బాంచెన్..నీ కాల్మొక్తా!

January 17, 2017


img

బాంచెన్..నీ కాల్మొక్తా! తమిళనాడు రాజకీయాలలో ఈటైపు బానిసత్వ లక్షణాలు చాలా కాలంగానే ఉన్నాయి. నిజానికి ఇవి అన్ని రాష్ట్రాలలోను ఉన్నాయి. కానీ తమిళనాడులో రెండాకులు ఎక్కువ కనుక మరీ స్పష్టంగా కళ్ళకు కట్టినట్లు కనిపిస్తుంటాయి. అక్కడ మంత్రులు కూడా నిసిగ్గుగా ముఖ్యమంత్రి కాళ్ళ మీదపడి స్రాష్టాంగ దండప్రమాణాలు చేస్తుంటారు. వారు పదవులు అధికారం కోసమే అంతకు దిగజారితే, వారి ఆ బలహీనతనే తమ బలంగా చేసుకొని పైకి ఎదగాలనుకొనేవారు మరికొందరు. వారిలో అన్నాడిఎంకె పార్టీ పగ్గాలు చేపట్టిన శశికళ, జయలలిత మేనకోడలు దీపా జయకుమార్ కూడా ఉన్నారు.

జయలలితకు అత్యంత ఆప్తులమని, ఆమె అడుగుజాడలలోనే నడుస్తుంటామని చెప్పుకొనే వారిరువురూ ఆమె ఆకస్మిక మరణంతో  ఏర్పడిన గొప్ప అవకాశాన్ని సొమ్ము చేసుకొని పదవులు, అధికారం చేపట్టాలని తహతహలాడిపోతున్నారు. నిజానికి వారిరువురికీ జయలలిత వారసురాలమని చెప్పుకొనేందుకు ఎటువంటి అర్హతా లేదు. అందుకే వారిద్దరూ కూడా జయలలితను అనుకరిస్తూ కట్టుబొట్టూ ధరించి  ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తుంటే వారిని తిరస్కరించకపోగా అన్నాడిఎంకె పార్టీలో కొందరు నేతలు, కార్యకర్తలు వారికి జైకొడుతూ తమ భుజాలకి ఎత్తుకొని మోసేందుకు సిద్దపడుతుండటం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. 

జయలలిత ఏటికి ఎదురీది రాజకీయాలలో తన సత్తా చాటుకొని, ప్రజాధారణ పొంది అందరి చేత అమ్మ అనిపించుకొంటే, ఆమె వారసులమని చెప్పుకొంటున్న శశికళ, దీపా ఇద్దరూ పదవులు, అధికారం చేపట్టేందుకు ఆమె కట్టుబొట్టు, హావభావాలను అనుకరిస్తూ దానినే ప్రధానమైన అర్హతగా భావిస్తుండటం చాల విచిత్రంగా అనిపిస్తుంది. ఇంకా విచిత్రమైన విషయం ఏమిటంటే, ఆ పార్టీ నేతలు, చాలా మంది ప్రజలు కూడా అదేవిధంగా భావిస్తుండటం!

వారిద్దరిలో శశికళ చాలా చురుకుగా వ్యవహరిస్తున్నట్లుగానే చెప్పవచ్చు. ఆమె ఈ నెల రోజుల వ్యవదిలోనే శరవేగంగా పావులు కదిపి పార్టీని హస్తగతం చేసుకొని, ఇప్పుడు ముఖ్యమంత్రి పదవిపై కూడా కన్నేశారు. ఒకవేళ ఆమె ముఖ్యమంత్రి పీఠం కూడా అధిష్టించినట్లయితే ఇక దీప ఎన్ని కుప్పిగంతులు వేసినా ప్రయోజనం ఉండబోదు. 


Related Post