జగన్ కు కొమ్మినేని మేలుకొలుపు?

January 12, 2017


img

ప్రముఖ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు ఎన్.టీవి నుంచి సాక్షి మీడియాలో మారిన తరువాత ఆయన తన మేదస్సును ఉపయోగించి వర్తమాన రాజకీయాలను జగన్ కోణంలో నుంచే ప్రజలకు చూపించడం మొదలుపెట్టారు. ఆయన స్వంతంగా నిర్వహిస్తున్న కొమ్మినేని ఇన్ఫోలో కూడా వైకాపా అభిప్రాయాలకు, ఆలోచనలకు అద్దం పడుతున్నట్లుంటాయి. దానిలో జగన్ రాజకీయ భవిష్యత్ గురించి చాలా సున్నితంగా హెచ్చరిస్తూ ఈరోజు ఒక విశ్లేషణాత్మక ఆర్టికల్ ప్రచురించారు. దానిలో జగన్ చేస్తున్న పొరపాటు గురించి సున్నితంగా హెచ్చరించడం విశేషం.

“జగన్ ఎల్లప్పుడూ ప్రజల మద్య ఉంటూ వారి సమస్యలపై దృష్టి పెడితే సరిపోతుందని అనుకొంటే కష్టమే కావచ్చు. ఎందుకంటే చంద్రబాబు ఎన్నికల రాజకీయ రణ వ్యూహాలలో ఆరితేరినవాడు. ఆయన అధికారం కోసం ఎంతకైనా తగ్గగలరు అలాగే అధికారంలోకి వచ్చాక అంతకు ఎక్కువగా మారిపోగలరు. ఈ అంశాన్ని జగన్ గుర్తుంచుకోవలసి ఉంటుందన్న అభిప్రాయం లేకపోలేదు. జగన్ ఎక్కువసార్లు దేవుడే అన్నీ చూసుకొంటాడన్న చందంగా మాట్లాడుతుంటారు. వర్తమాన రాజకీయాలలో దేవుడి పాత్ర చాలా తక్కువేనని చెప్పాలి. ఎందుకంటే దేవుడికి కూడా అంతుపట్టని విధంగా అనైతిక రాజకీయాలు సాగే ఈ రోజులలో అయన ప్రత్యర్ధులకు దీటుగా వ్యూహాలు తయారు చేసుకోవడానికి సిద్దపడాలి. జనాధరణతో బాటు వ్యూహాలు కూడా ముఖ్యమే,” అని కొమ్మినేని సూచించారు.

ఆయన సున్నితంగా హెచ్చరించినా జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం అనుసరిస్తున్న వైఖరి సరిగా లేదని, దానిని చక్కదిద్దుకోకపోతే ప్రమాదం అని హెచ్చరిస్తున్నట్లుగానే భావించవచ్చు. పిల్లి మెడలో గంట ఎవరు కడతారన్నట్లు వైకాపా నేతలెవరూ జగన్మోహన్ రెడ్డికి ఇటువంటి సలహాలను ఇచ్చే సాహసం చేయలేరు. ఇస్తే వారికి మూడినట్లే. మరి కొమ్మినేని ఆ సాహసం చేశారు. జగన్ దానిని ఏవిధంగా స్వీకరిస్తారో చూడాలి.  


Related Post