ఆ స్ఫూర్తి చాలా వినాశకరం

January 23, 2017


img

ప్రజా సమస్యల పరిష్కారానికి రాజకీయ పార్టీలు , ప్రభుత్వం తప్పకుండా కృషి చేయవలసిందే. అవసరమైతే వాటికోసం ప్రజాస్వామ్యబద్దంగా, శాంతియుతంగా ఆందోళనలు చేయడం కూడా సమ్మతమే. కానీ స్వార్ధ రాజకీయాల కోసం ప్రజలను రెచ్చగొట్టి రోడ్ల మీదకు రప్పిస్తే దాని విపరీత పరిణామాలు ఏవిధంగా ఉంటాయో తెలుసుకోవాలంటే తమిళనాడులో జల్లికట్టు పేరుతో జరుగుతున్న విద్వంసం చూస్తే అర్ధం అవుతుంది.  

ప్రజల సెంటిమెంటును గౌరవిస్తూ కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు జల్లికట్టు క్రీడపై విధించిన నిషేధాన్ని ఎత్తివేసాయి. అయినా దానికి శాశ్విత ఆమోదం లభించే వరకు ఉద్యమం విరమించేది లేదంటూ ఉద్యమిస్తున్న  కొందరు ఆందోళనకారులు చెన్నైలోని మెరీనా బీచ్ సమీపంలో గల ఐస్ హౌస్ పోలీస్ స్టేషన్ పై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు పెట్రోల్ బాంబులు విసరడంతో, కొన్ని పోలీస్ వాహనాలు దగ్ధం అయ్యాయి.  ఆందోళనకారులలోకి సంఘవిద్రోహ శక్తులు జొరబడి ఉండవచ్చనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. 

జల్లికట్టును అనుమతిస్తున్నట్లు కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించినా ఇంకా ఆందోళనలు కొనసాగిస్తున్నారంటే తప్పకుండా వాటి వెనుక రాజకీయ హస్తం ఉందని అనుమానించక తప్పదు. ఈ ఉద్యమం ఇంకా కొనసాగితే దాని వలన ఎవరు లబ్ది పొందబోతున్నారనే దానిని బట్టి ఆవిషయం తెలుస్తుంది. 

ఈ ఆందోళనకి ఆ రాష్ట్రంలో సినీ, రాజకీయ ప్రముఖులు అందరూ మద్దతు పలకడం ఆశ్చర్యం కాదు కానీ ఇప్పుడు అది విద్వంసానికి దారి తీస్తున్నప్పుడు వారు మౌనం వహించడమే చాలా తప్పు. అందరూ అగ్నికి ఆజ్యం పోసేవారే కానీ ఇల్లు తగులబడుతుంటే ఆర్పేవారే కనబడటం లేదు. 

కాపులకు రిజర్వేషన్లు కావాలని ముద్రగడ పద్మనాభం తునిలో సభ నిర్వహిస్తే అది ఎంత విద్వంసానికి దారి తీసిందో అందరూ కళ్ళారా చూశారు. ఆందోళనకారులలోకి సంఘవిద్రోహ శక్తులు జొరబడటం వలననే అలాగ జరిగిందని చెప్పి అందరూ చేతులు దులుపుకొన్నారు తప్ప వాటికి భాద్యత వహించడానికి ఎవరూ ముందుకు రాలేదు. అప్పుడు తునిలోను, ఇప్పుడు చెన్నైలోని జరుగుతున్న పరిణామాలన్నీ ఇంచుమించు ఒకేలా ఉన్నాయి. అయినా నేతలు ప్రజలను రెచ్చగొట్టడం మానుకోవడం లేదు.  

తమిళనాడు ప్రజల పోరాటాలను స్పూర్తిగా తీసుకొని ఉద్యమించాలని ప్రజలను రెచ్చగొడుతున్న వారు ఒకవేళ ప్రత్యేక హోదా కోసం ఉద్యమాలు కూడా అదుపు తప్పి విద్వంసానికి దారితీస్తే వాటికి వారు బాధ్యత వహిస్తారా?అంటే కాదనే సమాధానం వస్తుంది.

కనుక ఆంధ్రాలో అయినా తమిళనాడులో అయినా మరెక్కడైనా ప్రజలే తమను రెచ్చగొడుతున్న వారి ఉద్దేశ్యాలు, ఉద్యమ పర్యవసానాలు మొదలైన వాటి గురించి లోతుగా ఆలోచించుకొని స్పందించడం మంచిది. లేకుంటే స్వార్ధ రాజకీయ నాయకులు ఆడుకొనే రాజకీయ చదరంగంలో పావులుగా మారిపోతారు. రాష్ట్రాభివృద్ధి నిలిచిపోతే చివరికి ఆ భారం కూడా మళ్ళీ తమ మీదే పడుతుందని గుర్తుంచుకోవాలి. 


Related Post