మొదటిరోజు నుంచే వ్యతిరేకతా?

January 23, 2017


img

డోనాల్డ్ ట్రంప్ ఎన్నికల ప్రచార సమయంలో వివిధ వర్గాల ప్రజలను, మీడియాను, ప్రపంచ దేశాలను ఉద్దేశ్యించి చేసిన అనుచిత వ్యాఖ్యల కారణంగా ఆ వర్గాలను శత్రువులుగా మార్చుకొన్న మాట వాస్తవమే. నేటికీ అయన అమెరికన్ మీడియా పట్ల దురుసుగా వ్యవహరిస్తుండటం ఆశ్చర్యం కలిగిస్తుంది. అదేవిధంగా అమెరికన్ ప్రజలతో సహా వివిధ దేశాలలో ప్రజలు, మీడియా కూడా డోనాల్డ్ ట్రంప్ పట్ల తీవ్ర వ్యతిరేకత ప్రదర్శించడం చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది. 

అమెరికా అధ్యక్షుడు అంటే అపరిమిత గౌరవాన్ని ప్రదర్శించే అమెరికన్ ప్రజలు డోనాల్డ్ ట్రంప్ ను వ్యతిరేకిస్తూ బోస్టన్, వాషింగ్టన్, షికాగో మొదలైన అనేక ప్రాంతాలలో రోడ్లమీదకు వచ్చి నిరసనలు తెలియజేస్తున్నారు. విశేషం ఏమిటంటే ఇటీవల జరిగిన ఎన్నికలలో అమెరికన్ కాంగ్రెస్ (పార్లమెంటు)కు ఎన్నికైన ఐదుగురు మహిళా ప్రతినిధులు కూడా వారితో గొంతు కలిపారు. 

కాలిఫోర్నియా నుంచి కాంగ్రెస్ కు ఎన్నికైన భారత సంతతికి చెందిన కమలాదేవి హారిస్ వాషింగ్టన్ లో నిరసన ప్రదర్శనలో పాల్గొన్న లక్షమందికి పైగా మహిళలను ఉద్దేశ్యించి మాట్లాడుతూ “మనం వైట్ హౌస్ లో కూర్చోలేకపోయినా, మనం పెద్దపెద్ద వ్యాపారాలు చేయలేకపోయినా మనం ఎంత శక్తిమంతులమో ఇక్కడ హాజరైనవారిని చూస్తే అర్ధం అవుతోంది. మన శక్తిని గుర్తించడానికి ఇష్టపడని కొందరు మనం మహిళలమనో లేదా ఏదో ఒక నియోజకవర్గం లేదా ఏదో ఒక పార్టీకి చెందినవారమనే ముద్రవేసి మనల్ని తక్కువగా చేసి చూపిస్తూ తప్పించుకొనే ప్రయత్నం చేస్తున్నారు. మనం మున్ముందు చాలా సవాళ్ళను ఎదుర్కోవలసి ఉంది కనుక మనమందరం కలిసికట్టుగా ఆ సవాళ్ళను ఎదుర్కోవడానికి సిద్దంగా ఉండాలి,” అని కమల హారిస్ అన్నారు.

దేశంలోని వివిద వర్గాలు, జాతుల ప్రజల పట్ల,  ప్రపంచ దేశాల పట్ల డోనాల్డ్ ట్రంప్ ప్రజామోదం లేని స్వంత అభిప్రాయలు కలిగి ఉన్నారన్నమాట వాస్తవం. వాటిని ఆయన ఆచరణలో పెట్టవచ్చని ఆయన వ్యతిరేకిస్తున్నవారు భావిస్తున్నట్లుంది. ఎన్నికల సమయంలో ప్రజలను ఆకట్టుకోవడానికి ఎన్నైనా చెప్పవచ్చు. కానీ ఆచరణలో అన్నీ సాధ్యం కావనే సంగతి అందరికీ తెలుసు. కనుక డోనాల్డ్ ట్రంప్ చెప్పినవన్నీ అమలుచేస్తారో లేదో వాటిని ఆయన అమలుచేయాలనుకొన్నప్పటికీ అవి సాధ్యమో కాదో ఇంకా తెలియవలసి ఉంది.

ఒకవేళ ట్రంప్ ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకొంటున్నట్లయితే అప్పుడు ప్రజలు రోడ్ల మీదకు వచ్చి ఆందోళన చేసినా అర్ధం ఉంటుంది. కానీ అంతవరకు కూడా ఓపిక పట్టలేనట్లుగా ప్రజలు రోడ్ల మీదకు వచ్చి తమ దేశాధ్యక్షుడికి వ్యతిరేకంగా పోరాటం చేయడం, వారితో ప్రతిపక్ష పార్టీ ఎంపిలు గొంతు కలపడం చాలా విస్మయం కలిగిస్తోంది. తద్వారా తమ దేశగౌరవానికి తామే భంగం కలిగించుకొంటున్నట్లు అవుతోందని గ్రహించడం లేదు.

డోనాల్డ్ ట్రంప్ ఏమీ దొడ్డిదారిన అమెరికా అధ్యక్షుడు అవలేదు. ఆయనను తామే ఎన్నుకోన్నామన్న సంగతి అమెరికన్ ప్రజలు గుర్తుంచుకోవడం కూడా అవసరమే. కనుక డోనాల్డ్ ట్రంప్ కి వారు కొంత సమయం ఇచ్చి చూస్తే బాగుంటుంది.


Related Post