు. కానీ వాటి వలననే ఇప్పుడు రాష్ట్ర ముఖచిత్రం క్రమంగా మారుతోంది. ఒకప్పుడు నీళ్ళు లేక, బోర్లు ఉన్నా కరెంటు లేక పంటలు ఎండిపోతుంటే అవి చూసి తట్టుకోలేక రైతులు ఆత్మహత్యలు చేసుకొనేవారు. అంత ధైర్యం లేనివారు వలసలు వెళ్ళిపోయేవారు. కానీ ఇప్పుడు మిషన్ కాకతీయ పధకం వలన చెరువులు నిండి, ఆ కారణంగా పరిసర ప్రాంతాలలో గల భూగర్భజలాలు పెరిగాయి. నీళ్ళు సంవృద్దిగా లభిస్తుండటంతో మళ్ళీ పొలాలు కూడా పచ్చగా కళకళలాడుతున్నాయి. పొలాలతో బాటే రైతుల మొహాలు కూడా. గ్రామాలలో మళ్ళీ పొలం పనులు పెరగడంతో వలసలు వెళ్ళినవారు మళ్ళీ స్వగ్రామాలకు తిరిగిరావడం మొదలుపెట్టారు.

 నారాయణ్ ఖేడ్, ఆందోల్, నర్సాపూర్ తదితర ప్రాంతాలలో వలసలు వెళ్ళినవారు చాలా మంది తిరిగివచ్చినట్లు మంత్రి హరీష్ రావు చెప్పారు. అది తనకు చాలా సంతోషం కలిగిస్తోందని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పునరుద్దరించబడిన వేలాది చెరువులలో వదిలిన చేపపిల్లలు కూడా పెరగడంతో మత్స్యకారులకు కూడా ఉపాధి లభించిందని చెప్పారు. భూగర్భ జలాలు పెరిగాయి కనుక విచ్చలవిడిగా భూమినుంచి బోర్లతో నీళ్ళు తోడేయవద్దని, దాని వలన మళ్ళీ నీటి కొరత ఏర్పడుతుందని హరీష్ రావు రైతులకు విజ్ఞప్తి చేశారు. మిషన్ కాకతీయ మొదటి దశలోనే ఇంత మంచి ఫలితాలు కనబడుతుంటే దాని 2,3 దశలు కూడా పూర్తయినట్లయితే, రాష్ట్ర ముఖచిత్రం పూర్తిగా మారిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంత మంచి నిర్ణయం తీసుకొన్నందుకు దానిని అంతే పట్టుదలగా, చిత్తశుద్ధితో పూర్తి చేసి ఫలితాలను రాబడుతున్నందుకు తెరాస సర్కార్ ని అభినందించడం ధర్మం.


Related Post