అవేమి రాజకీయాలో?

January 19, 2017


img

జయలలిత ఆకస్మిక మరణం తరువాత తమిళనాడు అధికార అన్నాడిఎంకె పార్టీలో మొదలైన ఆధిపత్యపోరులో శశికళ నటరాజన్ తన ప్రత్యర్ధులపై పైచెయ్యి సాధించి పార్టీ పగ్గాలు చేపట్టగలిగారు. త్వరలోనే ఆమె ముఖ్యమంత్రి పదవి చేపట్టబోతున్నారని ప్రచారం జరిగింది. కానీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం నుంచి ఎటువంటి ప్రతిఘటన రాకపోవడం చాలా ఆశ్చర్యకరమైన విషయమే. వారి మద్యలో జయలలిత మేనకోడలు దీప జయకుమార్ ఎంట్రీ ఇవ్వాలనుకోవడంతో శశికళ వర్గం అప్రమత్తం అయ్యి వెంటనే పావులు కదుపుతున్నట్లు కనిపిస్తోంది. 

శశికళ భర్త, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి అయిన నటరాజన్ మీడియాతో మాట్లాడుతూ “పన్నీర్ సెల్వం పనితీరు బాగానే ఉంది. ప్రస్తుతం ఆయనను మార్చే అవసరం ఏమీ కనబడటం లేదు. నా భార్య శశికళ ముఖ్యమంత్రి పదవి చేపట్టాలా వద్దా అనే విషయం పార్టీ నిర్ణయిస్తుంది,” అని అన్నారు. 

తద్వారా ముఖ్యమంత్రితో రాజీ ప్రయత్నం చేసుకొని ఆయన వర్గాన్ని తమవైపు తిప్పుకోవాలని ప్రయత్నిస్తున్నట్లు అర్ధం అవుతోంది. అది దీపను చూసి భయపడేనని వేరే చెప్పనవసరం లేదు. కానీ దీప వంటివారు ఎంతమంది వచ్చినా అన్నాడిఎంకె పార్టీ చెక్కు చెదరదని అన్నారు. తమ పార్టీని చీల్చి ప్రభుత్వాన్ని కూల్చేందుకు భాజపా కుట్రలు పన్నుతోందని నటరాజన్ ఆరోపించారు. అంతటితో ఆగి ఉండి ఉంటే చెప్పుకోవడానికి ఏమీ ఉండేది కాదు.  

దీప రాజకీయ ఎంట్రీ ఇవ్వబోతున్నందున, ప్రజల దృష్టిని ఆమె వైపు మళ్ళకుండా తమ వైపు తిప్పుకోనేందుకే అన్నాడిఎంకె పార్టీ జల్లికట్టు పేరుతో కొత్తగా హడావుడి మొదలుపెట్టినట్లు అనుమానం కలుగుతోంది. పనిలోపనిగా జల్లికట్టు సాంప్రదాయ క్రీడను అనుమతించమని కేంద్రప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి తేవడం ద్వారా భాజపాను తమ పార్టీకి, ప్రభుత్వానికి, రాష్ట్రానికి దూరంగా ఉంచే ప్రయత్నం చేస్తున్నట్లు కనిపిస్తోంది. 

సుప్రీంకోర్టు నిషేదించిన జల్లికట్టు క్రీడను కేంద్రప్రభుత్వం ఆమోదించలేదు. కనుక జల్లికట్టును అనుమతిస్తూ ఆర్డినెన్స్ జారీ చేయాలని కేంద్రంపై ఒత్తిడి తెచ్చి, దాని నోటితోనే అది సాధ్యం కాదని చెప్పించగలిగినట్లయితే రాష్ట్ర ప్రజలలో భాజపా పట్ల వ్యతిరేకత కలుగుతుంది. ఆ కారణంగా భాజపా రాష్ట్రానికి, తమ ప్రభుత్వానికి దూరంగా ఉండక తప్పదు. సమయం కాని సమయంలో జల్లికట్టు గురించి ప్రజలలో సెంటిమెంటు రెచ్చగొట్టి వారిని రోడ్లపైకి రప్పించడం వెనుక ఉద్దేశ్యం ఇదే కావచ్చు. దానిని వ్యతిరేకించలేని ప్రతిపక్షాలు కూడా తప్పసరిగా అన్నాడిఎంకె పార్టీతో గొంతు కలుపవలసి వస్తోంది. తద్వారా శశికళ రాష్ట్ర రాజకీయాలపై పట్టు సాధించడానికి ప్రయత్నిస్తున్నట్లున్నారు. ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం దీని కోసమే ఈరోజు డిల్లీ వెళ్ళి ప్రధాని నరేంద్ర మోడీ కలిసి వినతి పత్రం ఈయబోతున్నారు. 

రాష్ట్రంలో శాంతిభద్రతలు నెలకొల్పి, రాష్ట్రాన్ని అభివృద్ధిపధంలో నడిపించవలసిన ప్రభుత్వమే ఈవిధంగా స్వార్ధ రాజకీయాల కోసం ప్రజలను రోడ్లపైకి రప్పించి సమస్యలు సృష్టించుకోవడం చాలా శోచనీయం. రాష్ట్రానికి ఏదైనా గొప్ప మేలు కలిగే పని కోసం ఇటువంటి సంఘటిత శక్తిని ప్రదర్శించినా అందరూ హర్షించి ఉండేవారు. కానీ అధికార పార్టీలో అంతర్గత కుమ్ములాటలు, ఆధిపత్యపోరు కోసం ప్రజలను రెచ్చగొట్టడం చాలా శోచనీయం. 


Related Post