తెరాస సర్కార్ మరో మంచి ఆలోచన

January 20, 2017


img

ముఖ్యమంత్రి కేసీఆర్ గురించి చాలామందికి భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ ఒక్క విషయంలో మాత్రం అందరూ ఏకీభవిస్తారు. ఆయన తీయటి మాటలు, చూపిస్తున్న బంగారి తెలంగాణా స్వప్నం, దాని కోసం ఆయన ప్రకటిస్తున్న పధకాల గురించి వింటుంటే ఎవరికైనా కడుపు నిండిపోతుందంటే అతిశయోక్తి కాదు. ఆయన మాటలలో నిజాయితీ కూడా తొణికిసలాడుతుంటుంది కనుక ఆయన చెపుతున్న మాటలకు విశ్వసనీయత కూడా ఏర్పడుతుంటుంది. గత ఏడు దశాబ్దాలలో ప్రజలు చూసిన పాలన వేరు ఇప్పుడు చూస్తున్న పాలన వేరు.  రెంటిలో తేడా కళ్ళకు స్పష్టంగా కనబడుతుంటుంది. పాలన అంటే ఏవిధంగా ఉండాలో కేసిఆర్ ప్రజలకు, ప్రతిపక్ష పార్టీలకు కూడా కళ్ళకు కనబడేలా చూపిస్తున్నారు. అందుకు ఆయనను అభినందించక తప్పదు.

కొత్తగా ఏర్పాటు చేసిన జిల్లాలలో సంగారెడ్డి, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాలకు తప్ప మిగిలిన వాటికి ఇంతవరకు ప్రభుత్వ కార్యాలయాలు లేనందున, జిల్లా కేంద్రాలలో ఆయా జిల్లాలకు సంబంధించిన అన్ని ప్రభుత్వ కార్యాలయాలను కలిపి ఒకేచోట ఏర్పాటు చేస్తూ భవనాలను నిర్మించాలని కేసీఆర్ నిశ్చయించారు. పోలీస్ మరియు అగ్నిమాపక శాఖల కార్యాలయాలు మాత్రమే వేరే చోట ఏర్పాటు చేయబడతాయి. 

ఈ సెంట్రల్ ప్రభుత్వ కార్యాలయాలన్నీ అత్యాధునిక సౌకర్యాలతో, సువిశాలంగా అందరికీ సౌకర్యవంతంగా ఉండేవిధంగా నిర్మించాలని నిర్ణయించారు. వాటికి త్వరలోనే డిజైన్లు ఖరారు చేసి, ఫిబ్రవరిలో ప్రవేశపెట్టబోయే 2017-18 సం.ల బడ్జెట్ లో నిధులు కేటాయిస్తామని తెలిపారు. ఒక్కో కార్యాలయం కనీసం 20-25 ఎకరాల విస్తీర్ణంలో నిర్మిస్తామని తెలిపారు. ప్రజా ప్రతినిధులు, మంత్రులు, ముఖ్యమంత్రి ఎవరు వచ్చినా వెయ్యి మందితో సమావేశం నిర్వహించుకోగలిగినంత విశాలమైన కాన్ఫరెన్స్ హాల్స్ కూడా వాటిలో ఏర్పాటు చేస్తామని చెప్పారు. విశాలమైన పార్కింగ్ ఏరియా, మంచి ల్యాండ్ స్కేపింగ్, బ్యాంకు, ఎటిఎంలు, మీ సేవా కేంద్రం, ప్రత్యేకంగా విద్యుత్ సబ్ స్టేషన్, జనరేటర్స్ వగైరా అన్నీ తప్పనిసరిగా ఆ భవనంలో ఉండాలని నిర్ణయించారు.

ప్రభుత్వ కార్యాలయాలు అన్నీ ఒకే చోట ఏర్పాటు చేయడం వలన ప్రజలకు, ఉద్యోగులకు అందరికీ చాలా సౌకర్యంగా ఉంటుంది. నిర్వహణ వ్యయం కూడా గణనీయంగా తగ్గుతుంది. బడ్జెట్ ప్రవేశపెట్టేలోగానే స్థలాలను గుర్తించి భవన నిర్మాణానికి డిజైన్లు, అంచనాలను అన్నీ సిద్దం చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ఇప్పటికే రోడ్లు భవనాల శాఖ కొన్ని డిజైన్లు సిద్దం చేసి ముఖ్యమంత్రికి సమర్పించింది కూడా. కనుక మరో మూడు నాలుగు నెలలలోనే ఈ భవనాల నిర్మాణ పనులు కూడా మొదలవవచ్చు.  


Related Post