తెరాస సర్కార్ జవాబు ఏమిటో?

January 19, 2017


img

తెరాస సర్కార్ రాష్ట్రంలో వివిధ వర్గాల ప్రజల కోసం అనేక సంక్షేమ పధకాలు ప్రవేశపెడుతోంది. దానికి ఏటా బడ్జెట్ లో బారీగా నిధులు కూడా కేటాయిస్తోంది. బడుగు, బలహీన, మైనార్టీల సంక్షేమానికి తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని అందుకే ఇన్ని పధకాలు, వాటి అమలుకు బారీగా నిధులు మంజూరు చేస్తోందని ముఖ్యమంత్రి కేసీఆర్ తో సహా సంబంధిత శాఖల మంత్రులు చెప్పుకొంటున్నారు. అయితే వాళ్ళు చెపుతున్నవన్నీ మాటలకే పరిమితం అవుతున్నాయి తప్ప ఆచరణలో ఎక్కడా అవి కనబడటం లేదని కాంగ్రెస్ శాసనసభ సభ్యుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ గట్టిగా వాదించారు. 

ఎస్సీ, ఎస్టీ, బీసి, మైనార్టీ వర్గాలలో యువతకు స్వయం ఉపాధి కోసం ఈ రెండున్నరేళ్ళలో ప్రభుత్వం రూ. 2,900 కోట్లు కేటాయించినట్లు చెప్పుకొని కేవలం రూ.700 కోట్లు మాత్రమే ఎందుకు ఖర్చు చేసిందని కోమటిరెడ్డి ప్రభుత్వాన్ని శాసనసభలో నిలదీశారు. తెరాస సర్కార్ మళ్ళీ బడ్జెట్ ప్రవేశ పెట్టేందుకు సిద్దం అవుతునప్పటికీ, ఇంతవరకు ప్రస్తుత  ఆర్ధిక సంవత్సరంలోని సబ్సీడీ రుణాల ప్రక్రియను ఎందుకు మొదలుపెట్టలేదని ప్రశ్నించారు. మంత్రులు, ముఖ్యమంత్రి కల్లబొల్లి కబుర్లతో ప్రజలను మభ్యపెడుతూ కాలక్షేపం చేసేస్తున్నారే తప్ప ప్రజలకు చేసిందేమీ లేదని కోమటిరెడ్డి వెంకటరెడ్డి విమర్శించారు. తెరాస సర్కార్ ఇదేవిధంగా వ్యవహరిస్తుంటే ప్రజలే దానికి గట్టిగా బుద్ధి చెపుతారని హెచ్చరించారు. 

మైనార్టీ సంక్షేమం గురించి మండలిలో మాట్లాడిన కాంగ్రెస్ ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ కూడా తెరాస సర్కార్ ను గట్టిగా నిలదీశారు. ముస్లింల సంక్షేమం కోసం తెరాస సర్కార్ ఈ ఆర్ధిక సంవత్సరంలో రూ. 1,204 కోట్లు కేటాయించిందని ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ గొప్పగా చెప్పుకొన్నప్పుడు, షబ్బీర్ అలీ స్పందిస్తూ దానిలో ఇంతవరకు కేవలం 25శాతం మాత్రమే ఖర్చు చేసిన సంగతిని గుర్తు చేశారు. ప్రభుత్వం బడ్జెట్ లో కేటాయిస్తున్నట్లు చూపిస్తుందని, కానీ వాస్తవానికి దానిలో పావు వంతు కూడా ఖర్చు చేయదని, అది ప్రజలను మోసం చేయడం కాదా? అని ప్రశ్నించారు. ముస్లింల సంక్షేమం పట్ల ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉన్నట్లయితే, 1.60 లక్షల మంది స్వయం ఉపాధి రుణాల కోసం దరఖాస్తులు చేసుకొంటే వారిలో ఒక్కరికి కూడా ఎందుకు రుణం మంజూరు చేయలేదని ప్రశ్నించారు. ముస్లింల కోసం నిధులు కేటాయించామని, వారి సంక్షేమం కోసం చాలా తపిస్తున్నామని ప్రభుత్వం చెపుతుంది కానీ ఆచరణలో మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తుంటుంది,” అని షబ్బీర్ అలీ తీవ్ర విమర్శలు చేశారు. 

ముఖ్యమంత్రి సమాధానం: కోమటిరెడ్డి వెంకటరెడ్డి అడిగిన ప్రశ్నకు ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పిన సమాధానం విన్నట్లయితే ఆయన చేసిన ఆరోపణలు నిజమని స్పష్టం అవుతోంది. ఎస్సీ, ఎస్టీ, బీసి, మైనార్టీలకు గత రెండేళ్ళకు కలిపి రూ.550 కోట్లు విడుదల చేయవలసి ఉందని, దానిని మార్చి 31వ తేదీలోగా విడుదల చేస్తామని చెప్పారు.

గత రెండేళ్ళకు విడుదల చేయవలసిన సొమ్మే ఇంతవరకు విడుదల చేయలేదని స్పష్టం అవుతోంది. మరి అటువంటప్పుడు మైనార్టీల కోసం ఈ ఆర్ధిక సంవత్సరంలో రూ. 1,204 కోట్లు కేటాయించిందని ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ చెప్పుకోవడాన్ని ఏమనుకోవాలి?


Related Post