మనకోసం వారు..వారి కోసం మనం..

January 17, 2017


img

సరిహద్దుల వద్ద తీవ్ర వ్యతిరేక పరిస్థితుల మద్య ప్రాణాలకు తెగించి దేశాన్ని కాపాడుతున్న సైనికుల పరిస్థితి ఏవిధంగా ఉంటుందో  బి.ఎస్.ఎఫ్. జవాను తేజ్ బహద్దూర్ యాదవ్ ఇటీవల సోషల్ మీడియాలో పెట్టిన చిన్న వీడియో కళ్ళకు కట్టినట్లు చూపించింది. ఆ కారణంగా అతనిపై అధికారులు అతని పట్ల ఎంత కర్కశంగా వ్యవహరించారో కూడా అందరూ చూశారు. అంతకాలం దేశం కోసం ప్రాణాలొడ్డి సేవ చేసినవారి కష్టాలు పదవీ విరమణ చేసిన తరువాత కూడా కొనసాగుతూనే ఉంటాయి. ఒకవేళ శత్రువులతో పోరాడుతున్నప్పుడు అంగవైకల్యం పొందినట్లయితే ఇక వారి కష్టాలకు అంతే ఉండదు. అందుకే తెలంగాణా ప్రభుత్వం వారి కోసం కూడా కొన్ని సంక్షేమ చర్యలు చేపట్టింది.

ముఖ్యమంత్రి కేసీఆర్ ఈరోజు శాసనసభలో ఆ వివరాలను తెలియజేశారు. 

1. సైనికుల కోసం తెలంగాణా ప్రభుత్వం ప్రత్యేక నిధిని ఏర్పాటు చేస్తుంది. రాష్ట్ర, జిల్లా స్థాయిలో సైనికుల సంక్షేమ బోర్డుల ఏర్పాటు చేయబడతాయి. విధి నిర్వహణలో మరణించిన, అంగవైకల్యం పొందిన సైనికులకు ఆ ప్రత్యేకనిధి నుంచి సహాయం అందించబడుతుంది. దానికి ఏటా ముఖ్యమంత్రి,మంత్రులు  రూ.25,000, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు రూ.10,000 విరాళంగా ఇస్తారు. ప్రభుత్వోద్యోగులు ఒక్కరోజు వేతనం విరాళంగా ఇస్తారు.

2. ప్రభుత్వం ప్రకటించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళలో మాజీ సైనికులకు రెండు శాతం కేటాయించబడతాయి.

3. సర్వీసులో ఉండగా అనారోగ్యం లేదా ఇతర కారణాల చేత మరణించిన సైనికులకు యుద్ద సమయంలో మరణించిన వారికి ఇచ్చే విధంగానే పరిహారం చెల్లించబడుతుంది.

4. వివిధ అవార్డులు అందుకొన్న రాష్ట్రానికి చెందిన వీర సైనికులకు మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం తరపున ప్రత్యేకంగా బారీ పారితోషికాలను కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. పరమవీర చక్ర, అశోక్ చక్ర అవార్డులు పొందిన వారికి రూ.2.25కోట్లు, మహావీర చక్ర, కీర్తి చక్ర అవార్డులు అందుకొన్న వారికి రూ. 1.25 కోట్లు, వీరచక్ర, శౌర్య చక్ర అవార్డులు పొందిన సైనికులకు రూ. 75 లక్షలు ఇవ్వాలని నిర్ణయించినట్లు ముఖ్యమంత్రి తెలిపారు.

5. సేవ మెడల్, గ్యాలంట్రీ అవార్డు పొందిన సైనికులకు రూ. 30 లక్షలు, పెన్షన్ ఇన్ డిస్పాచెస్ గ్యాలంట్రీ అవార్డు అందుకొన్న సైనికులకు రూ. 25 లక్షలు పారితోషికంగా అందించబడుతుంది.

6. సర్వోత్తమ యుద్ధ సేవ మెడల్ పొందిన వారికి రూ. 25 లక్షలు, ఉత్తమ యుద్ధ సేవ మెడల్ పొందిన వారికి రూ. 20 లక్షలు, యుద్ధ సేవ మెడల్ పొందిన వారికి రూ. 5 లక్షలు ఇవ్వాలని నిర్ణయించినట్లు ముఖ్యమంత్రి తెలిపారు.


Related Post