జల్లికట్టుకు సై!

January 20, 2017


img

తమిళనాడు ప్రజల ఒత్తిడికి కేంద్రం తల ఒంచక తప్పలేదు. జల్లికట్టు క్రీడ జరుపుకోవడానికి అనుమతిస్తూ శుక్రవారం సాయంత్రం ఆర్డినెన్స్ జారీ చేసింది. దానికి రాష్ట్రపతి ఆమోదముద్ర పడటం లాంచనప్రాయమే. కేంద్రం నిర్ణయంతో తమిళనాడులో దానికోసం ఆందోళన చేస్తున్న ప్రజలు సంబరాలు జరుపుకొన్నారు. ఇంతవరకు రాష్ట్రంలో నెలకొన్న ఉద్రిక్త వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. కేంద్రప్రభుత్వం ఇంత తేలికగా వేగంగా అంగీకరించి ఆమోదించడం ద్వారా బంతిని మళ్ళీ తమిళనాట రాజకీయ పార్టీల కోర్టులో పడేసినట్లయింది. ఇప్పుడు భాజపాను వేలెత్తి చూపేందుకు లేదు. పైగా తమిళ ప్రజల మనోభావాలను గౌరవించమని భాజపా గొప్పగా చెప్పుకొనే అవకాశం కల్పించినట్లయింది. ఈ ఉద్యమం ఇంత త్వరగా ముగిసిపోవడంతో మళ్ళీ ప్రజల దృష్టి అంతా అధికార అన్నాడిఎంకె పార్టీలో జరుగుతున్న ఆధిపత్యపోరుపైకే మళ్ళుతుంది. అలాగే జయలలిత మేనకోడలు దీప రాజకీయ ప్రవేశం గురించి కూడా మళ్ళీ చర్చ మొదలవుతుంది. అన్నాడిఎంకె పార్టీ ఏది వద్దని కోరుకొందో మళ్ళీ అదే జరుగబోతోంది. కనుక తమిళనాట రాజకీయాలు ఇప్పుడు మళ్ళీ ఏ కొత్త మలుపు తిరుగుతాయో చూడాల్సిందే. 


Related Post