ముఖ్యమంత్రే అన్నీ చూడాలా?

January 13, 2017


img

ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం ప్రగతి భవన్ లో పరిశ్రమలు, చేనేత, సమాచార శాఖల ప్రధాన కార్యదర్శులతో సమావేశం నిర్వహించి, చేనేత కార్మికులను ఆదుకోవడానికి చేపట్టవలసిన చర్యల గురించి చర్చించారు. చేపలు, గొర్రెలు, మేకల పెంపకం ద్వారా ఆయా కులాల వారిని ఆదుకొన్నట్లుగానే, సిరిసిల్లా, నల్గొండ, వరంగల్ జిల్లాలో దయనీయ పరిస్థితులను ఎదుర్కొంటున్న చేనేత కార్మికులను ఆదుకోవడానికి ప్రణాళికలు సిద్దం చేయాలని కోరారు. ముందుగా రాష్ట్రంలో చేనేత కార్మికులు ఎంతమంది ఉన్నారు? మర మగ్గాలు ఎన్ని ఉన్నాయి? వారు ఎటువంటి ఉత్పత్తులు చేస్తున్నారు? వాటి గిరాకీ ఏవిధంగా ఉంది? వంటి సమగ్ర సమాచారం సేకరించి తదనుగుణంగా ప్రణాళికలను సిద్దం చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించారు. 

ప్రభుత్వంలో అనేకశాఖలు, వాటికి మంత్రులు, కార్యదర్శులు, వేలాది మంది అధికారులు, ఉద్యోగులు, ప్రతీ జిల్లాకు కలెక్టర్లు, కమీషనర్లు ఉంటారు. ఇటువంటి పనులను నిర్వహించడానికే వారందరూ నియమింపబడ్డారు. కానీ వారు నిర్లక్ష్యంగా, అసమర్ధంగా వ్యవహరిస్తుండటం వలననే ప్రతీ విషయాన్నీ ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా చూసుకోవలసివస్తోందని చెప్పక తప్పదు. ఇప్పుడు ఆయనే స్వయంగా దృష్టి పెట్టారు కనుక త్వరలోనే వారి సమస్యల పరిష్కరింపబడే అవకాశం ఉందని నమ్మవచ్చు. 

చేనేత కార్మికుల సమస్య ఈరోజు కొత్తగా పుట్టింది కాదు. దశాబ్దాలుగా అలాగే ఉంది. మంత్రులు, అధికారుల నిర్లక్ష్యం కారణంగా వారి పరిస్థితి నానాటికీ ఇంకా క్షీణిస్తోంది. ఆర్ధిక సమస్యల కారణంగా అనేక మంది చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో సంస్థానం నారాయణపురం మండలంలోని పుట్టపాకలో గోలి శివాజీ (53) అనే చేనేత కార్మికుడు ఆర్ధిక సమస్యలు భరించలేక బుదవారం (జనవరి 11) తన ఇంట్లోనే పురుగుల మందు త్రాగి ఆత్మహత్య చేసుకొన్నాడు.  

అయినా సంబంధిత శాఖలో చలనం కలుగలేదు. పరిశ్రమల శాఖా మంత్రి కేటిఆర్ కొంచెం చొరవ తీసుకోవడంతో ఆ శాఖలో కొంచెం చలనం వచ్చింది కానీ చేనేత కార్మికుల కష్టాలను తీర్చగలిగేంత కాదు. ఒక్క చేనేత కార్మికులే కాదు రాష్ట్రంలో బీడీ కార్మికులు, రైతులు, దళితులు, బడుగు బలహీన వర్గాలు, విద్యార్ధులు ఇలాగ సమాజంలో ప్రతీ వర్గానికి ఉన్న సమస్యలను పరిష్కరించడానికి ప్రత్యేకంగా శాఖలు, మంత్రులు, అధికారులు, ఉద్యోగులు ఉన్నప్పుడు వారు ఆయా వర్గాల వారి సమస్యలను పరిష్కరించలేకపోతున్నారు? అన్నీ ముఖ్యమంత్రే స్వయంగా ఎందుకు చూసుకోవలసి వస్తోంది? అని వారు కూడా ఆలోచిస్తే బాగుంటుంది. వారే ఈ సమస్యలను పరిష్కరించినట్లయితే ప్రజలు, ముఖ్యమంత్రి అందరూ సంతోషిస్తారు..వారికీ, ప్రభుత్వానికి కూడా మంచి పేరు వస్తుంది కదా?  



Related Post