జల్లికట్టు భాజపా పనిపట్టు

January 19, 2017


img

జయలలిత ఆకస్మిక మరణం తరువాత తమిళనాడులో హటాత్తుగా రాజకీయ శూన్యత ఏర్పడటంతో, ఎన్నాళ్ళగానో అటువంటి అవకాశం కోసం ఎదురుచూస్తున్న భాజపా వేగంగా పావులు కదిపి ఆ రాష్ట్ర రాజకీయాలను తన అదుపులోకి తెచ్చుకొనేందుకు ప్రయత్నించింది. ఈ ఆరోపణను భాజపా కొట్టిపారేసినా అధికార అన్నాడిఎంకె పార్టీ నేతల నోట పదేపదే అదే ఆరోపణ వినిపిస్తుండటం ఆ అనుమానానికి బలం చేకూర్చేదిగా ఉంది. తమిళనాడులో ఎంట్రీ ఇచ్చేందుకు అంతా అనుకూలంగా ఉందని భాజపా లోలోన సంబర పడుతుంటే “ఏతుల ఎంకి ఇల్లలుకుతే, కోడిపిల్లలు అచ్చి తవ్వి పొయీనయ్యన్నట్లు” తమిళనాడులో రాజకీయ పార్టీలు భాజపా మెడకి జల్లికట్టు అనే గుదిబండను తగిలించేశాయి. 

ఆ రాష్ట్రంలో ఊహించని విధంగా అకస్మాత్తుగా జల్లికట్టు కోసం మొదలైన ఉద్యమం నిజంగానే ఆ క్రీడపై అభిమానంతోనే మొదలైందా లేక దీని వెనుక రాజకీయ కోణం ఏమైనా ఉందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఎందుకంటే, జల్లికట్టు ఉద్యమకారులు కొందరు ప్రధాని నరేంద్ర మోడీని వ్యతిరేకిస్తూ చిత్రపటాలను ప్రదర్శిస్తున్నారు. నిజానికి ఆయనకు దీనితో సంబంధమే లేదని అందరికీ తెలుసు. సుప్రీంకోర్టు నిషేదించిన ఆ క్రీడను ప్రధాన మంత్రి హోదాలో ఉన్న ఆయన అనుమతించలేరని కూడా అందరికీ తెలుసు. కానీ ఈ విషయంలో ఆయనను దోషిగా చూపే ప్రయత్నం జరుగుతున్నందునే ఈ ఉద్యమం వెనుక రాజకీయ కోణం ఏమైనా ఉందా అనే అనుమానం కలుగుతోంది. 

ఒకవేళ కేంద్రం జల్లికట్టును అనుమతించినా దాని క్రెడిట్ భాజపాకు దక్కదు. దానిని అక్కడి రాజకీయ పార్టీలన్నీ తమ ఖాతాలో వేసుకోవడం ఖాయం. అలాగని దానిపై నిషేధం ఎత్తివేయడానికి నిరాకరించినా భాజపాయే శిక్షించబడుతుందని వేరే చెప్పనవసరం లేదు. కనుక ఈ ఉద్యమం తిరిగి తిరిగి భాజపా మెడకు చుట్టుకొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. కనుక ఈ సమస్య నుంచి కేంద్రం, భాజపా ఏవిధంగా బయటపడుతాయో చూడాలి.


Related Post