దొంగలు పడ్డ ఆరు నెలలకు...

January 20, 2017


img

వరంగల్ ఇస్లామియా మైదానంలో గురువారం కాంగ్రెస్ మహిళానేతలు బహిరంగ సభ నిర్వహించారు. దానిలో మాట్లాడిన కాంగ్రెస్ నేతలు అందరూ మోడీ, కేసీఆర్ లక్ష్యంగా చేసుకొని విమర్శలు గుప్పించారు.

కేంద్రంలో మోడీ, రాష్ట్రంలో కేసీఆర్ ఇద్దరూ దేశం, రాష్ట్రం అభివృద్ధికి విఘాతం కలిగించే విధంగా పాలన సాగిస్తున్నారని ఉత్తం కుమార్ రెడ్డి విమర్శించారు. వారిరువురూ సామాన్య ప్రజలను పట్టించుకోకుండా కార్పోరేట్ సంస్థలకు, కాంట్రాక్టర్లకు కొమ్ము కాస్తున్నారని, నోట్ల రద్దు వలన దేశంలో అనేక వ్యవస్థలు చితికిపోయాయని, కోట్లాదిమంది ప్రజలు నానా కష్టాలు పడుతున్నారని అన్నారు. తెరాస సర్కార్ కౌంట్ డౌన్ మొదలైందని, వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తప్పకుండా అధికారంలోకి వస్తుందని ఉత్తం కుమార్ రెడ్డి జోస్యం చెప్పారు. నగదు విత్-డ్రాలపై విదించిన పరిమితులు తక్షణమే తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ నిర్ణయం వలన దేశంలో అనేకమంది యువత ఉద్యోగాలు, ఉపాధి కోల్పోయారని పొన్నాల లక్ష్మయ్య ఆరోపించారు. 

విద్యార్ధులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ విషయంలో తెరాస సర్కార్ ప్రతిపక్షాలను, విద్యార్ధులను కూడా మభ్యపెట్టే ప్రయత్నాలు చేస్తోందని, తక్షణమే  బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సింగరేణి వారసత్వ ఉద్యోగాల విషయంలో కూడా కేసీఆర్ మోసం చేశారని జీవన్ రెడ్డి ఆరోపించారు. ముస్లింల రిజర్వేషన్ల విషయంలోను కేసీఆర్ కు చిత్తశుద్ధి లేదని స్పష్టం అయ్యిందని అన్నారు. శాసనసభ శీతాకాల సమావేశాలలో ప్రతిపక్షాల గొంతు నొక్కేసి వాటిని తెరాస సర్కార్ తన స్వంత ప్రచారానికి వాడుకొందని డికె అరుణ విమర్శించారు. హైదరాబాద్ జంట నగరాలకు గోదావరి నీటి తరలింపు పధకంలో ప్యాకేజి-3లో సుమారు రూ.25 కోట్లు అవినీతి జరిగినట్లు తమ వద్ద స్పష్టమైన ఆధారాలు ఉన్నాయని పొంగులేటి సుధాకర్ రెడ్డి ఆరోపించారు. 

కొమ్ములు తిరిగిన టీ-కాంగ్రెస్ నేతలు చేస్తున్న ఈ ఆరోపణలను వింటుంటే నవ్వు రాకమానదు. నోట్ల రద్దు తదనంతర కష్టాల నుంచి దేశం క్రమంగా కోలుకొని మళ్ళీ సాధారణ స్థితికి చేరుకొంటున్న ఈ సమయంలో కాంగ్రెస్ అధిష్టానం పిలుపు మేరకు తెలంగాణా కాంగ్రెస్ నేతలు ఇప్పుడు హడావుడి చేయడం చాలా అసందర్భంగా ఉంది. ఇదే పని రెండు నెలల క్రితమే చేసి ఉండి ఉంటే చాలా సమయోచితంగా ఉండేవి. ప్రజల సమస్యలకు అద్దం పట్టినట్లుండేవి. ప్రజలు కూడా హర్షించేవారు. అప్పుడు చేతులు ముడుచుకొని కూర్చొని అంతా సద్దుమణిగాక ఇప్పుడు హడావుడి చేయడం వలన ఏమి ప్రయోజనం? 

నోట్ల రద్దు సంబంధిత వార్తలు ఇప్పుడు మీడియాలో కూడా రావడం లేదు. ఎటిఎంల నుంచి విత్-డ్రా పరిమితిని రూ.10,000కి పెంచడంతో బ్యాంకులు, ఎటిఎంల దగ్గర క్యూ లైన్లు కనబడటం లేదిప్పుడు. ప్రజలకు కావలసినంత నగదు సులువుగా లభిస్తుండటంతో దేశంలో పరిస్థితులు మళ్ళీ సాధారణ స్థితికి చేరుకొంటున్నాయి. టీ-కాంగ్రెస్ నేతలు ఇవేమీ గమనించకుండా గుడ్డెద్దు చేలో పడి మేసినట్లు నోట్ల రద్దు గురించి ఇప్పుడు తమ వాదనలు వినిపిస్తుండటం చాలా హాస్యాస్పదంగా ఉంది. 

అలాగే ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల విడుదలలో జరుగుతున్న ఆలశ్యానికి కారణాలను ముఖ్యమంత్రి కేసీఆర్ శాసనసభలో విడమరిచి వివరించారు. ముస్లింల రిజర్వేషన్ల బిల్లును వచ్చే నెల నుంచి మొదలయ్యే బడ్జెట్ సమావేశాలలో ప్రవేశపెట్టబోతున్నట్లు చెప్పారు. పదేళ్ళ పాటు సమైక్య రాష్టాన్ని పాలించిన కాంగ్రెస్ రెండు దశాబ్దాలుగా ఉన్న సింగరేణి వారసత్వ ఉద్యోగాల డిమాండును ఏనాడూ పట్టించుకోలేదు. కానీ దానిని అమలుచేసి చూపిన కేసీఆర్ పై విమర్శలు గుప్పించడం సిగ్గు చేటు. 

కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో మళ్ళీ అధికారంలోకి రావాలనే ఉద్దేశ్యమే ఉన్నట్లయితే, అది ముందుగా బూజు పట్టిన తన ఆలోచనా వైఖరిని సమూలంగా మార్చుకోవడం చాలా అవసరం. శాసనసభలో తెరాస సర్కార్ కు వంతపాడి బయట వేదికలెక్కి విమర్శలు చేయడం వలన అదే నవ్వులపాలవుతుందని గుర్తుంచుకోవడం మంచిది.  


Related Post