వాళ్ళ పొత్తులకి వృద్దనారి బలి

January 22, 2017


img

ఉత్తరప్రదేశ్ లో అధికార సమాజ్ వాదీ పార్టీ-కాంగ్రెస్ పార్టీ ఎన్నికల పొత్తులు ఆదివారం ఖరారు చేసుకొన్నాయి. మొత్తం 403 సీట్లలో సమాజ్ వాదీ 298 సీట్లు ఉంచుకొని, కాంగ్రెస్ పార్టీకి 105 సీట్లు కేటాయించింది. కాంగ్రెస్ పార్టీ ఆ రాష్ట్ర అధ్యక్షుడు రాజ్ బబ్బర్, సమాజ్ వాదీ రాష్ట్ర అధ్యక్షుడు నరేష్ ఉత్తం ఈ విషయం నేడు అధికారికంగా ప్రకటించారు. ఈ ఎన్నికలలో తాము గెలిస్తే మళ్ళీ అఖిలేష్ యాదవ్ ముఖ్యమంత్రి అవుతారని నరేష్ ఉత్తం ప్రకటించారు. సోనియా గాంధీ స్వయంగా జోక్యం చేసుకొన్న తరువాతనే రెండు పార్టీల మద్య పొత్తులు కుదిరాయని సమాచారం. 

ఆ రెండు పార్టీలు పొత్తులు కుదుర్చుకొని అఖిలేష్ యాదవ్ ని ముఖ్యమంత్రి అభ్యర్ధిగా అంగీకరించినందున, కాంగ్రెస్ పార్టీ తరపున ఇదివరకు ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ప్రకటించిన షీలా దీక్షిత్ ను పక్కనపెట్టినట్లయింది. ఈ ఎన్నికలలో పోటీ చేసి రాష్ట్రంలో మళ్ళీ అధికారంలోకి రావాలని కలలుగన్న కాంగ్రెస్ పార్టీ, ఎన్నికల వ్యూహ నిపుణుడు ప్రశాంత్ కిషోర్ సేవలను ఉపయోగించుకొంటోంది. ఆయన 2014 సార్వత్రిక ఎన్నికలలో భాజపాకి, 2015బిహార్ శాసనసభ ఎన్నికలలో నితీష్ కుమార్-లాలూ ప్రసాద్ కూటమికి ఘన విజయం సాధించిపెట్టారు. అది చూసి కాంగ్రెస్ పార్టీ అయన సేవలను ఉపయోగించుకొంటే అయన దానికి మొదటి నుంచే శల్యసారధ్యం చేయడం విశేషం. 

యూపిలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో తెలిసి కూడా ఆయన వృద్దురాలైన షీలా దీక్షిత్ ని ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ప్రకటింపజేశారు. ఆ తరువాత ఆయనే స్వయంగా సమాజ్ వాదీ పార్టీ వద్దకు కాంగ్రెస్ దూతగా వెళ్ళి పొత్తుల గురించి చర్చించారు. ఆ పార్టీతో పొత్తులు పెట్టుకోవాలనే ఉద్దేశ్యం ఉన్నప్పుడు షీలా దీక్షిత్ ను ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ప్రకటింపజేయడం తప్పు. పైగా కాంగ్రెస్ పార్టీని ఆ రాష్ట్రంలో అధికారం దక్కిస్తారనే ఉద్దేశ్యంతోనే ఆయన సేవలను కోరింది. కానీ సమాజ్ వాదీతో కాంగ్రెస్ పార్టీ పొత్తులు పెట్టుకొని కేవలం 105 సీట్లతో సరిపెట్టుకోవలసి వస్తోంది. ఈసారి ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ 10-15 సీట్లు కంటే ఎక్కువ గెలుచుకోలేదని సర్వేలు ఘోషిస్తున్నాయి. ఒకవేళ వాటి జోస్యమే నిజమైతే ప్రశాంత్ కిషోర్ అన్ని విధాలుగా వైఫల్యం చెందినట్లే చెప్పవచ్చు. ఈ పొత్తుల కారణంగా కాంగ్రెస్ పార్టీలో చాలా సీనియర్ నేత అయిన షీలా దీక్షిత్ చాలా అవమానకరమైన పరిస్థితులలో పక్కకు తప్పుకోవలసివచ్చింది.అందుకు కూడా ఆయననే నిందించక తప్పదు. ఒకప్పుడు ఆమెను చూసి అసూయపడిన కాంగ్రెస్ నేతలు అందరూ ఇప్పుడు పాపం షీలా దీక్షిత్ అని జాలి పడుతున్నారు. 


Related Post