కోదండరాముడికి మీడియాపై నమ్మకం పోయిందా?

January 23, 2017


img

తెలంగాణా జెఎసి ఆధ్వర్యంలో హైదరాబాద్ లో నిన్న జరిగిన ఒక సమావేశంలో ప్రొఫెసర్ కోదండరామ్ మీడియాపై చాలా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వార్తలను ఫిల్టర్ చేసి తన దృష్టి కోణంలో నుంచే ప్రజలకు చూపిస్తోందని అభిప్రాయపడ్డారు. మీడియా కొందరి చేతుల్లో చిక్కుకుపోవడం వలననే ప్రజలకు వార్తలు యధాతధంగా చేరడంలేదని అన్నారు. ఆ కారణంగానే టిజెఏసి కార్యక్రమాలు కూడా ప్రజలకు చేరడం లేదన్నారు. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకు సరైన ప్రత్యామ్నాయం సోషల్ మీడియాయే అని ప్రొఫెసర్  కోదండరామ్ అభిప్రాయపడ్డారు. కనుక ఇక నుంచి తాము కూడా సోషల్ మీడియా ద్వారానే ప్రజలకు చేరువయ్యేందుకు ప్రయత్నిస్తామని చెప్పారు. 

రాష్ట్రం ఏర్పడి మూడేళ్ళు కావస్తున్నా ఉద్యోగాల భర్తీ జరుగడం లేదని ఆ కారణంగా నిరుద్యోగ యువతలో అసంతృప్తి నెలకొని ఉందని అన్నారు. కనుక ఫిబ్రవరి 3వ వారంలో హైదరాబాద్ లో నిరుద్యోగులతో భారీ ర్యాలీ నిర్వహించబోతున్నట్లు చెప్పారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఉద్యోగాల భర్తీ ప్రక్రియ మొదలుపెట్టాలని ప్రొఫెసర్  కోదండరామ్ ప్రభుత్వాన్ని కోరారు.

ఒకప్పుడు దేశంలో అన్ని వ్యవస్థలు చాలా స్వేచ్చగా తమ కార్యకలాపాలు నిర్వహించుకొనేవి. కానీ గత రెండు మూడు దశాబ్దాలలో క్రమంగా అన్ని రంగాలలో గుత్తాధిపత్య ధోరణి మొదలయింది. విద్యా, వైద్య, మీడియా, రియల్ ఎస్టేట్, పారిశ్రామిక తదితర అన్ని రంగాలలో రాజకీయనాయకులు ప్రవేశిస్తున్నారు లేదా వాటిలో ఉన్నవారు రాజకీయాలలోకి ప్రవేశిస్తున్నారు. చివరికి సాధువులు, పీఠాధిపతులు కూడా రాజకీయ నాయకులతో రాసుకు పూసుకు తిరుగుతుండటం అందరం చూస్తూనే ఉన్నాము. కనుక ఈ రోజుల్లో రాజకీయ ప్రభావం పడని రంగం ఏదీ లేదనే చెప్పవచ్చు. 

ప్రజలకు, రాజకీయ పార్టీలు, ప్రభుత్వానికి మధ్య వారధిగా నిలిచే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాపై కూడా ఆ ప్రభావం ఇంకా ఎక్కువగా ఉంటుంది. చెరువులో మొసళ్ళతో కలిసి జీవించవలసి వచ్చినప్పుడు, వాటి బారిన పడకుండా ఒడుపుగా తప్పించుకొని తిరుగుతూ జీవనం సాగించాల్సి వచ్చినట్లే మీడియా కూడా వ్యవహరించవలసి వస్తోందని చెప్పవచ్చు. ప్రభుత్వాన్నే కాదు..ఏదైనా రాజకీయ పార్టీని లేదా ఒక ప్రముఖ సినీ హీరోని లేదా ఒక సంస్థని ఎవరూ వేలెత్తి చూపించ లేని పరిస్థితులు నెలకొని ఉన్నాయి. చూపితే ఏదో ఒక వర్గం నుంచి ఎదురుదాడి తప్పదు. 

ప్రొఫెసర్  కోదండరామ్ చెప్పినట్లు ప్రస్తుత పరిస్థితులలో సోషల్ మీడియా దానికి ఏకైక ప్రత్యామ్నాయంగా కనిపిస్తోంది. కానీ వాటినీ ప్రభుత్వం లేదా రాజకీయ పార్టీలు కొంతవరకు నియంత్రించ గలుగుతున్నాయని చెప్పక తప్పదు. సోషల్ మీడియాకు కూడా కూడా కుల, మత, రాజకీయ వైరస్ సోకి చాలా కాలమే అయ్యింది. కనుక అందులో కూడా ప్రస్తుతం చాలా అనారోగ్య వాతావరణం నెలకొనే ఉందని చెప్పక తప్పదు. ఏమైనప్పటికీ అక్కడ ఇంకా కొంత భావ స్వేచ్చకు అవకాశం ఉంది కనుక ప్రస్తుతానికి అదే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రత్యామ్నాయంగా కనిపిస్తోంది. కానీ ప్రజాస్వామ్యానికి నాలుగవ స్థంభం అని గొప్పగా చెప్పుకోబడుతున్న ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాపై ప్రొఫెసర్  కోదండరామ్ వంటి మేధావులు సైతం నమ్మకం కోల్పోతుండటం ఆలోచించవలసిన విషయమే.


Related Post