ఆ ముఖ్యమంత్రిని ప్రజలు వెలివేశారా?

January 17, 2017


img

జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి మహబూబా ముఫ్తీని ఆ రాష్ట్ర ప్రజలు వెలివేశారా? అంటే తాజా సంఘటన చూసినవారికి అవుననే అనిపిస్తుంది. అమీర్ ఖాన్ ప్రధానపాత్రలో నటించిన దంగల్ సినిమాలో రెజ్లర్ గీతా ఫోగట్ చిన్ననాటి పాత్రలో కాశ్మీరీ బాలిక జైరా వసీం నటించిన సంగతి తెలిసిందే. ఆ చిత్రం ఘనవిజయం సాధించడంతో జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఆమెను తన వద్దకు పిలిపించుకొని అభినందించారు. 

అందుకు కాశ్మీర్ యువతగా చెప్పుకొనే కొందరు వ్యక్తులు సోషల్ మీడియా ద్వారా జైరా వసీంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఆమెను ప్రజలకు బహిరంగంగా క్షమాపణలు చెప్పవలసిందిగా డిమాండ్ చేయడం మొదలుపెట్టారు. ముఖ్యమంత్రి అసమర్ధత కారణంగానే కాశ్మీరీ యువతపై సైన్యం దాడులు చేస్తోందని, కాశ్మీరీ యువత పట్ల అనుచితంగా వ్యవహరిస్తున్న అటువంటి వ్యక్తిని వెళ్ళి కలుసుకోవడం ఏమిటని సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు. వారి ఒత్తిడికి తట్టుకోలేక జైరా వసీం మీడియా ద్వారా ప్రజలకు క్షమాపణలు చెప్పింది. ఆమె చెప్పిన మాటలు చాలా ఆలోచింపజేస్తున్నాయి.

“కాశ్మీర్ లో జరుగుతున్న అనేక పరిణామాల కారణంగా అనేకమంది ప్రజల మనోభావాలు దెబ్బతిన్నట్లు గ్రహించాను. ఆ కారణంగా నేను ఇటీవల కొందరు వ్యక్తులను కలవడం చాలా మందిని బాదించినట్లు నేను గ్రహించాను. కనుక నా చర్యల వలన ఎవరికైనా భాద కలిగితే వారిని క్షమాపణలు కోరుతున్నాను. ప్రస్తుతం నా వయసు కేవలం 16 ఏళ్ళు మాత్రమే కనుక పరిస్థితులను నియంత్రించగల శక్తి సామర్ధ్యాలు నాకు లేవని గ్రహించి అందరూ నా పరిస్థితిని సహృదయంతో అర్ధం చేసుకోవలసిందిగా ప్రార్ధిస్తున్నాను. నేను ఒక సామాన్యమైన బాలికను మాత్రమే తప్ప అందరికీ ఆదర్శంగా నిలబడగల గొప్ప వ్యక్తిని కాను. కనుక నన్ను ఆ విధంగానే చూడవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను,” అని జైరా వసీం అంది.

ఈ సంఘటన చూసినట్లయితే ఆ రాష్ట్ర యువత ముఖ్యమంత్రిని తమ శత్రువుగా భావిస్తున్నట్లు అర్ధం అవుతుంది. అందుకే ఆమెను కలుసుకోవడం కూడా పెద్ద నేరంగానే భావిస్తున్నారు. అంటే ఆ రాష్ట్రంలో ముఖ్యమంత్రికి ఎంత గౌరవం, విలువ ఉందో అర్ధం చేసుకోవచ్చు. ప్రజలే ముఖ్యమంత్రిని వేలివేసినట్లు వ్యవహరించడం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. ఈ సంఘటన కాశ్మీరీ యువతలో భారత్ పట్ల వ్యతిరేకత, వేర్పాటువాదం కూడా కళ్ళకు కట్టినట్లు చూపిస్తోంది. 


Related Post