ఆ డొక్కు సైకిల్ ఎవరిదంటే?

January 16, 2017


img

యూపిలో అధికార సమాజ్ వాదీ పార్టీపై ఆధిపత్యం కోసం మూలాయం సింగ్, ఆయన కుమారుడు అఖిలేష్ యాదవ్ పోరాడుకొంటున్న సంగతి తెలిసిందే. వారిద్దరూ కేంద్ర ఎన్నికల కమీషన్ వరకు కూడా వెళ్ళారు. ఇరుపక్షాల వాదనలు, వారు సమర్పించిన రికార్డులు అన్నీ పరిశీలించిన మీదట ఆ పార్టీ, దాని ఎన్నికల చిహ్నమైన సైకిల్ గుర్తూ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ కే చెందుతుందని ఈసీ సోమవారం తీర్పు చెప్పింది.

అఖిలేష్ కే పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల మద్దతు ఉండటంతో ముందు నుంచే ఈ పరిణామం అందరూ ఊహిస్తునందున ఎవరూ పెద్దగా ఆశ్చర్యపోలేదు. కానీ ములాయంసింగ్, ఆయన వర్గం ఈ షాక్ నుంచి తేరుకోలేకుండా ఉన్నారు. పార్టీని స్థాపించి, రాష్ట్రంలో బలోపేతం చేసి తన కొడుకుని ముఖ్యమంత్రి చేస్తే, అతను తనకే ఈవిధంగా ద్రోహం తలబెట్టడంతో ములాయం ఆగ్రహంతో ఊగిపోతున్నారు. త్వరలో జరుగబోయే ఎన్నికలలో తన కొడుకు మీద తనే స్వయంగా పోటీ చేసి అతనిని ఓడించి ప్రతీకారం తీర్చుకొంటానని శపథం చేశారు. 

ఒకవేళ ములాయం నిజంగానే అన్నంత పనీ చేస్తే అది తండ్రీకొడుకులిద్దరికీ అగ్నిపరీక్షగా మారుతుంది. ఒకవేళ దానిలో ములాయం ఓడిపోతే అతని రాజకీయజీవితంలో ఇది మరొక పెద్ద ఎదురుదెబ్బ అవుతుంది. ఒకవేళ ఆయన చేతిలో కొడుకు ఓడిపోతే అతనిదీ అదే పరిస్థితి అవుతుంది. అంతే కాదు వారిద్దరి కీచులాటలు చూసి ప్రజలు ఇద్దరినీ ఓడించి భాజపాకి అధికారం కట్టబెట్టినా ఆశ్చర్యం లేదు. కనుక ములాయం సింగ్ అటువంటి దుస్సాహసం చేయకపోవచ్చు.  

ఇక సమాజ్ వాదీ పార్టీపై అఖిలేష్ యాదవ్ కి పూర్తి ఆధిపత్యం లభించింది కనుక, ఆయన ప్రకటించిన అభ్యర్ధులే అధికార పార్టీ అభ్యర్ధులవుతారు. కనుక ఇంతకు ముందు ములాయం సింగ్ ప్రకటించిన అభ్యర్ధుల అందరి భవిష్యత్ ప్రశ్నార్ధకంగా మారవచ్చు. కనుక వారు కూడా పెద్దాయనకు టాటా బైబై చెప్పేసి కొడుకు తొక్కుతున్న ఆ డొక్కు సైకిల్ ఎక్కేసినా ఆశ్చర్యం లేదు. 


Related Post